స్టీల్ ప్లాంట్ పై ఢిల్లీ కీలక నిర్ణయం
విశాఖ స్టీల్ ప్లాంట్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక వైపు కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా సహకరిస్తామని చెబుతోంది. కొంత మేర నిధులను విడుదల చేసింది. కానీ, ఆ నిధుల వినియోగానికి షరుతులు విధించింది. ఇటు ఉద్యోగుల విషయంలో మాత్రం నిర్ణయాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. సెయిల్ లో స్టీల్ ప్లాంట్ విలీన ప్రతిపాదన ఉండగానే .. తాజాగా ఉద్యోగుల వీఆర్ఎస్ పై యాజమాన్యం సర్క్యులర్ జారీ చేయటం వివాదంగా మారుతోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ దిశగానే కేంద్రం అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. తాజాగా ప్లాంట్ ఉద్యోగుల వీఆర్ఎస్ కోసం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో ప్లాంట్ లోని హెచ్ఆర్ విభాగం కీలక సర్క్యులర్ జారీ చేసింది. ప్లాంట్ ప్రయివేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తాము ఆందోళన చేస్తున్న సమయంలో ఈ రకంగా సర్క్యులర్ జారీ చేయటం పైన ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్క్యులర్‌లో సర్వే నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ కార్మికులు, ఉద్యోగుల్లో అనేక రకాలైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్యోగుల పోర్టల్ సపోర్ట్ సిస్టమ్‌లో 'సర్వే ఫర్ విఆర్‌ఎస్' పేరుతో ఒక మాడ్యుల్‌ను రూపొందించి నట్లు సర్క్యులర్‌లో యాజమాన్యం పేర్కొంది. భాగస్వాములు అయ్యే వారి అభిప్రాయాలను తీసుకునేందుకు సర్వేలను నిర్వహించారు. సర్వేల్లో అవును, కాదు అని సమాధానం వచ్చేలా ప్రశ్నలు ఉంటాయి. అయితే, ఉక్కు యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్‌లో దీనికి భిన్నంగా అర్హులైన ఉద్యోగులు విఆర్‌ఎస్‌కు ఈ మాడ్యుల్ ద్వారా 'అంగీకారం (విల్లింగ్‌నెస్) తెలపాలని పేర్కొనడం కలకలం రేపుతోంది. అయితే, సర్వేలో పాల్గొన్న వారు 'అంగీకారం' తెలిపినంత మాత్రాన దానికి విఆర్‌ఎస్‌కు దరఖాస్తుగా పరిగణించబోమని సర్కులర్‌లో పేర్కొనటం అధికారులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
అయితే, తాజాగా జారీ చేసిన సర్క్యులర్ లో ఆర్‌ఐఎన్‌ఎల్ ఉద్యోగులు, ఎగ్జిక్యూటివ్‌లకు ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు పేర్కొంది. ఎవరైనా విఆర్‌ఎస్ తీసుకోవాలని భావిస్తే యాజమాన్యం ఆ సౌకర్యం కల్పిస్తుందని, ఆ దిశలో ఆలోచించే వారు ముందుకు రావాలని ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేసారు. రెగ్యులర్ ఉద్యోగులు (ఎగ్జిక్యూటివ్‌లు, నాన్ ఎగ్జిక్యూటివ్‌లు )లకు ఈ విఆర్‌ఎస్ వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చారు. 2024 సెప్టెంబర్ 30 నాటికి 45 ఏళ్లు నిండిన వారు (15 ఏళ్లు సర్వీసు పూర్తిచేసుకుని ఉంటే) విఆర్‌ఎస్‌కు అర్హులని పేర్కొంది. ఉద్యోగులు ఈ నెల 29లోగా తమ ఇష్టాన్ని వెల్లడించాలని డెడ్‌లైన్ విధించింది. దీంతో, ఈ పరిణామాల పైన రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి నేతలు ఎలా స్పందిస్తారనేది చూడాలి.
Oct 23 2024, 19:53