చండూరు: ఒంటి కాలు పై నిలబడి నిరసన తెలిపిన అంగన్వాడీ ఉద్యోగులు
నల్లగొండ జిల్లా, చండూరు: అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని సిఐటియు చండూరు మండల కన్వీనర్ జెర్రీపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె 8వ రోజు చేరుకున్న సందర్భంగా అంగన్వాడి ఉద్యోగులు ఒంటి కాలు పై నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, వారి సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడి సిబ్బందితో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని ఆరోపించారు. వీరిచే ఇతర పనులు కూడా చేయించుకుంటూ శ్రమను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.
రికార్డుల నిర్వహణ పేరిట అధికారులు వేధింపులు గురి చేస్తున్నారని, కొత్త యాప్ లు తీసుకొచ్చి మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు కనీస వసతులు కరువయ్యాయని పేర్కొన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, గతంలో మంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని కోరారు. అదనపు పనులను రద్దు చేయాలని, అంగన్వాడీల పై ప్రజాప్రతినిధుల పెత్తనాన్ని నివారించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న టిఎ, డిఎ ఇతర అలవెన్స్ ను వెంటనే విడుదల చేయాలన్నారు.
అంగన్వాడీల సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు అంగన్వాడీ సిబ్బంది చేసే సమ్మెకు పూర్తిగా మద్దతుగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సత్తమ్మ, తారకమ్మ, నాగమణి, రమణ, విజయలక్ష్మి, కేదారి, జగదీశ్వరి, సునీత, తదితరులు పాల్గొన్నారు.
Sep 19 2023, 22:01