ఏపీలో కొత్తగా ఏడు ఎయిర్ పోర్టులు ? ఎక్కడెక్కడంటే..?
ఏపీలో తాజాగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు వేగంగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం నుంచి అందివచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోకూడదని భావిస్తోంది. ఇదే క్రమంలో కేంద్రంలో పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టులు నెలకొల్పేందుకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై కేంద్రం తాజా అప్ డేట్ ఇచ్చింది.
రాష్ట్రంలోని నెల్లూరు, కాకినాడ, కుప్పం, నాగార్జున సాగర్, ప్రకాశం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో కొత్తగా ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదనలు పంపింది. దీనిపై స్పందించిన కేంద్ర పౌరవిమానయానశాఖ ఆయా జిల్లాలలో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఉన్న అనుకూలతలపై అధ్యయనానికి అంగీకరించింది. ఆయా జిల్లాల్లో ఎయిర్ పోర్టుల నిర్మాణం చేపడితే ఎంత ఖర్చవుతుంది ? ప్రయాణికుల స్పందన ఎలా ఉంటుంది ? ఎయిర్ ట్రాఫిక్ ఎలా ఉందన్న దానిపై అధ్యయనం చేయనుంది.
ఇప్పటికే రాష్ట్రంలో తిరుపతి, విజయవాడ, విశాఖలో ఉన్న రెగ్యులర్ ఎయిర్ పోర్టులతో పాటు ఇతర జిల్లాల్లోనూ ఎయిర్ స్ట్రిప్స్ ఉన్నాయి. వీటిలో సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోంది.
వీటికి అదనంగా భోగాపురం ఎయిర్ పోర్టు కూడా వచ్చే ఏడాది అందుబాటులోకి రానుంది. అలాగే ప్రస్తుతం ఉన్న ఎయిర్ పోర్టుల్లో ట్రాఫిక్ పెంపు, కొత్త సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్ర పౌరవిమానయానమంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు సహకారంతో ఎంపీలు ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు.
Aug 20 2024, 19:29