కేటీఆర్ సార్ కు కోపం వచ్చింది దా?
మహబూబాబాద్:జులై 01
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కోపమొచ్చింది.. దీన్ని కోపం అనడం కంటే అసహ్యించుకున్నారంటే కరెక్టుగా సరిపోతుందేమో! . మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ విచ్చేశారు. అయితే.. మంత్రి-ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. ఒక్కసారిగా కేటీఆర్ కోపంతో రగిలిపోయారు. ఇప్పుడీ వీడియో ట్రెండింగ్ లో దూసుకు పోతుంది.
వివరాలలోకి వెళితే
మహబూబాబాద్‌లో గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయడానికి కేటీఆర్ హాజరయ్యారు. కాన్వాయ్ దిగి కేటీఆర్ సభా ప్రాంగణానికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ వెనుక నుంచి పరుగున వచ్చి మంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక్కచూపు చూసిన కేటీఆర్.. చీదరించుకుంటూ ఎమ్మెల్యే చేతిని తోసేశారు. సార్.. కాస్త శాంతించండి’ అన్నట్లుగా ఎమ్మెల్యే చేతులు జోడించి నమస్కరించినా కేటీఆర్‌కు కోపం తగ్గలేదు. దీంతో చేసేదేమీ లేక చేతులు జోడించి నమస్కరిస్తూనే శంకర్ నాయక్ ముందుకు సాగారు. ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందనే విషయం క్లారిటీగా తెలియట్లేదు కానీ.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
శంకర్ నాయక్ అంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అని ప్రతిపక్షాలు, సొంత పార్టీ నేతలే చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాలో ఎంపీ మాలోత్ కవిత-ఎమ్మెల్యే మధ్య గత కొన్ని రోజులుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. మరోవైపు.. మంత్రి సత్యవతి రాథోడ్‌తోనూ విబేధాలున్నాయి. ఎంపీ, మంత్రితోనే కాదు స్థానికంగా ఉన్న ద్వితియ శ్రేణి నేతలతోనే ఇదే పరిస్థితి.
రెండ్రోజులకోసారి శంకర్ నాయక్ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఎమ్మెల్యే తీరుతో పార్టీకి డ్యామేజ్ అవుతోందని పెద్ద ఎత్తున అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. అంతేకాదు.. రానున్న ఎన్నికల్లో సుమారు 18 నుంచి 30 మందికి టికెట్లు ఇచ్చే పరిస్థితులు లేవని వార్తలు వస్తున్నాయి. ఆ జాబితాలో శంకర్ నాయక్ కూడా ఉన్నారట. అందుకే ఇప్పట్నుంచే ఎమ్మెల్యేను పక్కనెడుతున్నారనే టాక్ కూడా నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఇలా కేటీఆర్ ప్రవర్తించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.
ఇదంతా జరిగినప్పుడు మంత్రి సత్యవతి రాథోడ్ కూడా కేటీఆర్ వెంటే ఉన్నారు.మొత్తానికి చూస్తే.. కేటీఆర్-శంకర్ మధ్య ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిందా.. లేకుంటే ఇప్పట్నుంచే పక్కనెడుతున్నట్లు అన్నారనేదానికి ఇది సంకేతమా..? అనేది తెలియట్లేదు. కేటీఆర్ తీరుపై శంకర్ నాయక్ సామాజిక వర్గం తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. సోషల్ మీడియాలో అయితే చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ వస్తున్నాయి. . ఇద్దరి మధ్య అసలేం జరిగింది..? కేటీఆర్ ఎందుకిలా ప్రవర్తించారు..? అనేది తెలియాలంటే ఎమ్మెల్యేగానీ.. మంత్రిగానీ రియాక్ట్ అయితే తప్ప తెలిసేలా లేదు....
Jul 01 2023, 19:09