తెలంగాణ సర్కార్‌కు పెండింగ్’’ గండం : కేసీఆర్‌కు కొత్త టెన్షన్.?
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో చాలా వాటిని బీఆర్ఎస్ ఇప్పటికీ అమలు చేయడం లేదు. అదిగో ఇదిగో అంటూ ప్రభుత్వం ఇప్పటి వరకు కాలం వెళ్లదీసింది. తీరా అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రస్తుతం ఆ పార్టీకి టెన్షన్ పట్టుకున్నది. షెడ్యూలు వచ్చేలోపు ప్రధాన హామీలను అమలు చేయకపోతే ఇబ్బంది వస్తుందని ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది.
దీంతో ఏ హామీలను పూర్తి చేయాలి? ఏ హామీలను పెండింగ్‌లో పెట్టాలి? అనే విషయంపై సీఎం కేసీఆర్ క్లారిటీకి రావడం లేదని టాక్. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్న పథకాలను ముందు పూర్తి చేసి, మిగతా వాటిని పెండింగ్‌లో పెడితే ఎలా ఉంటుందని ఆయన ఆరా తీస్తున్నట్టు సమాచారం. కొన్ని స్కీమ్స్‌ను పెండింగ్‌లో పెడితే కేసీఆర్ క్రెడిబులిటీకి సమస్య వస్తుందనే అనుమానాలు గులాబీ లీడర్లను వెంటాడుతున్నాయి.
ఖజానా ఖాళీ?
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అన్ని హామీలను పూర్తి చేయడం సాధ్యం కాని పని. ప్రతి నెలా ఉద్యోగుల జీతాల చెల్లింపులు, తీసుకున్న అప్పులకు కిస్తీలు కట్టడం కూడా ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. వాటికి తోడు ప్రస్తుతం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను పెండింగ్‌లో పెట్టలేని పరిస్థితి.
ఆర్థిక పరిస్థితులు కారణంగా ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి చేయడం కూడా డౌటే. దీంతో ప్రజలను మానసికంగా సిద్ధం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రస్తుత పథకాలు తమ వల్ల మాత్రమే అమలవుతాయని, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సాధ్యం కాదని మంత్రులు పదే పదే చెపుతున్నారు. పథకాలు అమలు కాకుంటే ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్ముతారా? అనే అనుమానం గులాబీ లీడర్లను వెంటాడుతున్నది.
అటకెక్కిన నిరుద్యోగ భృతి
నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. అనంతరం అధికారం చేపట్టాక తొలి ఏడాది దీని కోసం బడ్జెట్‌లో సుమారు రూ.1800 కోట్లను ప్రభుత్వం కేటాయించారు. వివిధ రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి ఏవిధంగా అమలవుతుందో స్టడీ చేయాలని ఆఫీసర్లను ఆదేశించింది. కాస్త హడావుడి చేసి ఆతర్వాత నుంచి బడ్జెట్‌లో నిధులు కేటాయించడమే మానేసింది. చివరికి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామనే పేరుతో నిరుద్యోగ భృతి హామీని అటకెక్కించారు.
ఊసేలేని రైతు రుణమాఫీ
అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.లక్షలోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రకటించారు. అధికారం చేపట్టాక ఇందుకోసం బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించారు. కానీ ఇప్పటి వరకు కేవలం రూ.25 వేల లోపు రుణాలను మాత్రమే మాఫీ చేసింది. వచ్చే ఎన్నికల లోపు ఈ హామీని పూర్తి చేస్తారా? లేదా? అనే దానిపై అనుమానాలు మొదలయ్యాయి. రైతుబంధు డబ్బులు అకౌంట్‌లో పడిన వెంటనే బ్యాంకులు వాటిని పాత అప్పుకింద జమ చేసుకుంటున్నాయి.
గృహలక్ష్మి నిబంధనలకే పరిమితం
సొంత జాగా ఉన్న వారు ఇల్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మి స్కీమ్ కింద ఈ ఏడాది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 3 వేల మందికి రూ.3 లక్షల చొప్పున సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు ఆ స్కీమ్ అమలు కోసం కేవలం నిబంధనలు మాత్రమే రూపొందించింది. కానీ ఒక్క దరఖాస్తు కూడా స్వీకరించలేదు. డబుల్ బెడ్ రూం స్కీమ్‌ను సైతం పెండింగ్‌లో పెట్టింది. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇండ్లను సైతం పంపిణీ చేయలేదు.
నత్తనడకన దళితబంధు
దళితబంధు స్కీమ్ అమలు కేవలం ప్రకటనకే పరిమితమైంది. ఈ ఏడాది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 11 వందల మందికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని సర్కారు ప్రకటించింది. కానీ ఇంతవరకూ లబ్ధిదారుల ఎంపిక పూర్తికాలేదు. తమ పేరును లిస్టులు నమోదు చేయించాలని అర్హులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్ని చోట్ల దళారులు దందా మొదలు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు సైతం వస్తున్నాయి.....
Jul 16 2023, 18:43