ఎన్జీ కళాశాలలో కాళోజీ జీవితం- సాహిత్యం అను అంశంపై రాష్ట్రస్థాయి సాహిత్య సదస్సు
నల్లగొండ: కాళోజీ జయంతి సందర్భంగా స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జీవితం- సాహిత్యం అను అంశంపై రాష్ట్రస్థాయి సాహిత్య సదస్సు సోమవారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీగేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ తెలంగాణ యాసలో నవరసాలు అను అంశంపై మాట్లాడుతూ.. తెలంగాణ యాస చాలా స్వచ్ఛమైనదని, బడి పలుకుల భాష కాకుండా పలుకుబడుల భాష కావాలని కాళోజీ కోరినట్లే ఇవ్వాళ ప్రజల భాషకు పట్టం కట్టాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. తెలంగాణ యాసలో నవరసాలతో కూడిన తాను రాసిన పాటలను పాడి సభను అలరింపజేశారు. ఈ కార్యక్రమానికి మరో వక్తగా విచ్చేసిన ప్రముఖ కవి ఎన్ వి. రఘువీర్ ప్రతాప్ నా గొడవ- సామాజికత అను అంశంపై మాట్లాడుతూ.. కాళోజీ ఎక్కడ అన్యాయం జరిగినా, స్పందించి కవిత్వం రాశాడని, ప్రజల గొడవను తన గొడవగా భావించి కవిత్వం ద్వారా ప్రజల్ని ఆలోచింపజేశాడని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య ఘనశ్యాం మాట్లాడుతూ.. కాళోజీ నిఖార్సైన మానవత్వానికి నిదర్శనమని, విశ్వమానవతా దృక్పథాన్ని తన కవిత్వం ద్వారా ప్రబోధించారని అన్నారు. తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ మునీర్, తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్ వి. వి. సుబ్బారావు, డాక్టర్ ఎన్. దీపిక, ఎన్. లవేందర్ రెడ్డి, డాక్టర్ సీతారాం రాథోడ్,డాక్టర్ ఎ. దుర్గాప్రసాద్, డాక్టర్ టి. సైదులు, జి.గోవర్ధనగిరి, ఎస్.ప్రభాకర్ ఎమ్. లింగస్వామి, బి. రమ్య, తదితర అధ్యాపకులతో పాటు, కవి బండారు శంకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Sep 13 2023, 13:05