NLG: జీవో 59 ద్వారా జర్నలిస్టుల ముసుగులో ప్రభుత్వ భూమి క్రమబద్ధీకరణ.. కలెక్టర్ కు ఫిర్యాదు
ఎలాంటి నిర్మాణం లేకుండానే ఇంటి నెంబరు కేటాయించారు..!
నల్గొండ: జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాల విషయములో పెద్దన్న పాత్ర పోషించేందుకు వెళ్లి తమ సొంత ప్రయోజనం చూసుకొని సమస్త జర్నలిస్టులకు అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నల్లగొండ సమస్త జర్నలిస్టులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరణ జిఓ 59 పేరుతో జర్నలిస్టుల ముసుగులో కొందరు ప్రధాన జర్నలిస్టులు తప్పుడు ధృవీకరణ పత్రాలతో ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరణ చేసుకొన్న విషయమై.. విచారణ జరిపి రద్దు చేయాలని సమస్త జర్నలిస్టులు అందరూ గురువారం స్థానిక పీఆర్టీయూ భవన్ లో యూనియన్ లకు అతీతంగా నల్గొండ జర్నలిస్టుల హౌజింగ్ సోసైటీ సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
అనంతరం జర్నలిస్టుల ముసుగులో 59 జీఓ నియమాలను తుంగలో తొక్కి భూమిని కాజేసిన 10 మంది జర్నలిస్టులపై జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కు వినతి పత్రం అందజేశారు. అక్రమంగా ప్రభుత్వ భూమిని కాజేసిన వారి వివరాలను ఫిర్యాదు వెంట జతపరిచామని వెంటనే విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ రెవిన్యూ పరిధిలోని సర్వే నెం. 370, 371లలో కొందరు వ్యక్తులకు రెవిన్యూ, మున్సిపల్ అధికారులు గత 13 సంవత్సరాలుగా ఆయా సర్వే నెంబరులో నివాసముంటున్నట్లు తప్పుడు దృవీకరణ పత్రాలు సృష్టించి.. మున్సిపల్, రెవిన్యూ అధికారుల సహకారంతో రాజకీయ నాయకుల ఆదేశాలకు తలొగ్గి ఇంటి స్థలాలను కేటాయించుకున్నారని ఆరోపించారు.
జాబితాలో తహశీల్దార్ బంధువులు, ఎంఎల్ఎ అనుచరులు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని, ఆ స్థలంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణం లేకుండానే ఇంటి నెంబరు కేటాయించారని వెంటనే తప్పుడు క్రమబద్దీకరణపై విచారణ జరిపి, రద్దు చేయడంతో పాటు దానికి బాధ్యులైన రెవిన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బందిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం అందించి కోరారు.
ప్రింట్, ఎలాక్రానిక్ మీడియా, ఫోటో, వీడియో జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల పేరిట ఎమ్మేల్యే, అధికారులతో చర్చించి చివరకు ఓ పది మంది జర్నలిస్టులు తమ సొంత ప్రయోజనం చేకూర్చుకొని జిల్లా కేంద్రంలోని 200 మంది జర్నలిస్టుల పొట్ట కొట్టారని అవేదన వ్యక్తం చేశారు.
భవిష్యత్ లో సమస్త జర్నలిస్ట్ లకు న్యాయం జరిగే వరకూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని అవసరమైతే రాష్ట్ర సంఘ నాయకత్వంతో చర్చించి జర్నలిస్టుల ముసుగులో భూమిని అక్రమంగా క్రమబద్ధీకరణ చేసుకున్న వారిపై చర్యలు తీసుకునే వరకూ ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అవసరమైతే వీరి యజమాన్యాలకు సమగ్రమైన నివేదికతో ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ కర్ణన్.. జీవో నెంబర్ 59 ద్వారా జర్నలిస్టుల ముసుగులో ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరణ విషయంపై విచారణ జరిపి బాధ్యులపై, అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నల్గొండ జిల్లా జర్నలిస్టుల హౌసింగ్ సోసైటి సాదన సమితి నాయకులు తెలిపారు..
SB NEWS NALGONDA DIST
SB NEWS TELANGANA
Oct 13 2023, 10:54