స్పష్టమైన ఆవగాహనతో ఓటేస్తేనే ప్రజలు గెలుస్తారు: సీఎం కేసీఆర్
స్పష్టమైన ఆవగాహనతో ఓటేస్తేనే ప్రజలు గెలుస్తారు: సీఎం కేసీఆర్
'తెలంగాణ ఒకప్పుడు ఎట్లున్నది.. ఇప్పుడు ఎలా మారిందో గుర్తు చేసుకోవాలి. అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలి' అని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు.
స్పష్టమైన విధానంతో, అవగాహనతో ఓటింగ్ జరిగినప్పుడే ప్రజలు గెలుస్తారని, ప్రజల కోరికలు నెరవేరుతాయని చెప్పారు.
అభివృద్ధిని చూసి నన్ను దీవించండి
హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్
అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
ప్రజలందరి సహకారంతోనే నంబర్‌వన్‌గా తెలంగాణ
కాంగ్రెస్‌కు 10 చాన్స్‌లు ఇస్తే ప్రజలకు చేసిందేంది?
60 ఏండ్ల కిందే దళితబంధు ఉంటే పేదరికం ఉండేదా?
విధివంచితులను ఆదుకోవాల్సిన బాధ్యత సమాజానిదే
నేడు రైతులకు కంటినిండా నిద్ర.. కడుపునిండా కరెంటు
వడ్ల రాశులు చూస్తే లక్ష్మీదేవి నాట్యం చేస్తున్నట్టున్నది
మిషన్ భగీరథలాంటి పథకం ప్రపంచంలోనే లేదు
సీఎం హోదాలో మళ్లీ హుస్నాబాద్‌కు వస్తా: కేసీఆర్
అభ్యర్థి వొడితెల సతీశ్‌కు బీఆర్‌ఎస్ బీ-ఫాం అందజేత
తొమ్మిదిన్నరేండ్ల కిందట తెలంగాణ పరిస్థితి ఎంత భయానకమో గుర్తు చేసుకోవాలి. పోరాడి తెలంగాణ తెచ్చుకున్నట్టే.. ప్రజలందరి సహకారంతో తెలంగాణను ఈ రోజు అనేక రంగాల్లో నంబర్ వన్ స్థానానికి తీసుకుపోయినం. కేంద్రం సహకరించకున్నా, గౌరవెల్లిలాంటి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఎన్ని కేసులు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా అన్నింటినీ అధిగమించుకొంటూ ఒక్కొక్కటీ పూర్తిచేసుకొంటూ వచ్చాం. అద్భుతమైన విజయాలు సాధించాం. ఆ క్రమం కొనసాగాలి.
-సీంఎ కేసీఆర్
'తెలంగాణ ఒకప్పుడు ఎట్లున్నది.. ఇప్పుడు ఎలా మారిందో గుర్తు చేసుకోవాలి. అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలి' అని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. స్పష్టమైన విధానంతో, అవగాహనతో ఓటింగ్ జరిగినప్పుడే ప్రజలు గెలుస్తారని, ప్రజల కోరికలు నెరవేరుతాయని చెప్పారు. సిద్దిపేట జిల్లా హు స్నాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి వొడితల సతీశ్‌కుమార్‌కు బీఫారం అందజేశారు. 'సభ సాక్షి గా, మీ అందరి సాక్షిగా సతీశ్‌కు బీఫారం అందిస్తున్నాను. మీ బిడ్డగా దీవించండి' అని ప్రజల ను కోరారు. అనంతరం ప్రసంగిస్తూ.. 2018 లో అసెంబ్లీ ఎన్నికల మొదటి సభను హుస్నాబాద్‌లోనే నిర్వహించినట్టు గుర్తు చేశారు. 'హుస్నాబాద్ గడ్డ ఆశీర్వాదంతో ఆనాడు నాలుగిం ట మూడు వంతులు.. అంటే 88 సీట్లతో అఖం డ విజయాన్ని సాధించినం. ఈసారి కూడా మళ్లీ హుస్నాబాద్ నుంచే జైత్రయాత్ర ప్రారంభించాలని పెద్దలు సూచించారు. అందుకే ఈ రోజు హైదరాబాద్‌లో అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసి, మ్యానిఫెస్టో ప్రకటించి, మీ దర్శనానికి ఇక్కడికి వచ్చాను' అని చెప్పారు.
