నిమజ్జనంలో 15వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది
రోడ్లపై చెత్త వేయకుండా జీహెచ్ఎంసీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కోరారు. మొత్తం 15 వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిమజ్జనంలో పాల్గొంటున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 465 క్రేన్స్, హుస్సేన్ సాగర్లో 38 క్రేన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గణేష్ నిమజ్జనం నేపథ్యంలో బల్దియా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి (GHMC Commissioner Amrapali ) తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రోడ్లపై చెత్త వేయకుండా జీహెచ్ఎంసీ (GHMC) సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. మొత్తం 15 వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిమజ్జనంలో పాల్గొంటున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 465 క్రేన్స్, హుస్సేన్ సాగర్లో 38 క్రేన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో జీహెచ్ఎంసీ నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేసిందన్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు జీహెచ్ఎంసీ సిబ్బందికి అసలైన పని ఉంటుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పేర్కొన్నారు.
రేపటి మహా నిమజ్జనానికి జీహెచ్ఎంసీ తరఫున ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 160 గణేష్ టీమ్స్ పనిచేయనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నిమజ్జనానికి 10 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు అయ్యాయి. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. నిమజ్జనం మరుసటి రోజు అదనంగా మరో 500 మంది సిబ్బంది పాల్గొననున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 73 వినాయక పాండ్స్, పెద్ద చెరువులలో నిమజ్జనానికి ఏర్పాటు చేశారు. అలాగే రేపటి నుంచి మూడు రోజులపాటు జీహెచ్ఎంసీ సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.
హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సోమవారం ఖైరతాబాద్ మహాగణపతిని మంత్రి దర్శించుకున్నారు. మహాగణపతి నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లు పొన్నం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొదటిసారి మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామని తెలిపారు. శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో నిర్వాహకులు పూజ కార్యక్రమాలు చేశారన్నారు. రేపు నిమజ్జన ఘట్టమని.. భక్తులు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు.
360 క్రేన్లు హైదరాబాద్ మొత్తం ఏర్పాటు చేశామని తెలిపారు. మొబైల్ క్రేన్లు కూడా ఉన్నాయన్నారు. అవసరమైన ప్రాంతాలకు తరలించదానికి ప్రత్యేక అధికారులు ఉన్నారని చెప్పారు. ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది వస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రేపు (మంగళవారం) ఉదయం ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభం అవుతుందని.. ఇప్పటికే పనులు జరుగుతున్నాయన్నారు. సమయానికి నిమజ్జనం పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. ఎల్లుండి వర్కింగ్ డే అని ఆలోపు నిమజ్జనం పూర్తి చేసుకుంటే ప్రజలకు ఇబ్బందులు ఉండవని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Sep 16 2024, 18:53