Srinivas goud: ఏపీ రాజధాని ఏదంటే.. సమాధానం చెప్పలేని పరిస్థితి: శ్రీనివాస్‌గౌడ్
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చూసి రాసి పరీక్షలు పాస్ అయ్యారు కాబట్టే .. అలా అంటున్నారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు..
తెలంగాణలో అభివృద్ధిని చూసి ఓర్వలేని తనంతో, అక్కసుతో బొత్స మాట్లాడతున్నారని ఆక్షేపించారు. తాము తెలంగాణలోనే చదువుకుంటామని ఏపీ విద్యార్థి కోర్టుకు కూడా వెళ్లారని మంత్రి గుర్తు చేశారు. ఏపీ రాజధాని ఏది అని పరీక్షల్లో అడిగితే సమాధానం చెప్పే పరిస్థితి లేదని వ్యాఖ్యానించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఎందుకు అలా విషం కక్కుతున్నారని ప్రశ్నించారు. వారి హయాంలో ఏపీపీఎస్సీలో స్కాములు జరిగేవని, ఇప్పుడు కూడా అలానే అనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. బదిలీల కోసం వారి హయాంలో సూట్ కేసులు పట్టుకొని లాడ్జిల్లో ఉండేవారని గుర్తు చేశారు. వారి హయాంలో కోళ్ల ఫారాల్లో ఇంజినీరింగ్ కళాశాలలు ఉంటే నాణ్యత లేదని తీసివేసినట్టు మంత్రి చెప్పారు..
మా దగ్గర వోక్స్ వ్యాగన్ స్కాములు ఉన్నాయా? అని ప్రశ్నించిన శ్రీనివాస్‌గౌడ్.. ఏపీలో ఆలయాల వద్ద కూడా వివక్ష ఉందన్నారు. ఏపీలో అంతా కులపిచ్చి.. అభివృద్ధి లేదన్నారు. అన్ని విషయాలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమా అని బొత్సకు సవాల్ విసిరారు. బొత్స పిల్లలు కూడా ఇక్కడే చదివి ఉంటారని వ్యాఖ్యానించారు. బాధ, ఈర్ష్య, ద్వేషంతో మాట్లాడారా? లేక రాజకీయంగా ఉపయోగపడుతుందని మాట్లాడారా? అని ప్రశ్నించారు..
టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసులో వెంటాడి దోషులను అరెస్టు చేస్తున్నామని, పారదర్శకంగా ఉండాలన్న ప్రభుత్వ చర్యలు హర్షించాలన్నారు. తెలంగాణను కించపర్చేలా మాట్లాడితే సహించబోమన్నారు. ఏపీ అభివృధ్ధిపై దృష్టి సారించాలని, మనుషులు కలిసి మెలిసి ఉండేలా చూడాలని బొత్సకు సూచించారు. ఏపీలోనూ భారాసను విస్తరిస్తామని, అధికారం ఇస్తే తెలంగాణ తరహాలో ఏపీని కూడా అభివృద్ధి చేస్తామన్నారు..
Jul 13 2023, 20:43