సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
జనాభా నియంత్రణపై ఆందోళన వ్యక్తం చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసిక్తకర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ 16 మంది పిల్లలను కనాలనే ఆలోచనతో ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించారు.
తిరువాన్మియూర్లోని మరుంధీశ్వరార్ ఆలయం కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన 31 జంటల కల్యాణోత్సవానికి సీఎం స్టాలిన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణ విధానాలు పకడ్బందీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గిపోయి, నిధుల కేటాయింపులో కోత పడొచ్చన్న విశ్లేషణల నేపథ్యంలో స్టాలిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
'కొత్తగా పెళ్లయిన జంటలకు 16 రకాల ఆస్తులను పొందాలని పూర్వం పెద్దలు ఆశీర్వాదించేవారు. ఇప్పుడు ఆస్తికి బదులుగా 16 మంది పిల్లలను కనాలని, వారు ఆనందంగా జీవించాలని దీవించండి. జనాభా నియంత్రణ కారణంగా పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతోంది. పరిస్థితులు తగ్గట్టుగా మారాలి. ప్రతి ఒక్కరూ 16 మంది పిల్లలను కనాలనే ఆలోచనతో ఎందుకు ఉండకూడదు?' అని స్టాలిన్ ప్రశ్నించారు.
మరోవైపు కుటుంబ నియంత్రణలో విజయం సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పేర్కొంది. లోక్సభలో సీట్ల కేటాయింపు కోసం జనాభా లెక్కలను ఉపయోగించాలా అని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ప్రశ్నించారు. 'కుటుంబ నియంత్రణను అమలు చేయడంలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. 1988లో కేరళ, 1993లో తమిళనాడు, 2001లో ఆంధ్రప్రదేశ్, 2005లో కర్ణాటక- జనాభా పెరుగుదల నియంత్రణలో మొదటి స్థానంలో నిలిచాయి.
అయితే ఈ విజయాలు పార్లమెంట్లో ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందని గత కొంత కాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2001లో వాజ్‌పేయీ ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్‌సభ సభ్యుల సంఖ్యను 2026 వరకు మార్పు చేయకూడదని నిర్దేశించింది. అంటే 2031 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ఉంటుంది. ఇంతవరకు 2021 జనాభా లెక్కలను నిర్వహించలేదు. త్వరలో ప్రారంభిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఒకవేళ లెక్కిస్తే వాటిని లోక్సభ సీట్ల కోసం ఉపయోగిస్తారా లేదో చూడాలి' అని జైరాం రమేశ్ అన్నారు.
Oct 21 2024, 20:01