ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరం కాకూడదు , దాతల సహకారం ను సద్వినియోగం చేసుకోవాలి : కొడారి వెంకటేష్ సామాజిక కార్యకర్త
గ్రామీణ విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరం కాకూడదనే సంకల్పంతో బస్వాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కీ! శే! బెజ్జంకి వెంకట నర్సింహ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన వారసులు అందించే మెరిట్ స్కాలర్ షిప్ లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ కోరారు. గురువారం భువనగిరి మండలం బస్వాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెరిట్ విద్యార్థులకు, గ్రామ మాజీ సర్పంచ్ బెజ్జంకి వెంకట నర్సింహ రెడ్డి వారసులు బెజ్జంకి నరోత్తంరెడ్డి, బెజ్జంకి మాణిక్ రెడ్డి, సామ సుష్మా, కోమటిరెడ్డి స్వప్న లు అందించిన యాబది వేల రూపాయల నగదును నల్గురు విద్యార్థులకు (ఒక్కొరికి పన్నెండు వేల ఐదు వందలు) అందజేశారు. ఈ సందర్బంగా కొడారి వెంకటేష్ మాట్లాడుతూ పుట్టిన ఊరును, చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం మెరిట్ స్కాలర్ షిప్ లు అందించి, విద్యార్థులను ప్రోత్సహించే దాతలకు ఆయన అభినందనలు తెలిపారు. విద్యార్థులు దాతల సహకారంను సద్వినియోగం చేసుకుని, ప్రయోజకులు కావాలని ఆయన కోరారు. అనంతరం దాతలను పాఠశాల ఉపాధ్యాయుల ఆద్వర్యంలో సన్మానం చేశారు. పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ డి. కృష్ణవేణి అద్యక్షతన జరిగిన సమావేశంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ కొండ మడుగు బాలమణి, మెరిట్ స్కాలర్ షిప్ దాతలు సామ సుష్మా, కోమటిరెడ్డి స్వప్న, కుమారి రుచిక, గ్రామానికి చెందిన వికలాంగుల హక్కుల నాయకులు మచ్చ ఉపేందర్, మెరిట్ స్కాలర్ షిప్ లు పొందిన విద్యార్థులు చందన, వైశాలి, శ్రవంతి, అభిలాష్, బస్వాపూర్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Jul 19 2024, 20:14