పావులు కదిపిన మోదీ: చైనాకు చెక్?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. మూడు రోజుల పాటు సాగే పర్యటన ఇది. తొలి రోజున తీరిక లేని కార్యక్రమాల్లో గడిపారు. డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో ఏర్పాటైన క్వాడ్ సభ్య దేశాల అత్యున్నత స్థాయి సదస్సులో పాల్గొన్నారు. కొద్దిసేపటి కిందటే ఈ భేటీ ముగిసింది.
దీని తరువాత ఆయన న్యూయార్క్‌కు బయలుదేరి వెళ్లారు. లాంగ్ ఐలాండ్‌లో గల నుస్సౌ వెటరన్స్ మెమోరియల్ కొలీజియంలో ప్రవాస భారతీయులతో సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీనికోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అమెరికాలో నివసిస్తోన్న వందలాది మంది భారతీయులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
క్వాడ్‌లో ఆతిథ్య అమెరికాతో పాటు భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లకు సభ్యత్వం ఉంది. జో బైడెన్, మోదీతో పాటు ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానమంత్రులు ఆంథోని అల్బెనీస్, ఫ్యుమియో కిషిడ ఈ సమ్మిట్‌కు హాజరయ్యారు. సుమారు మూడు గంటల పాటు ఈ సమ్మిట్ కొనసాగింది. పలు అంశాలు ఇందులో చర్చకు వచ్చాయి.
సభ్య దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడం, ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్య భద్రత, విపత్తుల నిర్వహణ, సరిహద్దుల భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ అంశాలపై చర్చించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు, ఘర్షణలతో సతమతమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో క్వాడ్ సదస్సు ఏర్పాటు కావడం అత్యవసరమని ప్రధాని మోదీ అన్నారు. సభ్య దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పరస్పరం గౌరవించుకోవడం, వివాదాలను శాంతియుత వాతావరణంలో పరిష్కారించుకోవడానికి చర్చలే శరణ్యమని చెప్పారు.
స్వేచ్ఛా వాణిజ్యం, సమ్మిళిత, సుసంపన్నమైన ఇండో-పసిఫిక్ రీజియన్‌ను నెలకొల్పుకోవాలనేదే క్వాడ్ భాగస్వామ్య దేశాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మిగిలిన దేశాలకు క్వాడ్ ఓ దిక్సూచిగా మారుతుందని మోదీ వ్యాఖ్యానించారు. సమావేశం అనంతరం జో బైడెన్, మోదీ, ఆంటోనీ అల్బెనీస్, ఫ్యుమియో కిషిడ.. జాయింట్ స్టేట్‌మెంట్ విడుదల చేశారు.దక్షిణాసియా రీజియన్‌లో తరచూ సరిహద్దు జలాల్లోకి ప్రవేశిస్తూ ఉద్రిక్తతలకు కారణమౌతోన్న చైనాను అడ్డుకోవడానికి ప్రత్యేకంగా ఓ వ్యవస్థను తెర మీదికి తీసుకుని రావాలని నిర్ణయించారు. క్వాడ్ అట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్‌కు రూపకల్పన చేయాలని ప్రతిపాదించారు. యూఎస్ కోస్ట్ గార్డ్, భారత్ కోస్ట్ గార్డ్, జపాన్ కోస్ట్ గార్డ్, ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్‌కు ఇందులో భాగస్వామ్యాన్ని కల్పిస్తారు.
తీర ప్రాంతాల సరిహద్దు జలాల భద్రత కోసం ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు కావడం అనేది ఇదే తొలిసారి.ఇంటర్ ఆపరేబిలిటీని మెరుగుపరచడం, సముద్ర జలాల భద్రతను మరింత పటిష్ట పర్చడం, ఇండో-పసిఫిక్ రీజియన్ పరిధిలో మున్ముందు మరిన్ని జాయింట్ ఆపరేషన్/మిషన్‌లను చేపట్టాలని నిర్ణయించారు.
Sep 22 2024, 10:40