జగన్ ను జైలుకు పంపడమే మీ ఉద్దేశ్యమా.
వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వివాదంపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు కన్నీళ్లకు విలువలేదని.. ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. జగన్ ప్రత్యర్థుల కుట్రలో షర్మిల పావుగా మాట్లాడారని ఆరోపించారు. దొంగ సంతకాలతో షేర్లు ట్రాన్స్ ఫర్ చేసుకున్నారని విమర్శించారు.
వైఎస్ ఫ్యామిలీలో ఆస్తుల వివాదం రోజూకో మలుపు తిరుగుతోంది. విషయం కాస్త కోర్టు వరకు చేరటంతో… అటు షర్మిల, మరోవైపు వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఆదివారం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్ రాజకీయ ప్రత్యర్థుల కుట్రలో వైఎస్ షర్మిల పావుగా మారారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. షర్మిలకు కన్నీళ్లకు విలువలేదన్నారు.ఆమెను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. జగన్ పై అనేక కేసులు మోపిన కాంగ్రెస్ పార్టీతో పాటు… కుట్రలు చేసిన చంద్రబాబుతో చేతులు కలుపుతారా అని ప్రశ్నించారు. జగన్ కు వ్యతిరేకంగా షర్మిలను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జగన్ కు రాసిన లేఖ టీడీపీ చేతికి ఎలా చేరిందని వైఎస్ షర్మిలను ప్రశ్నించారు. ప్రత్యర్థుల కుట్రలో మీరు భాగమవ్వటం శోఛనీయమన్నారు.
ఆస్తుల పంపకంపై 2019లో ఒప్పందం జరిగిందని విజయసాయిరెడ్డి తెలిపారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన 10 ఏళ్ల తర్వాత జగనే స్వయంగా… ఆస్తులను పంచి ఇస్తానని చెప్పారని గుర్తు చేశారు. తన స్వార్జితమైన ఆస్తుల్లో 40 శాతం ఇస్తానని ఏంవోయూ చేశారని వివరించారు. ఆస్తులపై ఉన్న కోర్టు కేసులు పూర్తి అయిన తర్వాత ఇస్తామని ఏంవోయూలో పేర్కొన్నారని తెలిపారు. కానీ జగన్ కు తెలియకుండా హుటాహుటిన దొంగ సంతకాలతో షేర్లు ట్రాన్స్ ఫర్ చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని నిలదీశారు. కేసుల ఉన్న నేపథ్యంలో ఆస్తుల ట్రాన్స్ ఫర్ జరిగితే జగన్ బెయిల్ రద్దు అవుతుందన్న విషయం కూడా షర్మిలకు తెలుసని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
జగన్ బెయిల్ రద్దు కావాలని... చంద్రబాబు అజెండా ఉందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ కుట్రలో షర్మిల పావుగా మారిపోయారని చెప్పారు. ఆస్తుల ట్రాన్స్ ఫర్ విషయంలో చంద్రబాబు హస్తం ఉందన్నారు. జగన్ ను జైలుకు పంపడమే మీ ఉద్దేశ్యమా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత అన్నపై కుట్ర చేయటం ఏంటని షర్మిలను నిలదీశారు. జగన్ బెయిల్ రద్దు చేసేందుకు ప్రత్యర్థులంతా కలిసి కుట్ర చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆస్తుల విషయంలో చాలా చర్చలు జరిగాయని విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ సమస్య ఇద్దరిది మాత్రమే అని… కానీ ప్రత్యర్థులు రంగంలోకి దిగటంతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో జరిగిన చర్చల విషయం గురించి బయటికి తెలియాలంటే… వైఎస్ షర్మిలనే అడగాలని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు విజయసాయిరెడ్డి బదులిచ్చారు.
Oct 27 2024, 16:54