బంగ్లా షేక్.. హసీనా ఔట్
బంగ్లాదేశ్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం
సోదరితో కలిసి విమానంలో భారత్‌కు
ఆర్మీ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం
ప్రధాని నివాసంలో ఆందోళనకారుల లూటీ
సర్కారును కూల్చిన ఉద్యోగ రిజర్వేషన్ల అంశం
బంగ్లాదేశ్‌లో తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తింది. దేశంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు పతాక స్థాయికి చేరడంతో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం చివరకు ఆమెనే గద్దె దింపింది. ప్రపంచంలోనే ఎక్కువ కాలం ప్రభుత్వాధినేతగా పనిచేసిన మహిళగా ఘనత వహించిన హసీనా ప్రజా ఉద్యమానికి జడిసి పదవిని వదులుకున్నారు. ఎన్నికల్లో తిరుగులేని ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అవమానకర రీతిలో దేశాన్ని వీడి పరారయ్యారు. దీంతో బంగ్లాదేశ్ సైనిక పాలన దిశగా అడుగులు వేస్తోంది. దేశాన్ని సైన్యం ఆధీనంలోకి తీసుకుంటున్నది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్లు ఆర్మీ చీఫ్ ప్రకటించారు. మరోవైపు హసీనా స్వదేశం నుంచి పరారై భారత్‌కు చేరారు.
ఎసరు తెచ్చిన 30 శాతం రిజర్వేషన్లు
1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడిన వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని హసీనా ప్రభుత్వం 2018లో నిర్ణయించింది. అప్పుడు తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ ప్రతిపాదనను పక్కనపెట్టింది. అయితే, రిజర్వేషన్లు కల్పించాలని ఈ ఏడాది జూన్‌లో హైకోర్టు తీర్పు ఇవ్వడంతో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు ‘స్టూడెంట్స్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్’ అనే పేరుతో జూలైలో ఉద్యమాన్ని ప్రారంభించారు. విశ్వవిద్యాలయాల్లో ప్రారంభమైన ఈ ఉద్యమంలో క్రమంగా రోడ్లపైకి చేరి హింసాత్మకంగా మారింది. పోలీసుల కాల్పుల్లో పదుల సంఖ్యలో విద్యార్థులు, నిరసనకారులు మరణించారు. దీంతో జూలై 21న 30 శాతం రిజర్వేషన్లను ఐదు శాతానికి కుదించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ నిరసనకారులు శాంతించలేదు.
ఆర్మీ అల్టిమేటంతోనే రాజీనామా?!
హసీనా రాజీనామాకు పట్టుబడుతూ మూడు రోజులుగా ఆందోళనకారులు దేశంలో రోడ్లపై నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమంపై హసీనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. మూడు రోజుల్లో దాదాపు 100 మంది ఆందోళనకారులు పోలీస్ కాల్పుల్లో మరణించారు. ఇది వారిలో మరింత ఆగ్రహానికి కారణమైంది. దీంతో సోమవారం ఆందోళనకారులు ఢాకాకు లాంగ్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. ఢాకా ప్రధాన వీధుల్లో వందలాది మంది గుమిగూడారు. దీంతో మరోసారి పోలీసులు కాల్పులు జరపగా ఆరుగురు నిరసనకారులు మరణించారు. ఇంతలో అనూహ్యంగా సోమవారం ఉదయం షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆమె ఉన్నఫళంగా ఢాకాను వీడి సైనిక విమానంలో భారత్‌కు పయనమయ్యారు. అయితే 45 నిమిషాల్లో పదవికి రాజీనామా చేసి, దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆర్మీ ఇచ్చిన అల్టిమేటంతోనే ఆమె పదవిని వదులుకున్నారని తెలుస్తోంది.
ముజిబుర్ విగ్రహాన్ని బద్ధలు కొట్టి సంబరాలు
హసీనా రాజీనామా విషయం తెలుసుకొని నిరసనకారులు సంబరాలు చేసుకున్నారు. ప్రధాని నివాసం గణ భవన్‌లోకి ప్రవేశించి ఫర్నీచర్‌ను, ఇతర సామాగ్రిని లూటీ చేశారు. హసీనా దుస్తులనూ ఎత్తుకెళ్లారు. హసీనా తండ్రి, బంగబంధుగా పేరొందిన ముజిబుర్ రెహ్మాన్ విగ్రహాన్ని సైతం నిరసనకారులు బద్దలు కొట్టారు. హసీనా పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు. హోంమంత్రి అసదుజ్జమన్ ఖాన్ ఇంటిని ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్ పార్లమెంటులోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. దేశవ్యాప్తంగా నాలుగు హిందూ ఆలయాలపైనా దాడి జరిగింది. అయితే ఈ పరిస్థితిని ఉపయోగించుకొని ఎవరూ దేశాన్ని దోచుకునేందుకు అవకాశం ఇవ్వొద్దని విద్యార్థి ఉద్యమ నేతల్లో ఒకరైన నహీద్ ఇస్లాం.. బంగ్లా ప్రజలను కోరారు.
తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు: ఆర్మీ చీఫ్
హసీనా రాజీనామా, దేశాన్ని వీడిన విషయాన్ని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ ప్రకటించారు. దేశానికి సంబంధించి తాను అన్ని బాధ్యతలు తీసుకుంటున్నానని, అందరూ సహకరించాలని ఆయన కోరారు. దేశం ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నదని, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, చాలామంది మరణించారని చెప్పారు. దేశంలో ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం లేదని, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్టు ప్రకటించారు.
హసీనా పయనం బ్రిటన్‌కా?
ఉన్నఫళంగా సైనిక విమానంలో తన సోదరి షేక్ రెహానాతో కలిసి ఢాకా నుంచి బయలుదేరిన షేక్ హసీనా ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయ్యారు. అయితే, ఆమె భారత్ నుంచి లండన్‌కు వెళ్లనున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే, భారత్‌లో ఆశ్రయం పొందడం హసీనాకు కొత్త కాదు. 1975లో హసీనా తండ్రి హత్య జరిగినప్పుడు ఆమె భారత్‌లోనే ఆశ్రయం పొందారు.
భారత్ అప్రమత్తం.. భద్రత కట్టుదిట్టం
షేక్ హసీనా రాజీనామా, బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది. భద్రత వ్యవహారాలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీతో సోమవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో భేటీ అయ్యారు. హసీనాతో భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ – బంగ్లా సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం హై అలెర్ట్ ప్రకటించింది. బంగ్లాదేశ్‌కు వెళ్లే అన్ని రైళ్లు, విమానాలు రద్దయ్యాయి.
ఇక రాజకీయాలకు గుడ్‌బై!
షేక్ హసీనా(78) ఇక రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు ఆమె కుమారుడు సాజీబ్ వాజేద్ తెలిపారు. దేశాన్ని హసీనా ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు.
ఎగసి‘పడిన’ కెరటం
బంగ్లాదేశ్ ప్రధానిగా ఎక్కువ కాలం పని చేసిన రికార్డు షేక్ హసీనాది. 1975లో హసీనా తండ్రి రెహ్మాన్, తల్లి, సోదరులు హత్యకు గురైనప్పుడు హసీనా, ఆమె సోదరి రెహానా జర్మనీలో ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డారు. అప్పుడు ఆరేండ్ల పాటు ప్రవాస జీవితం గడిపిన తర్వాత 1981లో ఆమె అవామీ లీగ్ పార్టీ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చాక అనేక నిర్బంధాలను ఎదుర్కొని నిలదొక్కుకున్నారు. 1991 ఎన్నికల్లో ఓడిపోయినా.. 1996 ఎన్నికల్లో గెలిచి మొదటిసారి ప్రధాని అయ్యారు. 2001 ఎన్నికల్లో మళ్లీ బీఎన్‌పీ చేతిలో ఓటమి చవిచూశారు. 2009లో మరోసారి ప్రధాని అయిన హసీనా అప్పటినుంచి 15 ఏండ్లుగా అప్రతిహతంగా నాలుగు పర్యాయాలు గెలిచి ప్రధానిగా కొనసాగారు. హసీనాపై 19 సార్లు హత్యాయత్నాలు జరిగాయి. 2004లోగ్రనేడ్ దాడి నుంచి ఆమె తృటితో తప్పించుకున్నారు. ఆర్థిక సంస్కరణలు చేపట్టి బంగ్లాదేశ్ దిశ, దశను మార్చారని ఆమె పేరు తెచ్చుకున్నారు. సైన్యం పెత్తనం, తిరుగుబాట్లతో దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కనుమరుగవుతున్న వేళ బంగ్లా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారు. అయితే, అదే స్థాయిలో ఆమె నియంతృత్వ శైలిని ప్రదర్శించారనే విమర్శలూ ఉన్నాయి.
Aug 06 2024, 11:23