మునుగోడు: సోలిపురం బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ
నల్లగొండ జిల్లా:
మునుగోడు ఉప ఎన్నికలలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఇచ్చిన హామీ అమలులోకి వచ్చింది. ఉపఎన్నికల్లో టి ఆర్ యస్ ఆభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించిన పక్షంలో మునుగోడు మండల కేంద్రం నుండి సోలిపురం గ్రామం మార్గం మధ్యలో బ్రిడ్జి నిర్మాణం కోసం దశాబ్దాల తరబడి నిరీక్షణకు తెర దించుతానంటూ మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అంతే కాకుండా ఆ ఎన్నికల్లో విజయం సాధించిన మీదట పలుమార్లు స్థానిక శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తో కలసి రాష్ట్రస్థాయి నీటి పారుదల శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. అందుకు అనుగుణంగా అధికారులు రూపొందించిన డి పి ఆర్ ను మంత్రి జగదీష్ రెడ్డి స్వయంగా తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి విషయాన్ని వివరించగా, అందుకు స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సోలీపురం బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఆదేశాలతో శనివారం రోజున అధికారులు 404.50 లక్షల నిధులతో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
దశాబ్దాల కాలం నుండి ఏ ఎన్నికలు వచ్చినా మునుగోడు నియోజకవర్గ కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న సోలిపేట బ్రిడ్జి ఎన్నికల అంశంగా పతాక శీర్షికలకెక్కేది. అటువంటి సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న బ్రిడ్జి నిర్మాణానికి ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలు ముగింపు పలికాయి. ఆ ఎన్నికల్లో అన్నీ తానై భుజాల మీద వేసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి రాజకీయాలకతితంగా గ్రామస్తులు అందరూ ముక్తకంఠంతో తేవడం తో స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించి, సాంకేతికంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా డి పి ఆర్ రూపొందించి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతులు తీసుకోవడంతో కధ సుఖాంతం అయి, శనివారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ఎన్నికలు పూర్తి అయిన మీదట ఎప్పటి మాదిరి గానే అటకెక్కుతుందేమో అనుకున్న తీరుకు భిన్నంగా సోలిపురం బ్రిడ్జి నిర్మాణానికి ఉత్తర్వులు జారీ కావడంతో మునుగోడు మండలం సోలిపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. SB NEWS NALGONDA DIST
SB NEWS TELANGANA
Oct 07 2023, 22:14