Narendra Modi: కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే భారాసకు ఓటేయండి: మోదీ..
భోపాల్: కేసీఆర్ (KCR) కుమార్తె బాగుండాలంటే భారాసకు ఓటువేయాలని, ప్రజలు బాగుండాలంటే మాత్రం భాజపాకు ఓటు వేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని భోపాల్‌లో నిర్వహించిన 'మేరా బూత్.. సబ్‌సే మజ్‌బూత్ (Mera Booth Sabse Majboot)' కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని.. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కుటుంబ పార్టీలపై మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై విమర్శలు గుప్పించారు. అదే విధంగా.. ఇటీవలి విపక్షాల భేటీపై ధ్వజమెత్తారు.
'అవినీతిపై చర్యలు తీసుకోవడంతోపాటు 2024 ఎన్నికల్లో భాజపా గెలవనున్న నేపథ్యంలోనే ప్రతిపక్షాలన్నీ ఒకచోట చేరాయి. ఆ పార్టీలన్నీ అవినీతి, కుంభకోణాలకు హామీ ఇస్తాయి. నేను మాత్రం అవినీతిపరులను వదిలిపెట్టేదే లేదన్న హామీ ఇస్తున్నా' అని వ్యాఖ్యానించారు. భాజపాకు కార్యకర్తలే అతిపెద్ద బలమని మోదీ పేర్కొన్నారు. తాము ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలు జారీ చేయమని.. ప్రజలతో మమేకమయ్యేందుకు కఠిన వాతావరణ పరిస్థితులనూ ధైర్యంగా ఎదుర్కొంటామని తెలిపారు. పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తకు దేశ ప్రయోజనాలే ప్రధానం. పార్టీకన్నా దేశమే పెద్దది' అని ప్రధాని మోదీ అన్నారు..
Jun 27 2023, 17:42