సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. పాదయాత్రకు సిద్ధం
సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను, ఆరోపణలను తిప్పికొట్టేందుకు.. సిద్ధమయ్యారు. ఇందుకోసం నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తన పుట్టినరోజు అయిన నవంబర్ 8వ తేదీన.. మూసీ పునరుజ్జీవ ప్రజా చైతన్య యాత్ర పేరుతో పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. మూసీ పరివాహక గ్రామాల్లో పర్యటిస్తూ.. ప్రజలతో మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.
సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజీవం ప్రాజెక్టు విషయంలో ప్రజల నుంచి వస్తున్న మిశ్రమ స్పందనతో.. మూసీ పరివాహక ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలను కలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ మేరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 08వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా.. తన క్షేత్రస్థాయి పర్యటనలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని.. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం వైటీడీఏ, జిల్లా అధికారులతో కలిసి యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించనున్నారు.
మూసీ పునరుజ్జీవన ప్రజా చైతన్య యాత్ర" పేరుతో సీఎం రేవంత్ రెడ్డి తలపెట్టిన పాదయాత్రను వాడపల్లి నుంచి ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్ర.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని బొల్లేపల్లి నుంచి సంగెం, భీమలింగం వంతెన వరకు సాగనుంది. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ క్రమంలోనే.. మల్లన్న సాగర్ నుంచి యాదాద్రి జిల్లాకు మంచినీటి సరఫరా కోసం నిర్మించనున్న పైప్ లైన్ ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేస్తారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ప్రభుత్వ, ప్రతిపక్ష నేతల మధ్య ఈ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై విమర్శలు గుప్పుమంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే.. వాడపల్లి నుంచి తాను చేయనున్న పాదయాత్రకు కలిసి రావాలని.. నల్గొండ జిల్లా ప్రజలు మూసీ ప్రక్షాళనను కోరుకుంటున్నారా లేదా అని వారినే అడిగి తెలుసుకుందామంటూ ఛాలెంజ్ చేశారు. ఆరోజు చెప్పినట్టుగా.. ఈనెల 8 నుంచి మూసీ పునరుజ్జీవన ప్రజా చైతన్య పాదయాత్రను చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు.
అధికారంలో ఉన్నప్పుడే బీఆర్‌ఎస్ నేతలు మూసీ పునరుజ్జీవనం కోసం ప్రయత్నాలు చేశారని.. అందుకోసం మూసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కూడా ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా ప్రాజెక్టు డిజైన్ కూడా చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మాత్రం.. అసలు మూసీ ప్రక్షాళనే తప్పు అన్నట్టుగా బీఆర్‌ఎస్ నేతలు నానా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ సుందరీకరణపై సూచనలు ఇవ్వాలని.. అంతేకానీ ఈ ప్రాజెక్టును అడ్డుకోవడం సమంజసం కాదని హెచ్చరించారు. మూసీ మురికిలో ఉండేందుకు ప్రజలెవరూ సుముఖంగా లేరన్నారు. మూసీ పరివాహక ప్రజలకు న్యాయం చేసేందుకు ఏమైనా సూచనలు ఉంటే చేయాలని.. అంతే కానీ ఆందోళనలు చేయడం సరికాదని బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
Nov 04 2024, 19:49