అమిత్ షాతో కేటీఆర్ : కీలక భేటీ..
•నేడు రేపు ఢిల్లీ పర్యటనలో కేటీఆర్
•చాలాకాలం తర్వాత కలవనున్న బీజేపీ, బీఆర్‌ఎస్ కీలక నేతలు
•రాజకీయ వ్యవహారాలపై కూడా ఇద్దరూ చర్చించే అవకాశం
ఉప్పు, నిప్పులా ఉండే బీజేపీ, బీఆర్‌ఎస్‌లోని ఇద్దరు కీలక నేతల మధ్య ఢిల్లీలో సమావేశం జరగనుంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ హస్తినలో సమావేశం కానున్నారు. రెండురోజుల పర్యటన నిమిత్తం కేటీఆర్ శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. గతంలోనూ పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్ కేంద్ర మంత్రులను కలిసినా.. అమిత్ షాతో భేటీ కాలేదు. అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఆయనను కలవనున్నారు. నిన్న మొన్నటి వరకూ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బీఆర్‌ఎస్ నేతలు కొద్ది కాలంగా మౌనం పాటిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో, బీఆర్‌ఎస్‌పై తమ పార్టీ వైఖరి పట్ల కొందరు బీజేపీ రాష్ట్ర నేతలూ అసంతృప్తిగా ఉన్నట్లు కథనాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే, ఇప్పుడు అమిత్ షాను కేటీఆర్ కలవనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరేందుకే ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు చెబుతున్నా.. ఈ సమావేశంలో ఇతర రాజకీయ వ్యవహారాలూ చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది. ఇటీవల కాలంలో రాష్ట్రానికి పలుమార్లు వచ్చిన అమిత్ షా అనేక బహిరంగసభల్లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. తెలంగాణతో ఒక్క కుటుంబానికే లబ్ధి చేకూరిందని, రాష్ట్రప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు కురిపించారు.
దీనికి మంత్రి కేటీఆర్ సైతం అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ శుక్ర, శనివారాల్లో అక్కడే ఉండి హోంమంత్రితోపాటు కేంద్రమంత్రులనూ కలుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 9 సంవత్సరాల నుంచి రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్థి కార్యక్రమాలకు కేంద్రప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదని, పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర అంశాల విషయంలో మరోసారి మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకే మంత్రి ఢిల్లీకి వెళ్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రసూల్‌పుర వద్ద చేపట్టిన రోడ్డు అభివృద్థి కార్యక్రమాలకు హోంశాఖ పరిధిలో ఉన్న భూముల గురించి కేటీఆర్ అమిత్ షాతో మాట్లాడనున్నారు. ముఖ్యంగా నగరంలో తలపెట్టిన స్కై వేల నిర్మాణం కోసం రక్షణశాఖ నుంచి అడుగుతున్న కంటోన్మెంట్ భూముల వ్యవహారం గురించి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ని కలిసి అడగనున్నారు. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించిన అంశంపై కేంద్ర శాఖ పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లేదా వీకే సింగ్‌లతో సమావేశమై చర్చించే అవకాశం ఉంది. మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పురితో మంత్రి కేటీఆర్ సమావేశం అవుతారు. వీరితోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై కూడా పలువురు కేంద్రమంత్రులను కేటీఆర్ కలుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రప్రభుత్వం అడిగినా స్పందించకుంటే కేంద్రం వైఖరిని ఎండగట్టేందుకూ సిద్ధంగా ఉన్నామని పార్టీ వర్గాలు తెలిపాయి...
Jun 23 2023, 12:30