సన్నాలపై మక్కువ..
జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో రైతులు ఎక్కువగా సన్న రకం వరి పంటనే సాగుచేశారు. ఈ సీజన్ నుంచి 32 సన్న రకాల వరిసాగు చేసే రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో మున్నెన్నడూ లేని విఽధంగా ఈ సీజన్‌లో సన్నాలను సాగు చేశారు.
జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో రైతులు ఎక్కువగా సన్న రకం వరి పంటనే సాగుచేశారు. ఈ సీజన్ నుంచి 32 సన్న రకాల వరిసాగు చేసే రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో మున్నెన్నడూ లేని విఽధంగా ఈ సీజన్‌లో సన్నాలను సాగు చేశారు. సన్నాలను కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వంపై అదనంగా 178 కోట్ల 92 లక్షల రూపాయల భారం పడనున్నది. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 2,09,562 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా, ఇందులో దొడ్డు రకం వరి 36,676 ఎకరాల్లో సాగు చేయగా, సన్న రకం 1,72,879 ఎకరాల్లో సాగు చేశారు. అంటే 78.79 శాతం సన్న రకం పంటను సాగు చేశారు. గతంలో సన్న రకం వరి ధాన్యం సాగు 35 శాతానికి మించలేదు. ఈసారి రికార్డు స్థాయిలో సన్నాలను రైతులు పండిస్తున్నారు. ఎక్కువగా బీపీటీ, సాంబమశూరి, జైశ్రీరాం, చిట్టి ముత్యాలు తదితర రకాల వరి ధాన్యాన్ని సాగు చేశారు.
జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన వరి సాగు వల్ల 4 లక్షల 49 వేల 554 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని, ఇందులో దొడ్డు రకం 91 వేల 700 టన్నులు, సన్న రకం 3 లక్షల 97 వేల 615 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. సన్న రకం ధాన్యం దిగుబడిలో 10 శాతం తిండి అవసరాలకు పోనూ 3 లక్షల 57 వేల 853 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం కేంద్రాలకు వస్తే మాత్రం క్వింటాలుకు 500 రూపాయల చొప్పున 178 కోట్ల 92 లక్షల రూపాయల బోనస్ భారం ప్రభుత్వంపై పడనున్నది. ఈ ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల ప్రకారం కామన్ రకం వరి ధాన్యం క్వింటాలుకు 2300 రూపాయలు కాగా, గ్రేడ్ ఏ రకం 2,320 రూపాయలు. అయితే సన్న రకం ధాన్యాన్ని కామన్ గ్రేడ్ కిందనే తీసుకుంటున్నారు.
దీంతో చాలా మంది రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకంటే ఎక్కువగా బహిరంగ మార్కెట్‌లోనే విక్రయించుకుంటున్నారు. ఈసారి సన్న రకం సాగు పెరగడంతో బహిరంగ మార్కెట్‌లో డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండనున్నది. ప్రభుత్వమే క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇవ్వనుండడంతో 2,800 రూపాయలు రానున్నాయి. ఎకరానికి 20 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే 10 వేల రూపాయలు రానున్నాయి. ఈ లెక్కలను అంచనా వేసే రైతులు జిల్లాలో అధికంగా సన్నరకం ధాన్యాన్ని పండిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు 2800 రూపాయలకు పైగా ధర పలికితినే వారికి విక్రయించేందుకు మొగ్గు చూపుతారు. లేదంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించనున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 1.47 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడులు రానున్నాయని, ఇందులో 80లక్షల టన్నుల ధాన్యం కేంద్రాలకు రానున్నదని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. రైతులకు బోనస్ ఇచ్చేందుకు 2,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తూ శుక్రవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
జనవరి నుంచే రేషన్ కార్డులపై సన్న బియ్యం..
రేషన్ షాపుల ద్వారా సన్న రకం బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం రైతులతో సన్న రకాలను ప్రోత్సహిస్తున్నది. వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన సన్న రకం పంటను క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేయనున్నది. ఆ ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లింగ్ చేసి నిల్వ చేయనున్నారు. వచ్చే జనవరి నుంచి రేషన్ కార్డులపై ఇచ్చే బియ్యాన్ని సన్నవి ఇవ్వనున్నారు. ఇప్పటివరకు దొడ్డు రకం బియ్యం ఇస్తున్నారు. ఈ బియ్యాన్ని తీసుకుంటున్న వినియోగదారులు వందకు 60 శాతం మంది ఆ బియ్యాన్ని బయట మార్కెట్‌లో విక్రయించుకుంటున్నారని గమనించిన ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తేనే వాటిని తిండి అవసరాలకు వినియోగించుకోనున్నారని, ప్రజలపై బియ్యం భారం పడకూడదని సన్న రకం వరి ధాన్యం సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.
Sep 22 2024, 14:47