హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులు
కురుమూర్తి జాతరకు వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ ఓ శుభవార్తను అందించింది. కురుమూర్తి జాతరకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గ్రామ సమీపంలో కొలువైన శ్రీ కురుమూర్తి స్వామి వారి బ్రహోత్సవాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల ఈనెల (నవంబర్) 18 వరకు ఎంతో వైభవంగా జరగనున్నాయి. ఈ జాతరకు సుమారు 10 లక్షల మంది భక్తులు పాల్గొననున్నట్లు తెలిపారు.
ఈ జాతరకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ఓ గుడ్‌న్యూస్‌ను మోసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్‌టీసీ అధికారులు తెలిపారు. పాలమూరు జిల్లాలోని వెలసిన కురుమూర్తిస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లానుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకోనేందుకు తరలి రానున్నారు.
జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం నవంబర్ 8వ తేదిన ఉంటుంది. ఈ నెల 7వ తేది నుంచి 9వ తేది వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈక్రమంలో ఆయా రోజుల్లో ప్రత్యేక బస్సులను హైదరాబాద్ నుంచి ఏర్పాటు చేయనునట్లు అధికారులు తెలిపారు. ఎమ్‌జిబిఎస్ నుంచి ఆరాంఘర్, మహబూబ్‌నగర్ మీదుగా జాతరకు బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ స్పెషల్ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ అవకాశం కూడా ఉంది.
కురుమూర్తి స్వామివారి జాతరకు సుమారు 900 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు ఇక్కడివారు చెబుతున్నారు. అందుకే ఇక్కడ ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ఈ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దాదాపు 500 మంది పోలీసులతో జాతర ప్రాగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Nov 02 2024, 12:07