ఇంటర్మీడియట్ కళాశాలలలోభారీ గా పడిపోయిన అడ్మిషన్లు
•ప్రభుత్వ కాలేజీల్లో చేరికకు విముఖత
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. 2023-24కు సంబంధించిన ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా.. అనుకున్న విధంగా అడ్మిషన్లు జరగడం లేదు. ఏటా నమోదయ్యే అడ్మిషన్లతో పోలిస్తే... ఈ సారి సగం మంది కూడా ప్రభుత్వ కాలేజీల్లో చేరలేదు.
రాష్ట్రంలో 406 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా, సుమారు లక్షకుపైగా సీట్లు ఉన్నాయి. సాధారణంగానైతే ఏటా 90వేలకు పైగా అడ్మిషన్లు నమోదవుతాయి. కానీ, ఈ ఏడాది ఇప్పటిదాకా 47వేల మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ కాలేజీల్లో చేరారు. ఏటా టెన్త్ ఫలితాలు వచ్చిన వెంటనే ప్రభుత్వ కాలేజీల్లో పని చేసే లెక్చరర్లు విద్యార్థులను చేర్పించడానికి కృషి చేసేవారు. ముఖ్యంగా కాంట్రాక్టు లెక్చరర్లు ఈ విషయంలో చొరవ తీసుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చచెప్పి ప్రభుత్వ కాలేజీల్లో చేర్పించేవారు.
విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటేనే తమ ఉద్యోగాలకు భద్రత ఉంటుందన్న ఉద్దేశంతో వారు ఆసక్తి చూపేవారు. ఉన్నతాధికారులు కూడా ఆ మేరకు ప్రోత్సహించే వారు. కానీ, ఇటీవల కాంట్రాక్టు లెక్చరర్లును ప్రభుత్వం క్రమబద్ధీకరించడంతో అడ్మిషన్లపై వారు ఆసక్తి చూపలేదన్న వాదన వినిపిస్తోంది. దీనికితోడు ఇంటర్మీడియట్ బోర్డుకు రెగ్యులర్ కమిషనర్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం నవీన్‌మిత్తల్ ఇన్‌చార్జిగా ఉన్నప్పటికీ.. ఆయనపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. దీంతో ఇంటర్‌బోర్డు పనితీరును పర్యవేక్షించే సమయం లభించడం లేదు. కొత్త అడ్మిషన్లు, విద్యా బోధన వంటి అంశాలపై ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క సారి కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించకపోవడం గమనార్హం. ఈ కారణాల వల్లే అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిందన్న చర్చ జరుగుతోంది...
Jul 11 2023, 13:08