రౌతేందో.. రత్నమేందో గుర్తించాలె
తాను చెప్పే విషయాలను విని వదిలేయకుండా ఇంట్లో, బస్తీలో, గ్రామంలో, తండాల్లో చర్చించాలని ప్రజలను కేసీఆర్ కోరారు. 'ఎన్నికలు చాలా వస్తయి, చాలా పోతయి, ఎవరో ఒకరు గెలుస్తుంటరు. ఎన్నికలు రాంగనే ఆగమాగం కావొద్దు. రౌతేందో.. రత్నమేందో ఆలోచించాలె. మనకు పనికొచ్చేదేందో గుర్తు వ ట్టాలె' అని అన్నారు. ఎవరో చెప్పారని ఓట్లు వేయొద్దని, ఓటు మన తలరాతను మారుస్తుందని చెప్పారు. మన గ్రామం, మన మండలం, మన జిల్లా, మన రాష్ట్ర తలరాతను మార్చే శక్తి ఓటుకు ఉన్నదని అన్నారు.
10 చాన్స్‌లిస్తే ఏం చేశారు?
'ఎన్నికలు రాంగనే కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతరు. అలవిగాని హామీలు ఇస్తరు. ఆపద మొక్కులు మొక్కుతరు. తీర్థం పోదాంపా తిమ్మక్క అంటే నేను గుళ్లె, నేను సల్లె అన్నట్టుగా.. యాడికి తీసుకపోతరో తెల్వదు' అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కొన్ని పార్టీలు వచ్చి ఒక్క చాన్స్ ఇవ్వాలని అడుగుతున్నాయ ని మండిపడ్డారు. 'ఒక్క చాన్స్ ఎందుకు నాయ నా ప్రజలు మీకు 10 చాన్సులు ఇచ్చారు కదా.. 60 ఏండ్లు మీరే రాజ్యం ఎలుగవెట్టిర్రు కదా. చేసిందేమిటి?' అని ప్రశ్నించారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో దళితులు ఇంకా పేదరికంలో మగ్గుతున్నారంటే అందరం బాధపడాలని, దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. ఒకవేళ 60-70 ఏండ్ల కిందటే దళితబంధులాంటి పథకం పెట్టి ఉంటే, ఇప్పుడు దళితుల్లో ఎందుకు పేదరికం ఉండేదో ఆలోచించాలని తెలిపారు. ఈ విధాన లోపం ఎవరిదని ప్రశ్నించారు. 50 ఏండ్లు రాజ్యం చేసి, ఇప్పు డు మల్లా ఓట్లడిగేటోళ్లు పాలించిన జమానాలో కరెంటు పరిస్థితి ఎట్లా ఉండేదో గుర్తు చేసుకోవాలని అన్నారు.
తెలంగాణలో ఇప్పుడు రైతుకు తెల్లందాక కరెంటు పెట్టబోయే బాధ లేదు. ఇప్పుడు కంటి నిండా నిద్ర.. కడుపు నిండా కరెంటు .. కల్లాల నిండా వడ్లు. రెండు నెలలు వందల లారీలు పెట్టి గుంజినా తరగని వడ్లు. కల్లాలు ఒడుస్తలేవు. ఏ గ్రామంలో చూసినా, ఏ తారు రోడ్డులో చూసినా ధాన్యపు రాశులతో నిండిపోయాయి. వాటిని చూస్తే లక్ష్మీదేవి నాట్యం చేస్తున్నట్టుగా ఉన్నది. ఇవన్నీ ఊరికే రాలేదు.. వాటి వెనుక ఎంతో కృషి ఉన్నది.
