చిక్కుల్లో ఎమ్మెల్సీ ::కౌశిక్ రెడ్డి ❓️
•బీఆర్‌ఎస్ అభ్యర్థులుగా తెరపైకి పెద్దిరెడ్డి, సతీష్‌కుమార్
హుజురాబాద్ :జులై 09
కాంగ్రెస్ నుంచి ఏరి కోరి తెచ్చుకుని నెత్తినెక్కించుకున్న కౌశిక్‌రెడ్డి కథకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్నారా.. అన్న ప్రశ్నకు ఆ పార్టీ వర్గాల్లో అవుననే సమాధానమే వినిపిస్తున్నది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీకి లాభం చేకూరుతుందని, బీజేపీలో చేరిన ఈటల రాజేందర్‌ను ఓడించాలంటే యువకుడు, ఉత్సాహం, దూకుడుతనం ఉన్న కౌశిక్ రెడ్డి సరైన వ్యక్తి అని కేసీఆర్ భావించారు. ఉప ఎన్నికలో ఆయనకు టికెట్ ఇవ్వకపోయినా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఎన్నికల తర్వాత ఆయనకు ప్రభుత్వ విప్ పదవిని ఇచ్చి నియోజకవర్గంలో ప్రొటోకాల్ హోదా కల్పించారు. హుజూరాబాద్ నుంచి పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చి ఆయనను నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యత నుంచి తప్పించి కౌశిక్‌రెడ్డికి అప్పజెప్పారు.
సొంత పార్టీ నేతల్లోనూ అసంతృప్తి
అనతికాలంలోనే ఎమ్మెల్సీ, విప్ పదవి, నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి దక్కడంతో కౌశిక్‌రెడ్డి రాజకీయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేయకుండా అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ నియోజకవర్గంలో పార్టీశ్రేణులకు, ఉద్యోగవర్గాలకు, ప్రజలకు క్రమేపి దూరమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆయన దూకుడుతనం, వ్యవహారశైలి పార్టీ ఉనికికి ప్రమాదకరంగా మారుతున్నదని గమనించిన ఆయన ప్రత్యామ్నాయ నాయకుల కోసం వెతుకుతున్నట్లు చెబుతున్నారు. సొంత పార్టీ నాయకులు కూడా ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఈటలకు కనీస పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుందని బీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో వెల్లడించినట్లు సమాచారం. అధికారులతో ఆయన అనుసరిస్తున్న దురుసువైఖరి అధికార, ఉద్యోగ వర్గాల్లో పార్టీ పట్ల వ్యతిరేకతను పెంచుతున్నదని వారు తెలిపినట్లు తెలిసింది. పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కూడా ఆయన అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారని సమాచారం. ఇటీవల ముదిరాజ్ కులస్తులపై ఆయన చేసిన వ్యాఖ్యానాలు రాష్ట్రవ్యాప్తంగా ఆ సామాజికవర్గం ఆందోళనలకు, బీఆర్‌ఎస్‌కు ఆ వర్గానికి దూరం కావడానికి కారణమయ్యాయని పార్టీ నేతలు విమర్శించారు. దీంతో అధిష్ఠానం పాడి కౌశిక్‌రెడ్డిని మార్చాలని భావిస్తున్నట్లు తెలిసింది.
ఈటలకు దీటైన అభ్యర్థి కోసం వేట?
కౌశిక్‌రెడ్డి స్థానంలో ఈటల రాజేందర్‌ను ఢీకొనడానికి ప్రజల్లో మంచి పేరు ఉన్న వ్యక్తి కోసం వెతుకుతున్నట్లు సమాచారం. ఈటల రాజేందర్ ప్రజలతో మమేకమై వారిలో ఒకరిగా ఉంటూ రాజకీయంగా తిరుగులేని శక్తిగా ఎదిగారు. అలింటి నేతనే ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఉప ఎన్నికకు ముందు బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అందుకు సరైన వ్యక్తి అని భావిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఇనుగాల పెద్దిరెడ్డిని నియోజకవర్గ రాజకీయాల్లో చురుకుగా ఉండాలని సూచించారని సమాచారం. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆయన హుజూరాబాద్‌లో నివాసం ఉండడానికి ఏర్పాట్ల చేసుకుంటున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డికి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో సత్సంబంధాలున్నాయి. నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉన్నా పాత సంబంధాలను పునరుద్ధరించుకోవడం ఆయనకు ఇబ్బందేమీ కాదని బీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. పెద్దిరెడ్డితోపాటు ప్రస్తుత హుస్నాబాద్ శాసనసభ్యుడు వొడితెల సతీష్ కుమార్‌ను హుజూరాబాద్ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని బీఆర్‌ఎస్ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. సతీష్‌కుమార్ తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు కేసీఆర్‌కు సన్నిహితుడే కాకుండా ఆయన మంత్రి వర్గంలో పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. కెప్టెన్ కుటుంబానికి, హుజూరాబాద్ రాజకీయాలకు విడదీయలేని సంబంధం ఉన్నది. నియోజకవర్గంలో ఆయనకు గట్టి పట్టు ఉండడం, ఆ కుటుంబంలోని వారికి సౌమ్యులు, ప్రజలకు దగ్గరగా ఉండేవారని పేరుండడంతో సతీష్‌కుమార్‌ను హుజూరాబాద్ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారని సమాచారం. ఇనుగాల పెద్దిరెడ్డి, వొడితెల సతీష్‌కుమార్ ఈటలను ఆయన పద్ధతిలోనే ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నవారిగా గుర్తిస్తున్నారు. దీంతో హుజూరాబాద్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితులు మారతాయని అంచనా వేస్తున్నారు. ఊహించని విధంగా వచ్చిన హుజూరాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్‌లో ఉన్న కౌశిక్ రెడ్డికి బీఆర్‌ఎస్‌లో చేరేలా చేసి రాజకీయంగా ఉజ్వల భవిష్యత్తును ఆయన ముందుంచింది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా తన దుందుడుకు చర్యలతో చేజేతులా ఆయన దూరం చేసుకుంటున్నారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో, ప్రజల్లో వ్యక్తమవుతున్నది....
Jul 11 2023, 09:28