బండి సంజయ్ ఓ బిత్తిరి సత్తి? : రేవంత్ రెడ్డి ఫైర్
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఫీడ్ బ్యాక్ ఆధారంగానే కాంగ్రెస్ మ్యానిఫెస్టో రూపొందిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం రేవంత్ రెడ్డి ఖమ్మంలో జరుగుతోన్న భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొన్నారు. భట్టి, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఈ నెల 2వ తేదీన జరగనున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భట్టి పాదయాత్ర కాంగ్రెస్‌కే కాదు.. యావత్ తెలంగాణకు మేలు చేస్తుందని అన్నారు. భట్టి పాదయాత్ర నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను మేల్కొలిపిందన్నారు.
పీపుల్స్ మార్చ్ యాత్రలోని ప్రజా సమస్యల అంశాల ఆధారంగా మేనిఫెస్టో రూపొందిస్తామని తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ భట్టి యాత్ర సాగిందన్నారు. భట్టి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున నిర్వహిస్తోన్న జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారని.. ఖమ్మం జనగర్జన సభ తెలంగాణ ప్రజలకు దశ, దిశ నిర్దేశించబోతుందని అన్నారు.
రాబోయే ఎన్నికల కోసం ఖమ్మం సభ నుండే రాహుల్ సందేశం ఇవ్వబోతున్నారని.. ఖమ్మంలో రాహుల్ గాంధీ ఇచ్చే సందేశం తెలంగాణ ముఖ చిత్రం మార్చబోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ మొజంజాహీ మార్కెట్‌లో గులాబీ పూలు అమ్ముకునేవాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ ఓ బిత్తిరి సత్తి అని.. ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్, రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇళ్లపై ఐటీ చేసిన దాడుల్లో దొరికిన ఆస్తులు ఎన్నో బయట పెట్టాలని ఈ సందర్భంగా రేవంత్ డిమాండ్ చేశాడు...
Jul 01 2023, 10:00