-సీఎం కేసీఆర్
వారిని ఆదుకొనే బాధ్యత సమాజానిదే
గతంలో పింఛన్ రూ.40, రూ.70 చివరగా రూ.200 ఇచ్చారని కేసీఆర్ గుర్తు చేశారు. తాను సీఎం అయిన తర్వాత 'ఎందుకు పెన్షన్ ఇవ్వాలి?. దానికి ఏమన్నా ప్రత్యేక కారణం ఉన్నదా? ఓట్ల కోసం మాత్రమే ఇస్తున్నామా?' అని అధికారులను అడిగానని చెప్పారు. అప్పు డు తేలిందేమిటంటే.. దురదృష్టవశాత్తూ మాన వ సమాజంలో కొందరు విధివంచితులు ఉం టారని, వారిని డెస్టిట్యూట్స్ అంటారని అన్నా రు. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పిల్లలు సరిగా చూడని వృద్ధులు ఉం టారని, ఏ రోజుకైనా వాళ్లందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత సమాజానిదేనని స్పష్టం చేశారు. అందుకే పింఛన్ పెంచాలని నిర్ణయించినట్టు చెప్పారు. మానవీయ కోణంలో ఒకేసారి పింఛన్‌ను రూ.వెయ్యికి పెంచామని చెప్పారు. తొలివిడత పూర్తయ్యేసరికి రూ.2 వేలకు తీసుకుపోయామని గుర్తుచేశారు. ఇప్పుడు రూ.5 వేలకు పెంచబోతున్నట్టు చెప్పారు. ఓట్ల కోసం ఒకే రోజులో రూ.5 వేలకు పెంచుతామని చెప్పలేదని, మొదట రూ.3 వేలకు పెంచి తర్వాత ఏటా రూ.500 పెంచుతూ ఐదేండ్లు ముగిసేనాటికి రూ.ఐదు వేల పెన్షన్ ఇస్తామని తెలిపారు. రైతుబంధు పెట్టాలని తనను ఎవరూ అడగలేదని, ఎవరూ డిమాండ్ చేయలేదని చెప్పారు. ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నామని, దాన్ని ఇంకా పెంచుతున్నామని చెప్పారు.
హుస్నాబాద్ అద్భుతంగా మారింది
ఒకప్పుడు హుస్నాబాద్‌కు హెలికాప్టర్‌లో వస్తుంటే కండ్లల్లో నీళ్లు వచ్చేవని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కుండల్లో నీళ్లు తీసుకుపోయి తోట లో మొక్కలు కాపాడుకున్న ఘటనలను చూశానని చెప్పారు. ఇప్పుడు హెలికాప్టర్ నుంచి చూస్తే హుస్నాబాద్ వాగుమీద రెండుమూడు చెక్‌డ్యాంలు వరుసగా కనిపిస్తున్నాయని, రెం డిట్లో నీళ్లు ఉన్నాయని తెలిపారు. కనుచూపుమేర పచ్చని పంటపొలాలు దర్శనమిస్తున్నాయని చెప్పారు. హుస్నాబాద్‌కు అటు దేవాదుల, ఇటు తోటపల్లి బరాజ్ నుంచి నీళ్లు వస్తున్నాయని, 1.10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే గౌరవెల్లి ప్రాజెక్టును దాదాపు పూర్తి చేసుకున్నామని చెప్పారు. ఎలక్షన్ తర్వాత 6 నెలలు కష్టపడితే లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని తెలిపారు. 'ఇక్కడ ఓట్ల కోసం ఒక్క చాన్స్ ఇవ్వమని అడిగేందుకు వస్తున్నారు.. మోసకపోకండి. ఆ పెద్దలు ఇక్కడ చాలా వెలగబెట్టారు. మహా సముద్రం గండిని ఆగంబట్టించారు. దాని గురించి నాడు బీసీ వెల్ఫేర్ మినిస్టర్‌గా ఉన్న కెప్టెన్ లక్ష్మీకాంతారావు నాకు చెప్పారు. ఇదొక్కటి పూర్తి చేస్తే 10-12 ఊళ్లకు మేలైతది, భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అప్పుడు చేస్తానని మాటిచ్చా. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిత్రుడు కవ్వా లక్ష్మారెడ్డి, లక్ష్మీకాంతరావు, సతీశ్‌తో కలిసి మహాసముద్రం గండి పనులన్నీ పూర్తి చేశాం. 12 ఊర్లలో నీటి ఊటలు పెరిగినయ్’ అని పేర్కొన్నారు.
