Operation Trinetra 2: జమ్మూకశ్మీర్‌లో ఆపరేషన్ త్రినేత్ర-2.. నలుగురు ఉగ్రవాదుల హతం..
జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir)లో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ త్రినేత్ర-2 సత్ఫలితాలను ఇస్తోంది. ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు..
సోమవారం రాత్రి 11.30 సమయంలో భద్రతా దళాలు సింధార ప్రాంతంలో డ్రోన్లను ఎగురవేసి గస్తీ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదుల కదలికలను గుర్తించడంతో ఎన్‌కౌంటర్ మొదలైంది. మంగళవారం ఉదయం వరకు భారీగా కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ ఆపరేషన్‌ను భారత సైన్యం ప్రత్యేక దళాలు, రాష్టీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టాయి..
పూంఛ్‌లోని సురాన్ కోట్ సమీపంలో సింధార, మైదాన గ్రామాల్లో నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు సైన్యం పేర్కొంది. వీరి వద్ద ఏకే-47 తుపాకులు, పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. వీరు రాజౌరీ, పూంఛ్ ప్రాంతాల్లో భారీగా దాడులు చేయడానికి వచ్చినట్లు వెల్లడించారు. మృతి చెందిన ఉగ్రవాదుల్లో విదేశీయులున్నట్లు సైన్యం తెలిపింది. వీరి స్థావరంలో గ్రనేడ్లు కూడా ఉన్నట్లు వెల్లడించింది. తాజాగా ప్రత్యేక దళం, సైన్యం కాలాఝూలా అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టింది. దీంతోపాటు పూంఛ్ ప్రాంతంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు..
Jul 18 2023, 11:51