సంక్షేమం చుట్టూ… పార్టీలు!
సాధారణ ఎన్నికలు కొద్ది నెలల్లో జరగబోతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పార్టీలు వ్యూహాల్లో నిరంతరం మునిగితేలుతూ ఎన్నికలు ఇప్పుడే వచ్చినట్లుగా వాతావరణం సృష్టిస్తున్నాయి. జుగుప్సాకరంగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఒకరికి మించి ఒకరు సంక్షేమ పథకాల పేరుతో వరాల జల్లులు కురిపిస్తున్నాయి. పేదలకు అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నాయి. ప్రజలకు, పాలక ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు దేని కోసం ప్రకటిస్తున్నాయి, సంక్షేమ పథకాల కోసం పేదలు ఎందుకు చూడవలసి వస్తున్నది, ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల కోసం కాకుండా స్వశక్తిపై పేదలు బతకడానికి కావాల్సింది ఏమిటి అన్న విషయాలను అర్థం చేసుకుంటేనే సంక్షేమ పథకాల్లో దాగి ఉన్న కుట్రను అర్ధం చేసుకోగలము.
దేశానికి ‘స్వాతంత్య్రం' వచ్చి 76 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ కాలంలో పేదల జీవితాల్లో మౌలిక మార్పులు సంభవించాయా అంటే వచ్చే సమాధానం లేదు. పేదల పరిస్థితులు, వారి జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయా అంటే కూడా లేదనే సమాధానం వస్తుంది. ఇందుకు పాలక ప్రభుత్వాలు కారణమా అంటే అవును అని వెంటనే సమాధానం వస్తుంది. పేదల జీవన పరిస్థితులు మెరుగు పడటం అనేది పాలించే పాలక పార్టీల, ప్రభుత్వాల వర్గ స్వభావంపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. భారత పాలక పార్టీల, ప్రభుత్వాల వర్గ స్వభావం దోపిడీ వర్గాలను కాపాడే స్వభావం. అందువలన అధికార మార్పిడి జరిగిన దగ్గర నుంచి నేటి వరకు ప్రభుత్వాలన్నీ బడా పెట్టుబడిదారుల, భూస్వాముల, సామ్రాజ్యవాదుల దోపిడీ ప్రయోజనాలకు ప్రాతినిధ్య వహిస్తూ ప్రజా వ్యతిరేక, పేదల వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నవే. ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల పరిష్కారాన్ని పక్కన పెడుతున్నవే.
పోరాటాల అణిచివేతే లక్ష్యంగా..
భారత దేశం నేటికీ వ్యవసాయక దేశమని పాలక పార్టీలతో సహా అందరూ అంగీకరిస్తున్నారు. ఇప్పటికీ 68% ప్రజలు గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నారు. గ్రామీణ పేదలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు, సేద్యానికి కావాల్సిన భూమి, పని చేయడానికి ఉపాధి. 76 సంవత్సరాల ‘స్వాతంత్ర్య' పాలనలో గ్రామీణ పేదలకు ఈ రెండు లభించేది. పట్టణ పేదలకు, శ్రామికులకు, ఉన్న ఉపాధి కూడా తరిగి పోతున్నది. ఫలితంగా గ్రామీణ, పట్టణ పేదలు దుర్భరమైన పేదరికంలో మగ్గుతున్నారు. పేదరికానికి, దుర్భర జీవితాలకు తాము సేద్యం చేసి పంటలు పండించే భూమిపై హక్కు లేక పోవటమని గ్రహించిన గ్రామీణ పేదలు భూమిపై హక్కు కోసం పోరాటం ప్రారంభించారు....
Jul 06 2023, 12:39