నాగార్జున సాగర్, శ్రీశైలం వెళ్ళే పర్యాటకులకు ఎగిరి గంతేసే వార్త
శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకున్న వేళ ఈ రెండు ప్రాజెక్టులను ఇటీవల పర్యాటకులు అధిక సంఖ్యలో దర్శించి కృష్ణమ్మ పరవళ్లను చూస్తూ అద్భుతమైన అనుభూతిని పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్ నుండి సాగర్ వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన విషయం కూడా తెలిసిందే.
ఇక ఇదే క్రమంలో పరవళ్ళు తొక్కుతున్న కృష్ణా నదిపైన నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు బోట్ షికారు చేసేలా పర్యటకుల కోసం పర్యాటక అభివృద్ధి సంస్థ త్వరలోనే లాంచీలను ప్రారంభించునుంది. నవంబర్ రెండవ తేదీ నుంచి నాగార్జునసాగర్ శ్రీశైలం మధ్య లాంచి ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు పర్యాటక అభివృద్ధి సంస్థ వాటర్ ఫ్లీట్ జనరల్ మేనేజర్ ఇబ్రహీం ఒక ప్రకటనలో తెలిపారు.
పరవళ్ళు తొక్కే కృష్ణ నది అందాలను ఆస్వాదిస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని వీక్షిస్తూ నాగార్జునసాగర్ నుండి శ్రీశైలానికి ప్రయాణించే కొత్త అనుభూతి ఇకపై పర్యాటకులకు కలగనుందని ఆయన తెలిపారు. ఒకవైపు నల్లమల అటవీ ప్రాంతం తో పాటు మరోవైపు కృష్ణమ్మ పరవళ్లతో పచ్చని ప్రకృతి దృశ్యం మధ్య సాగే ప్రయాణం ఆద్యంతం మరువలేని స్మృతులను మిగులుస్తుందన్నారు.
ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు జరిగే ఈ ప్రయాణం దాదాపు 7 గంటల పాటు జరుగుతుందని, పక్షుల కిలకిల రావాలతో, జలసవ్వడితో, ప్రకృతి కాంత సోయగాలతో మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుందని, కచ్చితంగా ఈ లాంచి ప్రయాణం కొత్త అనుభూతిని నింపుతుందని ఆయన పేర్కొన్నారు.
నవంబర్ 2 నుంచి లాంచీ ప్రయాణం
నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం కు బోట్ షికారు చేయాలనుకునేవారు ఒకవైపుకు మాత్రమే ప్రయాణం చేయాలంటే పెద్దలకు రూ. 2000 పిల్లలకు 1600 గా నిర్ణయించినట్లు తెలిపారు. అదే రెండు వైపులా బోట్ ద్వారానే ప్రయాణం చేయాలనుకుంటే పెద్దలకు 3000 రూపాయలు పిల్లలకు 2400 టికెట్ ధర నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఇక నాగార్జునసాగర్, శ్రీశైలంలో ప్రకృతి సోయగాలను తనివితీరా చూడాలనుకునేవారు నవంబర్ 2 నుంచి లాంచీ ప్రయాణం ద్వారా చూడవచ్చు అని పేర్కొన్నారు.
Oct 27 2024, 20:35