ఆర్బీఐ వద్ద ఏపీ సెక్యూరిటీ బాండ్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది.
అధికారంలోకి రావడానికి ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడానికి అవసరమైన నిధులను కూడగట్టుకునే ప్రయత్నాల్లో పడింది. ఇందులో భాగంగా- ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టే సంప్రదాయాన్ని అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కొనసాగిస్తోంది.
ఇప్పటికే దశలవారీగా వేల కోట్ల రూపాయల విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి అప్పులకు వెళ్లింది చంద్రబాబు సర్కార్. తాజాగా 2,000 కోట్ల రూపాయలను సమీకరించుకోనుంది. దీనికి అవసరమైన రెండు సెక్యూరిటీ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ వద్ద వేలానికి పెట్టింది.
ఒక్కో బాండ్ విలువ 1,000 కోట్ల రూపాయలు. ఇవి రివైజ్డ్ సెక్యూరిటీ బాండ్లు. ఈ నెల 5వ తేదీన అంటే మంగళవారం నాడు ఈ సెక్యూరిటీ బాండ్లు వేలానికి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఇ-కుబేర్) ద్వారా వేలం పాట సాగుతుంది. కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ రూపంలో వాటిని విక్రయిస్తుంది.
ఈ బాండ్ల కాల వ్యవధి ఒకటి- 18, మరొకటి- 23 సంవత్సరాలు. వ్యక్తులు లేదా సంస్థలు వీటిని కొనుగోలు చేయవచ్చు. కాంపిటీటివ్ విధానంలో బాండ్లను కొనదలిచిన వారు ఈ నెల 30వ తేదీన ఉదయం 10:30 నుంచి 11:30 గంటలు, కాంపిటీటివ్ విధానంలో బాండ్లను కొనదలిచిన వారు అదే తేదీన ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య తమ బిడ్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది.
అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం ఈ నెలన్నర రోజుల వ్యవధిలో తన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టడం ఇది అయిదోసారి. ఇదివరకే 12,000 కోట్ల రూపాయల విలువ చేసే బాండ్లను వేలం పాట ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే. తొలుత 3,000 కోట్లు, ఆ తరువాత 5,000 కోట్లు, మూడో విడతలో 2,000 కోట్లు, నాలుగోసారి మళ్లీ 2,000 కోట్ల రూపాయలను ఆర్బీఐ వద్ద రుణాల ద్వారా సేకరించింది.
ఏపీతో పాటు మరి కొన్ని రాష్ట్రాలు తమ సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టాయి. బిహార్- రూ. 2,000 కోట్లు, హర్యానా- రూ. 1,500 కోట్లు, కేరళ- రూ.1,000 కోట్లు, తమిళనాడు- రూ. 2,000 కోట్లు, ఉత్తరాఖండ్- రూ. 500 కోట్లు, మిజోరం- 80 లక్షల రూపాయల మేర బాండ్లను వేలానికి పెట్టాయి. మొత్తంగా 9,467 కోట్ల రూపాయల విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను వచ్చే మంగళవారం వేలానికి పెట్టనుంది ఆర్బీఐ.
Nov 03 2024, 12:05