నేడు వరంగల్ కు ప్రధాని రాక
6 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, అధికార బీఆర్‌ఎస్‌తో బీజేపీకి అవగాహన కుదిరిందన్న ప్రచారం జరుగుతున్న వేళ.. ప్రధాని నరేంద్రమోదీ వరంగల్ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. ఈ సందర్భంగా బీజేపీ విజయసంకల్ప సభ నేపథ్యంలో ఈ సభలో మోదీ రాజకీయంగా ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు? ఇటీవలి పరిణామాలతో రాష్ట్రంలో అయోమయంలో పడిపోయిన బీజేపీ క్యాడర్‌కు ఎలాంటి భరోసా ఇవ్వనున్నారు? నాయకులకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. సరిగ్గా మూడు నెలల క్రితం ఏప్రిల్ 8న రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోదీ.. సికింద్రాబాద్ రైల్వేస్షేషన్ ఆధునికీకరణతోపాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సందర్భంగా, పరేడ్ గ్రౌండ్స్ వేదికగా సీఎం కేసీఆర్ కుటుంబంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అవినీతిపరులు జైలుకు వెళ్లక తప్పదని తేల్చిచెప్పారు. దీంతో, అప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారించిన దృష్ట్యా.. ఆమెను అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా గడచిన మూడునెలల్లో సమీకరణాలు మారాయి. లిక్కర్ స్కాం కేసు దర్యాప్తు మందగించింది. రాష్ట్ర బీజేపీలో అసమ్మతి రాజుకుని క్యాడర్‌లో అయోమయం నెలకొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ వరంగల్‌కు వస్తున్నారు.
భారీగా పోలీసు బందోబస్తు..
ప్రధాని మోదీ వరంగల్ పర్యటనలో భాగంగా బహిరంగ సభకు హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వేదిక సిద్ధమైంది. మోదీ రాక సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నట్లు బీఆర్‌ఎస్ ప్రకటించగా, కాంగ్రెస్, వామపక్షాలు సైతం మోదీ పర్యటనను నిరసిస్తున్నాయి. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆయా పార్టీల నాయకులను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. పలువురు ముఖ్యనేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ బృందం 24 గంటల ముందే స్వాధీనం చేసుకుంది. కాగా, ప్రధాన మోదీ శనివారం ఉదయం 10.15 గంటలకు నగరానికి చేరుకుంటారు. మామునూరు విమానాశ్రయంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో దిగుతారు. భద్రకాళి దేవాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు. ఇక్కడ రూ.6 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇందులో రూ.3,441 కోట్ల ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా వరంగల్‌మంచిర్యాల జాతీయ రహదారి విస్తరణ, రూ.2,147 కోట్లతో జగిత్యాలకరీంనగర్‌వరంగల్ మధ్య రహదారి పనులు, రూ.521 కోట్లతో చేపట్టనున్న రైల్వే గూడ్స్ వ్యాగన్ల తయారీ కేంద్రం ఉన్నాయి. వీటికి సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించిన అనంతరం.. బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు.
వర్షం వచ్చినా అంతరాయం కలగకుండా..
బహిరంగ సభకు వర్షం ముప్పు పొంచి ఉండడంతో సభాప్రాంగణాన్నంతా జర్మన్ టెక్నాలజీ టెంట్లతో కప్పేశారు. సభలో ఎక్కడ కూర్చున్నా అందరికీ మోదీ స్పష్టంగా కనిపించేలా పలుచోట్ల డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఒక ప్రధానమంత్రి వరంగల్‌కు రావడం దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ పర్యటన సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రధాని ఏమైనా వరాలు ప్రకటించవచ్చునని ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీపై ద్వేషంతోనే సీఎం కేసీఆర్ వరంగల్‌లో అభివృద్ధి పనులకు దూరంగా ఉంటున్నారని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ ఆరోపించారు. బెంగాల్, తమిళనాడు, ఏపీతోపాటు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కేరళలో కూడా సీఎంలు ప్రొటోకాల్ పాటిస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకోవద్దని కేసీఆర్‌కు హితవు పలికారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీని ప్రపంచ దేశాలు హీరో అంటూ కీర్తిస్తుంటే కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు...
Jul 08 2023, 17:21