చుక్కల్లో అమరావతి
అంబరాన అద్భుతం ఆవిష్కృతమైంది. రాజధాని అమరావతి నగరం సాక్షాత్కారమైంది. అమరావతి పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చే గౌతమబుద్ధుడి విగ్రహం ఆకాశంలో ప్రత్యక్షం కావడం చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. డ్రోన్లు సృష్టించిన మాయాజాలం ఇది.
ఏపీ ప్రభుత్వం నిర్వహించిన మెగా డ్రోన్ సమ్మిట్ సందర్భంగా విజయవాడ పున్నమి ఘాట్ వద్ద మంగళవారం రాత్రి డ్రోన్ లైట్ షో, మ్యూజిక్, డాన్స్ కార్యక్రం ఏర్పాటయింది. ఏపీ డ్రోన్ కార్పొరేషన్, ఢిల్లీకి చెందిన బోట్ ల్యాబ్స్ సంస్థ సంయుక్తంగా దీన్ని నిర్వహించాయి. ఈ షో కోసం మొత్తం 5,500 డ్రోన్లను వినియోగించాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలువురు రాష్ట్రమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఒకేసారి అయిదు గిన్నిస్ బుక్ రికార్డులు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
1911లో దేశంలో ఏర్పాటైన పౌర విమానయానం, త్రివర్ణ పతాకం, అంతర్జాతీయ పౌర విమానయాన లోగో, రాజధాని అమరావతిలో కొలువుదీరిన గౌతమ బుద్ధుడి ఆకృతులను ఈ డ్రోన్లతో సృష్టించారు. అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్‌ను వ్యవసాయ అవసరాల కోసం ఎలా వినియోగించుకోవచ్చనే విషయాన్నీ ఇందులో చూపించారు.
పున్నమి ఘాట్ చుట్టుపక్కల ఏడు కిలోమీటర్ల పరిధి వరకూ ఈ డ్రోన్ షో కనిపించింది. చిన్న చిన్న నక్షత్రాల్లా తళుకులీనుతూ, మెరుపుల్లా మెరుస్తూ కనువిందు చేశాయి. క్షణక్షణానికీ తమ రూపాన్ని సంతరించుకుంటూ కొత్త వాటిని ఆవిష్కరిస్తూ ఆహూతులను కట్టిపడేశాయి.
ప్రత్యేకించి- అమరావతి ల్యాండ్ మార్క్‌గా చెప్పుకొనే గౌతముడి విగ్రహం, జాతీయ జెండా ఆకృతులు ఆవిష్కృతమైనప్పుడు వీక్షకులు గట్టిగా చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ వాసులు చాలామంది ఇళ్లు, అపార్ట్‌మెంట్లపైకి ఎక్కి ఈ షోను తమ సెల్ ఫోన్లల్లో బంధించడం కనిపించింది.
ఈ డ్రోన్ లైట్ షోనకు అయిదు గిన్నిస్ బుక్ రికార్డులు లభించాయి. వివిధ కేటగిరీలో ఈ అవార్డులు వరించాయి. దీనికి సంబంధించన సర్టిఫికెట్లను గిన్నిస్ బుక్ ప్రతినిధులు చంద్రబాబు, రామ్మోహన్ నాయుడులకు అందజేశారు. రాజధాని అమరావతిని ఫ్యూచర్ సిటీగా అభివర్ణించారు.
Oct 23 2024, 13:13