బాలకృష్ణ కోసం మోదీకి చంద్రబాబు కీలక సిఫార్సు..!!
ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. నందమూరి, మెగా హీరోల కేంద్రంగా ఏపీలో రాజకీయ నిర్ణయాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయంగా ఈ రెండు కుటుంబాలకు ప్రాధాన్యత పెరిగింది. తాజాగా సీఎం చంద్రబాబు నందమూరి హీరో బాలకృష్ణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి కీలక సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు ఆమోదం లభిస్తే ఇక బాలయ్య అభిమానుల ఆనందం అన్ స్టాపబుల్ గా మారనుంది.
కేంద్రం ప్రతీ ఏటా జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తుంది. ఇందు కోసం అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పలు కేటగిరీల్లో విశిష్ట వ్యక్తుల పేర్లను సిఫార్సు చేయటం ఆనవాయితీ. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తాజాగా నందమూరి బాలకృష్ణ పేరును పద్మవిభూషణ్ అవార్డుకు సిఫార్సు చేసినట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. బాలకృష్ణ సినీ రంగంలో తన 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. దీంతో.. సినీ రంగంతో పాటుగా సేవా రంగంలోనూ బాలకృష్ణ కు ప్రత్యేకత ఉంది.
బాలకృష్ణ సినిమాలతో పాటుగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. ఎంతో మంది పేదలకు క్యాన్సర్ వైద్యం అందిస్తున్నారు. దీంతో..బాలకృష్ణ పద్మభూషణ్ కు అర్హుడిగా పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ తో పాటుగా మరో సినీ ప్రముఖుడు మురళీ మోహన్ పేరును జత చేసినట్లు సమాచారం. అదే విధంగా వైద్యం, విద్య, సామాజిక రంగాల నుంచి మరి కొందరి పేర్లను ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు చెబుతున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ అవార్డు ప్రధానం చేసింది.
ప్రస్తుతం బాలయ్య సినీ, సేవా రంగాలతో పాటుగా ఓటీటీ లోనూ దూసుకుపోతున్నారు. ఎన్‌బీకే అన్ స్టాపబుల్ వరుస సీజన్లతో హంగామా చేస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుతో ఇందు కోసం షూటింగ్ పూర్తి చేసారు. సహా చిరంజీవి - పవన్ కల్యాణ్ కాంబోలో ఇదే షో లో ఒక ఎపిసోడ్ బాలయ్య ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, కేంద్రంలోనూ టీడీపీ ప్రధాన భాగస్వామిగా ఉంది. అటు కేంద్రం..ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటంతో .. ఏపీ ప్రభుత్వం సిఫార్సులకు ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పుడు బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు కోసం సిఫార్సు చేయటంతో కేంద్రం నిర్ణయం కీలకం కానుంది.
Oct 21 2024, 19:58