బీసీల రాజకీయ ప్లీనరీని విజయవంతం చేయాలి
---బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్.
బీసి ముఖ్యమంత్రితో పాటు మిషన్ 60 (బీసీలకు 60 ఎమ్యెల్యే టికెట్లు) డిమాండ్ తొ జూలై 15న ఎల్ బి నగర్లోని కెబిఆర్ కన్వెన్షన్లో నిర్వహించ తలపెట్టిన బీసీల రాజకీయ ప్లీనరిని విజయవంతం చేయాలనీ బీసి యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు దీనికి సంబంధించిన గోడపత్రికలను మంగళవారం జిల్లా కేంద్రంలో బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కట్టెకోలు దీపెందర్ మాట్లాడుతూ 10 వేల మంది ప్రతినిధులతో నిర్వహించే బీసిల రాజకీయ ప్లీనరి తెలంగాణలో రాజకీయాలను శాసించబోతుందన్నారు. ఈ సమావేశంలో బీసిల రాజకీయ భవిష్యత్, దశ-దిశను నిర్ణయిస్తామని ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు దళితులని, బీసీలని ముఖ్యమంత్రి చేస్తామని వాగ్దానం చేసి చేయలేదన్నారు. పైగా తెలంగాణలోని బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు అగ్రకుల నాయకులకే పార్టీ పగ్గాలు అప్పజెప్పారని అన్నారు. ఇంత కాలం బిజేపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేత బండి సంజయ్ ని సైతం తప్పించి అగ్రకులాలకే బాధ్యతలు అప్పజెప్పారని ఆరోపించారు. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు బీసిల రాజకీయ ప్రయోజనాలు అవసరం లేదన్నారు. కేవలం పిడికెడు శాతం ఉన్న అగ్రకులాలకే పెత్తనం ఇచ్చి 60 శాతం ఉన్న బీసీలను ఓట్లు ఏవిధంగా అడుగుతారని అని ప్రశ్నించారు.
ఏవిధంగా బీసీలు మీకు ఓట్లు వేయాలో చెప్పాలనీ ఎద్దేవా చేశారు. అందుకే ఓటు మాదేసీటు మాదే... మేమెంతో మాకంతా అనే నినాదంతో అగ్రకుల ఆధిపత్య పాలనకు చరమగీతం పాడేందుకు రాజ్యాధికారం వైపు బీసిలందరిని తీసుకెళ్లడమే ఈ రాజకీయ ప్లీనరి ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. మీరిచ్చే రాయితీలు, సబ్సిడీలు, స్కాలర్ షిప్లు మమ్ముల్ని సంతృప్తి పరచలేవన్నారు. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా సీఎం పీఠమే అజెండేగా బీసీ రాజకీయ ఉద్యమాన్ని మొదలు పెడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ, గౌరవ సలహాదారు నెలపట్ల సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి యలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, యలిజాల రమేష్, మారోజు రాజ్ కుమార్, రాములు, రవీందర్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
Jul 11 2023, 16:37