NLG: కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పులి రమాదేవి కి డాక్టరేట్
నల్లగొండ: జిల్లాకు చెందిన కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పులి రమాదేవికి ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారు ఈ నెలలో డాక్టరేట్ ను ప్రకటించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం 'కామర్స్ & బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో '' పనిచేసే మహిళల ఆర్థిక అక్షరాస్యత అధ్యయనం - హైదరాబాదు జిల్లా '' అనే అంశం పై ఆచార్య ఎం.సులోచన పర్యవేక్షణలో పిహెచ్డి సిద్ధాంత గ్రంథాన్ని రమాదేవి రూపొందించి, సమర్పించారు. గ్రామీణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన రమాదేవి స్వగ్రామం దామరచర్ల మండలం కొండప్రోలు. ఈమె తల్లిదండ్రులు మట్టమ్మ- పిచ్చయ్య. కొండప్రోలు గ్రామంలో పాఠశాల విద్య, మిర్యాలగూడెం నాగార్జున ఎయిడెడ్ కళాశాలలో ఇంటర్మీడియట్, కెఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసిన రమాదేవి శ్రమకోర్చి తపనతో ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయంలో వాణిజ్య శాస్త్రంలో స్నాతకోత్తర విద్యను అభ్యసించారు. ఇష్టంగా అధ్యాపక వృత్తిని ఎంచుకుని ఎంపికై నిబద్ధత గల అధ్యాపకురాలు గా గుర్తింపు తెచ్చుకున్న రమాదేవి, ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటలో శాఖాధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. పనిచేసిన ప్రతిచోటా గుణాత్మక సేవలందిస్తూ ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి పాటుపడుతున్న రమాదేవి డాక్టరేట్ పట్టా పొందడం వెనుకబడిన గ్రామీణ మహిళా విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రపంచ ఉపాధ్యాయ సంఘాలు సమాఖ్య సెక్రెటరీ జనరల్ , విద్యావేత్త ఎం.వి. గోనారెడ్డి, ప్రముఖ కవి, విద్యా విశ్లేషకులు, అసోషియేట్ ప్రొఫెసర్ డా.బెల్లి యాదయ్య అన్నారు.
అనుభవం, ఉన్నత అర్హతలు గల అధ్యాపకుల జాబితాలో రమాదేవి చేరిక కళాశాల విద్యాశాఖకు మిక్కిలి గౌరవ ప్రదమని టిజి సిజిటిఏ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి డా. రాజారామ్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డా.మునీర్, డా.రామరాజు, ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట ప్రధానాచార్యులు వి.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తమ సహాధ్యాపకురాలు డాక్టరేట్ సాధించడం ఎంతో ఆనందదాయకమని నల్లగొండ జిల్లా టిజిసిజిటిఏ అధ్యాపక బృందం, వివిధ ఉపాధ్యాయ సంఘాలు, బంధుమిత్రులు రమాదేవిని అభినందించారు.
Sep 13 2023, 14:52