తెలంగాణ నుండి మరొకరికి కేంద్రమంత్రి పదవి.. ఆ నలుగురు ఎంపీల్లో ఒకరికి చాన్స్..?
వచ్చే నెల మొదటి వారంలో కేంద్ర కేబినెట్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. తెలంగాణ నుంచి మరొకరికి కేంద్రమంత్రి పదవి దక్కే చాన్స్ ఉన్నది. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని కేబినెట్‌లోకి తీసుకోవాలనే ఆలోచన ఉన్నట్టు బీజేపీ కేంద్ర కార్యాలయ వర్గాల సమాచారం.
ఆ చాన్స్ ఎవరికి లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రం నుంచి బండి సంజయ్ (కరీంనగర్), అర్వింద్ (నిజామాబాద్), సోయం బాపూరావు (ఆదిలాబాద్) లోక్‌సభకు ఎన్నికవగా.. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వీరిలో కేంద్రమంత్రి పదవి ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఆ ఒక్కరు ఎవరు..?
తెలంగాణ నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ సెకండ్ బెర్త్ విషయంపై కొంతకాలంగా ఢిల్లీ బీజేపీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. రెండేండ్ల క్రితం జరిగిన కేబినెట్ మార్పులు చేర్పుల్లో పన్నెండు మందిని బయటకు పంపగా.. 17 మందికి కొత్తగా అవకాశం లభించింది. గత నెలలో కిరణ్ రెజిజును న్యాయ మంత్రి బాధ్యతల నుంచి తప్పించి ఎర్త్ సైన్స్ శాఖకు మాత్రమే పరిమితం చేశారు.
ఈ ఏడాది చివర్లో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున.. ఈ నాలుగు పెద్ద రాష్ట్రాలకు చెందిన వారికి కేంద్ర కేబినెట్‌లో అవకాశం కల్పించాలన్నది ప్రధాని మోడీ ఆలోచిస్తున్నట్టు టాక్.
మరి తెలంగాణ నుంచి ఎవరికి చాన్స్ దొరుకుతుందన్నది అంతుచిక్కడంలేదు. బండి సంజయ్ ఇప్పటికే స్టేట్ చీఫ్‌గా కొనసాగుతున్నందున, ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించే ఆలోచన లేదని స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ క్లారిటీ ఇచ్చారు. కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పజెప్పనున్నట్టు వచ్చిన వార్తలను ఆయన కూడా ఖండించారు.
ఒకే వ్యక్తికి రెండు కీలక పదవులు ఇవ్వరాదన్నది బీజేపీ నిర్దేశించుకున్న విధానం. దీంతో కేంద్ర కేబినెట్‌లోకి బండి సంజయ్ చేరిక దాదాపు లేనట్లే. మరి అర్వింద్, సోయం బాపూరావ్, లక్ష్మణ్‌లలో ఎవరికి చాన్స్ లభిస్తుందో వేచి చూడాల్సిందే. పీఎం లాడ్స్ నిధులను తన కుమారుడి పెండ్లికి, ఇల్లు కట్టుకోడానికి వాడుకున్నానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సోయం బాపూరావుకు చాన్స్ ఉంటుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.
అర్వింద్ లేదా లక్ష్మణ్..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించాలనుకుంటున్నందున నిజామాబాద్ ఎంపీ అర్వింద్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాత్రమే ఉన్నారు. వీరిద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు. ప్రస్తుతం జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా లక్ష్మణ్ ఉన్నందున ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించి కేంద్ర కేబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
జూలై ఫస్ట్ వీక్‌లోనే కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికలను, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని కోణాల నుంచి విశ్లేషించి ప్రధాని మోడీ నిర్ణయం తీసుకోనున్నారు. ఏకకాలంగా అటు పార్టీకి కలిగే ప్రయోజనాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలో బుధవారం రాత్రి ఐదున్నర గంటల పాటు చర్చలు జరిపి కేబినెట్‌లో మార్పులు, వివిధ రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల మార్పు గురించి లోతుగా చర్చించారు..,
Jun 30 2023, 14:44