అనసూయ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం : ఉందా ❓️
•ఒకవేళ ఆమె ముఖ్యమంత్రి అయితే తొలి మహిళ
•గిరిజన, మాజీ మావోయిస్టుగా రికార్డు
రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున సీతక్క అలియాస్ దాసరి అనసూయ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా!? తెలంగాణలో ఆ పదవిని చేపట్టబోయే తొలి మహిళగా.. తొలి గిరిజన నాయకురాలిగా ఆమె నిలవనున్నారా!? ఇంకా చెప్పాలంటే, ఒకప్పుడు తుపాకీ పట్టిన మాజీ మావోయిస్టు రాజ్యాధికారాన్ని అంది పుచ్చుకుని చరిత్ర సృష్టిస్తారా!? అంటే.. ‘సందర్భం వస్తే.. సీతక్కను ముఖ్యమంత్రిని చేయవచ్చు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి!
ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ జరుగుతున్న తానా సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా, సోమవారం ఎన్నారైలతో రేవంత్ సమావేశమయ్యారు. పలువురు ఎన్నారైలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా, ‘తెలంగాణలో 18 శాతంగా ఉన్న ఎస్సీల నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను సీఎం అభ్యర్థిగా ఫోకస్ చేస్తున్నారు. మరి, 12 శాతంగా ఉన్న ఎస్టీల నుంచి సీతక్కను ఉప ముఖ్యమంత్రిగాఫోకస్ చేస్తారా!?’ అని సమావేశంలో ఓ ఎన్నారై ప్రశ్నించారు. దానికి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ‘‘మీరు కాంగ్రెస్ పార్టీ బిగ్ పిక్చర్ చూడట్లేదు. 53 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షునిగా పార్టీ చేసింది. దేశంలో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే.. వాటిలో మూడుచోట్ల ముఖ్యమంత్రులు ఓబీసీలే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల పక్షాన పార్టీ ఒక స్పష్టమైన విధానంతో ముందుకు పోతోంది.
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఎన్నికలకు ముందు ప్రకటించడం కాంగ్రెస్ సంప్రదాయం కాదు. అయినా.. ఎన్నారైలు ఇచ్చిన సూచనపై పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటాం. మీరు సీతక్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా!? అని అడిగారు కదా? ఆ సందర్భం వస్తే అక్కను సీఎంగా కూడా చేయవచ్చు’’ అని వ్యాఖ్యానించారు. పేదలు, దళితులు, ఆదివాసీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఒక పాలసీతో ముందుకు సాగుతోందన్నారు. భవిష్యత్తులో వారికి విస్తృత అవకాశాలు ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు; రాజధానిగా అమరావతి నిర్మాణానికి కాంగ్రెస్ చొరవ తీసుకుందని, ఆ రెండిటినీ పూర్తి చేయడం పార్టీ సిద్ధాంతమని తెలిపారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడానికి తమకు సహకరించాలని ఎన్నారైలకు విజ్ఞప్తి చేశారు. తనను, కాంగ్రెస్ పార్టీని వేర్వేరుగా చూడడం సరికాదని, తెలంగాణలో కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి.. రేవంత్ అంటే కాంగ్రెస్ అని చెప్పారు...
Jul 11 2023, 11:06