నార్కట్ పల్లి: అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి: మేడి ప్రియదర్శిని
నల్లగొండ జిల్లా,
నార్కట్ పల్లి: తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఉద్యోగులు చేపట్టిన ధర్నా లో గురువారం, బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని పాల్గొని మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. 40 ఏండ్ల నుంచి సేవలందిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులను ఎందుకు పర్మినెంట్ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అంగన్వాడీ ఉద్యోగులు గ్రామాల్లో బాలింతలకు, పిల్లలకు పౌష్టికారాన్ని అందిస్తున్నారని, ప్రభుత్వ సర్వేలు చేపడుతున్నారన్నారు. ఇప్పటికీ అంగన్వాడీ టీచర్ రూ.13,843, ఆయాలకు రూ.7,800 వేతనాలు ఇస్తున్నారని, వాటితో వారి కుటుంబం ఎలా గడుస్తుందని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి రూ.26,000/- కనీస వేతనమివ్వాలన్నారు.
నిత్య సరుకులు ధరలు విపరీతంగా పెరిగాయి, ఇంటి అద్దెలు, గ్యాస్ ధరలు, కూరగాయల ధరలు పెరిగాయి. దీంతో ప్రస్తుతం వస్తున్న జీతం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారిని పర్మినెంట్ చేయాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, కేతేపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, కృష్ణ, మహేష్, సంతోష్, ఉదయ్, యోగి, బిఎస్పి నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Sep 15 2023, 21:35