సరిహద్దుల్లో చైనా సైనికుల్ని కలిసిన కేంద్రమంత్రి
భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో మూడేళ్లుగా నెలకొన్న ప్రతిష్టంభన క్రమంగా తొలగిపోతోంది. గతంలో సరిహద్దుల్లో హోరాహోరీగా మోహరించిన ఇరు దేశాల బలగాలు దాదాపుగా వెనక్కి తగ్గాయి. దీంతో పాటు దీపావళి సందర్భంగా ఇరు దేశాల సైనికులు స్వీట్లు కూడా పంచుకున్నారు. దీనికి కొనసాగింపుగా అన్నట్లు కేంద్రమంత్రి ఒకరు ఇప్పుడు చైనా సైనికులతో సరిహద్దుల్లో బహిరంగంగానే మాట్లాడుతూ కనిపించడం ఆసక్తి రేపుతోంది.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తాజాగా సరిహద్దుల్లో చైనా సైనికుల్ని కలిశారు. ఇరుదేశాల చెక్ పోస్ట్ వద్ద కిరణ్ రిజిజు చైనా సైనికులతో ముచ్చటిస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఒకప్పుడు సరిహద్దుల్లోకి ఆర్మీ ఛీఫ్ వెళ్లే పరిస్ధితులే లేవు.
కానీ ఇప్పుడు ఏకంగా నిరాయుధుడైన కేంద్రమంత్రి చైనా సరిహద్దుల్లో వారి సైనికులతోనే చిట్ చాట్ చేయడం ఇప్పుడు ఇరు దేశాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇరు దేశాల మధ్య మారిన పరిస్ధితులకు నిదర్శనంగా కనిపిస్తోంది.
శత్రునాష్ అనే అక్షరాలతో ఉన్న ఉన్ని టోపీని ధరించి చైనా సైనికులతో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సంభాషిస్తున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు ఇంటర్ నెట్ లో వైరల్ అవుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ జిల్లాలో 15 వేల అడుగుల ఎత్తులో ఉన్న బుమ్లాలో ఉన్న ఆర్మీ ఫార్వార్డ్ ఏరియాలో ఈ దృశ్యం కనిపించింది. లడఖ్ లోని వివాదాస్పద ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైనికులు వెనక్కి తగ్గిన తర్వాత ఓ కేంద్రమంత్రి ఇక్కడకి రావడం ఇదే తొలిసారి.
Nov 02 2024, 16:01