సర్వీస్ రివాల్వర్ కాల్చుకున్న కోయంబత్తూర్ డిఐజి
తమిళనాడు:జులై 07
కోయంబత్తూరు డీఐజీ విజయ్ కుమార్ (45) ఈరోజు తెల్లవారుజామున క్యాంపు కార్యాలయంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన విజయకుమార్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తరువాత గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి డీఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. మొదటగా నెల్లై జిల్లా వల్లియూర్‌లో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు.
దీని తర్వాత కాంచీపురం, కడలూరు, నాగపట్నం, తిరువారూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. సీబీసీఐడీలో ఎస్పీగా కూడా పనిచేసిన విజయకుమార్ సాతంకుళం జంట హత్య కేసును తొలిసారిగా దర్యాప్తు చేశారు. కోయంబత్తూరు, తిరుపూర్, ఈరోడ్, నీలగిరి నాలుగు జిల్లాల పర్యవేక్షణ అధికారిగా పని చేశారు. గత జనవరిలో విజయకుమార్ కోయంబత్తూరు డీఐజీగా బాధ్యతలు చేపట్టారు.
గత రెండు రోజులుగా విజయకుమార్ కుటుంబ కారణాలవలన మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఆయన కొంత కాలంగా నిద్ర సరిగా ఉండటం లేదని తోటి అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి డిప్రెషన్‌తోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. నిన్న రాత్రి కోయంబత్తూరు డిప్యూటీ కమిషనర్ కుమారుడి పుట్టినరోజు వేడుకలకు సైతం హాజరైన విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. కాగా.. విజయకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాంథియా రోడ్డు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై కూడా విచారణ జరుపుతున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్.. విజయ్ కుమార్ మృతి విషయం తెలుసుకుని దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా విజయ్ కుమార్ కుటుంబ సభ్యులకు స్టాలిన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు...
Jul 07 2023, 12:05