మంత్రి మల్లారెడ్డి సీటుకు ఎసరు?
రెండు పార్టీలు, ఇద్దరు ప్రత్యర్థుల మధ్య పొలిటికల్ వార్ జరగడం సహజం. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఓ అసెంబ్లీ సెగ్మంట్ టికెట్ కోసం రెండు ప్రైవేటు వర్సిటీల మధ్య పోటీ నెలకొందన్న ప్రచారం జరుగుతున్నది. నియోజకవర్గంలోని ఓట్లలో తమ సంస్థకు చెందిన ఎంప్లాయీస్, స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నట్టు ఇరువురు లెక్కలతో సహా చూపుతున్నట్టు తెలుస్తున్నది. ఈసారి ఆ టికెట్‌ను ఏ వర్సిటీకి చెందిన మేనేజ్మెంట్‌కు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
మల్లారెడ్డిపై నెగెటివ్ రిపోర్టు..?
మంత్రి మల్లారెడ్డికి సిట్టింగ్ నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. మళ్లీ ఆయనకు టికెట్ ఇస్తే గెలవడం కష్టమని సర్వేల్లో వెల్లడైందని టాక్ ఉంది. దీంతో ఆ స్థానంలో కొత్త అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని ప్రగతిభవన్ వర్గాలు ఆరా తీసే పనిలో పడ్డాయి. అక్కడ టికెట్ ఆశిస్తున్న లీడర్లలో ఎవరికి టికెట్ ఇస్తే గెలుపు సులువుగా ఉంటుందో తెలుసుకునేందుకు సర్వేలు జరుపుతున్నట్టు తెలిసింది. ఆ సెగ్మంట్‌లో పార్టీకి ఎంత బలం ఉంది? అభ్యర్థికి ఏ మేరకు పట్టుంది? అని ఆరా తీస్తున్నారు.
టికెట్ కోసం మంత్రి పట్టు
మేడ్చల్ టికెట్ తనకే ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డి గట్టిగా పట్టుపడుతున్నారు. గత ఎన్నికల కన్నా ఈసారి మరింత మెజార్టీ పెరుగుతుందని ధీమాగా ఉన్నారు. అయితే సెగ్మంట్‌లో నెగిటివ్ ఉన్నట్టు వస్తున్న వార్తలను ఆయన తిప్పికొడుతున్నారు. తన పర్సిటీ, విద్యాసంస్థల్లో పనిచేసే ఎంప్లాయీస్, స్టూడెంట్స్ ఓట్లు భారీ స్థాయిలో ఉన్నట్టు ఆయన సైతం లెక్కలతో సహా వివరిస్తున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతున్నది.
టికెట్ కోసం పల్లా ప్రయత్నాలు
మంత్రి మల్లారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మేడ్చల్ అసెంబ్లీ సెగ్మంట్‌పై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కన్నుపడిందనే ప్రచారం జరుగుతున్నది. కొత్త అభ్యర్థి కోసం ఆన్వేషణ జరుగుతుందని గ్రహించిన పల్లా ఆ టికెట్ దక్కించుకునేందుకు పైరవీ చేస్తున్నట్టు తెలుస్తున్నది. మేడ్చల్ టికెట్ తనకే ఎందుకు ఇవ్వాలో లెక్కలతో సహా ప్రగతిభవన్ వర్గాల ముందు పెట్టినట్టు సమాచారం. మేడ్చల్ అసెంబ్లీ సెగ్మంట్ పరిధిలో పల్లాకు ఓ ప్రైవేటు వర్సిటీతో పాటు పలు విద్యాసంస్థలు ఉన్నాయి. అందులో పనిచేసే ఎంప్లాయీస్, స్టూడెంట్స్ మేడ్చల్ అసెంబ్లీ సెగ్మంట్ పరిధిలోనే ఓటు నమోదు చేసుకున్నారని లెక్కలతో సహా వివరించినట్టు తెలుస్తున్నది...
Jul 01 2023, 19:05