RR: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ శిక్షణ శిబిరం
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాలు నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించిన దాదాపు 319 బూత్ లకు టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని తారా కన్వెన్షన్ సెంటర్లో మంగళ వారం బూత్ సాయి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ శిబిరానికి నియోజకవర్గంలోని ఎంపిక చేయబడ్డ బూత్ కమిటీ సభ్యులు హాజరు కావడం జరిగింది. వారికి టిపిసిసి ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, టిపిసిసి బూత్ ఎన్ రోల్ ట్రైనింగ్ కమిటీ కన్వీనర్ పవన్ మల్లాది హాజరై.. బూత్ కమిటీ సభ్యులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో బూత్ స్థాయిలో పోల్ మేనేజ్ మెంట్, ప్రచార వ్యూహం, ఓటర్ల కలయిక, పార్టీ పటిష్టత,సోషల్ మీడియా తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా టిపిసిసి ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉందని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ జెండాను భుజానమోస్తున్న ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటానని తెలియజేశారు.
రాబోయే ఎన్నికలు చాలా కీలకమని, అధికార పార్టీ నాయకులు అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని దొడ్డిదారిన గెలవాలని ప్రయత్నం చేస్తుందని దాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలను మేనిఫెస్టోను ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని ప్రజలతో మమేకం అయ్యే బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఈ 45 రోజుల సమయంలో పార్టీ కార్యకర్తలు పూర్తి సమయం ఇచ్చి పని చేయాలని పార్టీ గెలుపు కోసం అందరం కష్టపడదామని, ప్రతి కార్యకర్త కష్టసుఖాలను నేను దగ్గరుండి చూసుకుంటా అని తెలియజేశారు. అవినీతి బంధుప్రీతికి భూకబ్జాలకు కేరాఫ్ గా ఉన్న టిఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. త్వరలో నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి అందరితో చర్చించి ప్రతి కుటుంబాన్ని కలుస్తామని, ప్రతి గడప తొక్కుతానని.. ప్రతి తండా..గ్రామం తిరుగుతానని చెప్పారు.
కాంగ్రెస్ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల మున్సిపల్ నాయకులతో పాటు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్, మండల, మున్సిపల్ అధ్యక్షులు, గౌరవ ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఉపాధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్స్ వార్డు సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్లతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Oct 11 2023, 16:27