సీఎం సీటు కోసం డీకే శివకుమార్ తాపత్రయమా..?
ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్దరామయ్యను దింపడమే లక్ష్యంగా కమలం పార్టీ పని చేస్తుందని మండిపడ్డారు. ముడా కుంభకోణ వ్యవహారంలో సీఎం సిద్దరామయ్యకు ఎటువంటి సంబంధం లేదన్నారు. సిఎం సిద్దూ అమాయకుడని ఈ సందర్భంగా శివకుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం మద్దతుగా నిలుస్తుందని చెప్పారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరాయమ్యను లక్ష్యంగా చేసుకుని మైసూర్ నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణం పేరుతో బీజేపీ నక్కి జిత్తుల వ్యవహారానికి తెర తీసిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ డి.కె.శివకుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్దరామయ్యను దింపడమే లక్ష్యంగా కమలం పార్టీ పని చేస్తుందని మండిపడ్డారు. ముడా కుంభకోణ వ్యవహారంలో సీఎం సిద్దరామయ్యకు ఎటువంటి సంబంధం లేదన్నారు. సిఎం సిద్దూ అమాయకుడని ఈ సందర్భంగా శివకుమార్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు అంతా సిఎం సిద్దరామయ్య వెంట ఉన్నారన్నారు. మంగళవారం డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. సీఎం పదవికి సిద్దూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన కుండ బద్దలు కొట్టారు. ముడా కుంభకోణం అంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబద్దాలని వివరించారు. సీఎం సిద్దరామయ్య తప్పు చేసినట్లు ఎటువంటి ఆధారాలు సైతం లేవని తెలిపారు.
మరోవైపు తాను ముఖ్యమంత్రి పదవి కోసం తాపత్రయపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అయినా ఈ విషయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. ముడా కుంభకోణంలో సీఎం సిద్దరామయ్య పాత్ర ఉందంటూ ట్రైయిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్ చేయవచ్చునంటూ కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గహ్లాత్ ఆదేశాలు జారీ చేశారు.గవర్నర్ జారీ చేసిన ఆదేశాలు నిలిపివేయాలంటూ.. సీఎం సిద్దరామయ్య సోమవారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆగస్ట్ 29వ తేదీ వరకు ఈ కేసులో సీఎం సిద్దరామయ్యను ఎటువంటి ప్రాసిక్యూషన్ చేయవద్దంటూ కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసులో సిఎం సిద్దరామయ్యకు తాత్కాలిక ఊరట లభించినట్లు అయింది.ఇంకోవైపు ఈ వ్యవహారంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్ లేఖ రాశారు. సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్ చేయాలంటూ గవర్నర్ ఆదేశాలు జారీ చేసిన అంశంలో జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతి ముర్ముకు డిప్యూటీ సీఎం శివకుమార్ సూచించారు.
Aug 20 2024, 19:19