బామ్మర్ది చెప్పిండనో, మేనమామ చెప్పిండనో, సుట్టం చెప్పిండనో ఓట్లు వేయొద్దు. ఆ పద్ధతి బంద్ కావాలి. కచ్చితంగా ఆలోచించి, స్పష్టమైన విధానంతో, స్పష్టమైన అవగాహనతో ఓటింగ్ జరిగినప్పుడు తప్పకుండా ప్రజలు గెలుస్తారు. ప్రజల కోరికలు నెరవేరుతాయి.
-సీఎం కేసీఆర్
మళ్లీ ముఖ్యమంత్రి హోదాలో వస్తా
చిగురుమామిడి మండలం ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉండేదని ఇప్పుడు మిడ్ మానేరు నీళ్లతో పచ్చని ప్రాంతంగా మార్చామని సీఎం కేసీఆర్ చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదేనని అన్నారు. 'ఎన్నికలు అయిపోయిన ఐదారు నెలల్లో దాన్ని పూర్తి చేసి, దాని నుంచి నీళ్లు విడుదల చేయడానికి నేనే సీఎం హోదాలో మళ్లీ వస్తా' అని చెప్పారు. శనిగరం ప్రాజెక్టు కాలువ పూర్తవుతుందని, కొత్తకొండ వీరభద్రుడి ఆలయాన్ని బాగు చేసే బాధ్యత కూడా తానే తీసుకుంటానని చెప్పారు. సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారిగా మార్చే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు.
బిందెతో ఆడబిడ్డ కనిపిస్తే రాజీనామా చేయమన్నా!
ప్రపంచంలో మిషన్ భగీరథలాంటి పథకం ఎక్కడా లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నీళ్లు ఎక్కడి నుంచి ఇంటికి వస్తున్నయో ఎవరికీ తెలియదని, ఎక్కడా గొయ్యిలు, మోటర్లు, పంపులు లేవని పేర్కొన్నారు. ఏ ఊర్లో ఏ లెవల్ ఎంతున్నదో కొలిచి పైపులైన్లు వేశామని, దీంతో నేరుగా వచ్చి నీళ్లు ట్యాంకులో పడుతున్నాయని తెలిపారు. 'ఎక్కడైనా ఆడబిడ్డ బిందె పట్టుకొని రోడ్డెక్కితే వెంటనే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని ఆ నాడు చెప్పిన. అంతలా శపథం తీసుకున్నా. నాడు ఎమ్మెల్యేలు, అధికారులు, మంత్రులు అందరు కలిసి పనిచేస్తే.. నేడు మనం మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్నాం' అని పేర్కొన్నారు.
హుస్నాబాద్ గెలుపే నాంది కావాలి
హుస్నాబాద్ గెలుపే రేపు 95-105 సీట్ల మధ్య బీఆర్‌ఎస్ గెలువడానికి నాంది కావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. 'ఈ తొలి బహిరంగ సభలో నేను మీ ఆశీర్వాదం కోరుతున్నాను. దీవించండి. బ్రహ్మాండమైన మ్యానిఫెస్టోను విడుదల చేసినం. కార్యకర్తలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్, సర్పంచులు అందరూ బాధ్యత తీసుకోండి. మ్యానిఫెస్టోను ప్రతి ఇంటికీ పంచిపెట్టండి' అని సూచించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ చాలా మంచి ఎమ్మెల్యే అని, అందరి తలలో నాలుకలా ఉంటాడని చెప్పారు. 'మీ సేవకోసం బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ఇటువంటివారు చాలా తక్కువగా ఉంటారు. ఆయన సేవలు వినియోగించుకునేందుకు భారీ మెజార్టీతో ఒడితల సతీశ్‌కుమార్‌ను గెలిపించాలి' అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Oct 19 2023, 09:55