అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపిన పలు సంఘాలు
నల్లగొండ జిల్లా, చింతపల్లి: తమ న్యాయమైన డిమాండ్ల కోసం చట్టబద్ధంగా నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య హెచ్చరించారు.
గురువారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో, నిరవధిక సమ్మె నాలుగవ రోజులో భాగంగా చింతపల్లి ప్రాజెక్టు ఐసిడిఎస్ ఆఫీసు ముందు ముట్టడి జరిగింది. ప్రాజెక్టు ఆఫీస్ నుండి తాహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమ్మె శిబిరానికి హాజరై వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతూ, అంగన్వాడి సెంటర్ల తాళాలు పగలగొట్టించడం దిక్కుమాలిన చర్య అని ఆరోపించారు. పోరాడే సంఘాలను చర్చలకు పిలవకుండా భజన సంఘాలను పిలవడం అప్రజా స్వామికమని ఏద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగుల పర్మినెంట్, కనీస వేతనం తదితర డిమాండ్స్ పరిష్కరించాలని సీఐటీయూ ఎఐటియుసి సంఘాల జేఏసీ అధ్వర్యంలో ఈనెల సెప్టెంబర్ 11 నుండి రాష్ట్రం లో నిరవధిక సమ్మె చేస్తున్నామన్నారు. పోరాడే సంఘాలను చర్చలకు పిలవక పోవటం అప్రజాస్వామికం. మళ్ళీ పాత పద్ధతి లోనే అంగన్వాడీ ఉద్యోగులను మోసం చేస్తూ ఐసిడిఎస్ మంత్రి హామీలు ఉన్నాయని చెప్పారు. మంత్రి హామీలు సమస్యలను పరిస్కారం చేయక పోగా మరింత అసంతృప్తిని పెంచిందని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 12న మంత్రి సత్యవతి రాథోడ్ అత్యంత దుర్మార్గమైన పద్దతిని అనుసరించి పోరాటంలో లేని సంఘాలతో చర్చలు జరిపారని తెలిపారు. అతి ముఖ్యమైన డిమాండ్స్ ఐన.. పర్మినెంట్, కనిసవేతనం, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ పెంపు తదితర ముఖ్యమైన డిమాండ్స్ ను ఏవి కూడా ప్రస్తావించలేదని అన్నారు. బతికి ఉన్నప్పుడు కావాల్సిన సౌకర్యాలను కల్పించకుండా, ఆ డిమాండ్స్ ను పక్కన పెట్టి కేవలం చనిపోయిన తర్వాత దాహన సంస్కారాలు నిర్వహించడానికి టీచర్లకు 20 వేలు, ఆయాలకు 10 వేలు ప్రభుత్వం నిర్ణయం చేయడం దుర్మార్గం అని అన్నారు. ఇందులో కూడా టీచర్లకు, ఆయాలకు అమౌంట్ లో వ్యత్యాసం చూపించటం సరైంది కాదు. ఇద్దరికి సమానంగా నిర్ణయం చేయాలని హితవు పలికారు.
ఇన్సూరెన్స్ 2 లక్షలు అన్నారు కానీ జీఓ రాలేదు. మినీ వర్కర్ల సర్కులర్లో మినీలను మెయిన్ టీచర్స్ గా నియామకం, హెల్పర్ల నియామకం పైన స్పష్టత లేదు. షరతులు అనే అంశం మినీ టీచర్స్ కు ప్రమాదకరంగా ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మళ్లీ పాతదే ప్రకటించారు.మొత్తానికి మంత్రి చర్చలు అప్రజాస్వామికంగా జరిగాయని ఆరోపించారు. మళ్లీ అంగన్వాడి ఉద్యోగుల్ని మోసం చేసే విధంగా హామీలు ఇచ్చారన్నారు. ఈ మోసపూరిత విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, మద్దతు తెలుపుతూ తన ఆటపాటలతో చైతన్య గీతాలు ఆలపించాడు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఎఐటియుసి) జిల్లా అధ్యక్షురాలు వసంతి, శాంత కుమారి, ఇందిరా, ఉమా, యాదమ్మ, అలివేలు, రేణుక, సరిత, తదితరులు పాల్గొన్నారు.
Sep 15 2023, 22:28