ఏపీలో పోలీసులు అనుసరిస్తున్నది ఐపీసీ సెక్షన్ కాదు వైసీపీ సెక్షన్
అమరావతి:జులై 18
రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులు రెచ్చిపోతున్నారు. విపక్ష నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసి మరీ కొడుతున్నారు. తాము తొడిగింది ఖాకీ అని మరిచి... అధికార పార్టీకి అండగా నిలబడుతున్నారు. ‘అధికార పార్టీని ఏమన్నా ఊరుకోం’ అంటూ వయలెంట్ రియాక్షన్ చూపిస్తున్నారు. అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి లాక్కొచ్చి మరీ తన్నడం... నడిరోడ్డుపై బూటుకాళ్లతో తొక్కడం, చెంపలు వాయగొట్టడం... ఇలా విపక్ష నేతలు, కార్యకర్తలపై యథేచ్ఛగా విరుచుకుపడుతున్నారు. కొందరు పోలీసు అధికారులు స్థానిక వైసీపీ నేతల ‘ప్రైవేటు సైన్యం’లా పని చేస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. ‘ఇది తప్పు...భవిష్యత్తులో మీ సర్వీసుకు ముప్పు’ అని ఉన్నతాధికారులు ఎంత చెబుతున్నా చెవికి ఎక్కించుకోవడం లేదు. ఐజీలు, ఎస్పీలు పంపిస్తున్న మార్గదర్శకాలేవీ పనిచేయడం లేదని తాజా ఉదంతాలు చాటుతున్నాయి.
అధికార పార్టీ అయితే గడ్డం..ప్రతిపక్షమైతే జుట్టు
తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి వైసీపీతో జట్టుకట్టిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఈ ఏడాది మొదట్లో టీడీపీ నేత పట్టాభిరామ్ రాజకీయ పరమైన ఆరోపణలు చేశారు. అంతే.... వంశీ తన అనుచరులను గన్నవరం టీడీపీ ఆఫీసుపైకి పంపి విధ్వంసం సృష్టించి అక్కడున్న కార్లు తగులబెట్టించారు. ఈ దుశ్చర్యలో వంశీ అనుచరులైన రాము, ఓలుపల్లి రంగా మరికొందరు దాడులకు వెళుతుంటే ‘అన్నా.. అన్నా..’ అంటూ పోలీసులు గడ్డం పట్టుకుని బతిమాలిన దృశ్యాలు టీవీల్లో కనిపించింది. ఆ దృశ్యాలు చూసి రాష్ట్ర ప్రజలు అవాక్కయ్యారు.
టీడీపీ కార్యాలయంలోపల అధికార పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టిస్తుంటే ప్రాణ భయంతో పారిపోయిన టీడీపీ శ్రేణుల ఎలక్ర్టానిక్ వస్తువులు పోలీసులు జేబులో వేసుకోవడం కృష్ణా జిల్లా ఖాకీల పరువును కృష్ణానదిలో ముంచేసింది. విధ్వంసం గురించి తెలిసిన వెంటనే నిరసన తెలిపేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. జుట్టు పట్టుకుని లాక్కొచ్చి జైలుకు పంపి ఏకపక్షమంటే ఇదీ అని నిరూపించారు. అంతకు నెలరోజుల ముందు పుంగనూరులో బీసీ నాయకుడు రామచంద్ర యాదవ్ రైతులకు మద్దతుగా సదుం మండలంలో ‘రైతు భేరి’ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆ విషయం తెలిసిన వైసీపీ కీలక నాయకుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరులను యాదవ్ ఇంటిపైకి పంపి......విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపించారు. ఈ దుశ్చర్య జాతీయ స్థాయిలో వివాదాస్పదం అయింది. చివరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కలగజేసుకుని రామచంద్ర యాదవ్‌కు వై కేటగిరి భద్రతను కేంద్ర బలగాలతో కల్పించాల్సి వచ్చింది...
Jul 18 2023, 10:58