సీట్ బెల్ట్ పెట్టుకోలేదని పోలీసుల కారునే ఆపిన వ్యక్తి..
సీట్ బెల్ట్ పెట్టుకోలేదని పోలీసుల కారునే ఆపిన వ్యక్తి.. రూల్స్ సామాన్యులకేనా అంటూ నిలదీత, వీడియో వైరల్
కారు ఫ్రంట్ సీట్‌లో కూర్చుని సీటు బెల్ట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను గుర్తించి నిలదీశాడు ఓ సాధారణ వ్యక్తి. రూల్స్ సాధారణ ప్రజలకేనా పోలీసులకు వర్తించవా అంటూ ప్రశ్నించారు. నడిరోడ్డుపై ఓ యువకుడు పోలీసులను ప్రశ్నించిన తీరు చూస్తుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
కారు డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవర్‌తో పాటు ఫ్రంట్ సీట్లో కూర్చున్న వారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి. లేదంటే జరిమానా తప్పదు. కొందరు సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణిస్తూ.. మధ్యలో వాహన తనిఖీలు ఎదురైనప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటారు. మెట్రో పాలిటన్ నగరాల్లో సీట్ బెల్ట్(Police Without Seatbelt) పెట్టుకోకుండా ప్రయాణించేవారికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు.
సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కారణంగా ప్రమాదాల్లో చాలా మంది మృత్యువాత పడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. అందుకే ఆయా ప్రభుత్వాలు సీట్ బెల్ట్‌ను సేఫ్టీ ఫీచర్‌గా తప్పనిసరి చేశాయి. చాలా మంది దీనిని ఉల్లంఘిస్తూ జరిమానాలు ఎదుర్కోవడమే కాకుండా యాక్సిడెంట్స్‌లో బలి అవుతున్నారు. అయితే ఈ నిబంధన కేవలం సాధారణ వ్యక్తులకేనా అంటే కాదు.. అందరికీ వర్తిస్తుంది.
ఈ నేపథ్యంలో పోలీసులు సీట్ బెల్ట్(Police Without Seatbelt Viral Video) పెట్టుకోకపోవడంతో యువకుడు కారును ఆపి వారిని నిలదీసిన సంఘటన కేరళలో చోటుచేసుకుంది. కన్నూర్‌లో పోలీసులు సీట్ బెల్టులు పెట్టుకోకుండా కారులో పెట్రోలింగ్‌కు వచ్చారు. అయితే ఇది గమనించిన అక్కడే ఉన్న ఓ యువకుడు వారు పోలీసులు అని కూడా చూడకుండా వారి కారును ఆపాడు.
చట్టం సామాన్య ప్రజల కోసమేనా.? పోలీసులకు వర్తించదా అంటూ కారులో ఫ్రంట్ సీట్లో కూర్చున్న సీనియర్ పోలీసు అధికారిని ప్రశ్నించాడు.
అయితే ఈ సంభాషణ అంతా మళయాళంలో జరుగుతుంది. యువకుడు నిలదీయడంతో కోపం వచ్చిన పోలీసు అధికారి కారులో నుంచి దిగి అతడితో వాగ్వాదానికి దిగారు. అయినప్పుడు ఆ వ్యక్తి వెనక్కి తగ్గలేదు. ఆ కాసేపటికి కారులో వెనుక కూర్చున్న పోలీసులు సైతం కిందికి దిగి అతడితో గొడవకు దిగారు.
డ్యూటీలో ఉన్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించావంటూ యువకుడిని పోలీసులు తిట్టిపోస్తున్నారు. వెంటనే కారులో నుంచి పేపర్, పెన్ తీసుకుని యువకుడికి వ్యతిరేకంగా కంప్లెయింట్ రాస్తూ సంతకం చేయమని ఆ వ్యక్తిని బలవంతం చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. అయితే ఈ గొడవ మొత్తాన్ని అక్కడే ఉన్న సాధారణ ప్రజలు గమనిస్తున్నారు.
యువకుడిని ఒక్కడిని చేసి పోలీసులు గొడవకు దిగుతున్నారని భావించిన స్థానికులు.. యువకుడికి మద్దతుగా నిలిచారు. సంఘటనను తమ ఫోన్లలో రికార్డు చేశారు. ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తూ పోలీసులతో గొడవకు దిగారు. గొడవ పెద్దది అవుతుండటంతో లాభం లేదనుకున్నారేమే.. కాసేపటికి అక్కడి నుంచి తమ వాహనంలో వెళ్లిపోయారు.
గతేడాది టాటా సన్స్ గ్రూప్ మాజీ ఛైర్మన్ కారు ప్రమాదంలో మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలాంటి ప్రమాదాల కారణంగానే కారు వెనుక సీట్లలో కూర్చున్న వారికి కూడా సీట్ బెల్ట్ ధరించడం ఆవశ్యకతపై ఆటో మేకర్లు దృష్టి సారిస్తున్నారు. పోలీసులు కూడా సీటు బెల్టు పెట్టుకోని వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
Oct 15 2023, 22:26