తెలంగాణ సాధన కోసం పదవులను సైతం త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ: శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
హైదరాబాద్ : స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా, ఆదివారం రాష్ట్ర శాసన సభ సెంట్రల్ హాల్‌లో ఆయన జయంతి కార్యక్రమం నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ నేతగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తన పదవులను సైతం త్యాగం చేసిన గొప్ప నాయకుడు లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఆనాడే గళమెత్తి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన నాయకుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ అగ్రగణ్యులని పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీపడకుండా, తాను నమ్మిన సిద్ధాంతాలకు జీవితాంతం కట్టుబడి పనిచేశారని కొనియాడారు.
“పదవుల కంటే ప్రజల ఆకాంక్షలే ముఖ్యమని తన ఆచరణ ద్వారా నిరూపించిన మహనీయుడు లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, పోరాటాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి” అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
బడుగు, బలహీన వర్గాలు, చేనేత కార్మికుల సంక్షేమం కోసం బాపూజీ నిరంతరం కృషి చేశారని, సమాజంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు లభించాలన్నది ఆయన ఆకాంక్ష అని తెలిపారు.
“కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆయన చూపిన ప్రజాసేవ, త్యాగం, సామాజిక న్యాయం మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, విప్ అద్దంకి దయాకర్, శాసన సభ సెక్రెటరీ ఆర్. తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Sep 27 2026, 15:51
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.5k