జీవించినంత కాలం ఏ రంగంలో పనిచేసిన అంకిత భావంతో పని చేసి సమాజాభివృద్ధికి దోహదపడాలి
జీవించినంత కాలం ఏ రంగంలో పనిచేసిన అంకిత భావంతో పని చేసి సమాజాభివృద్ధికి దోహదపడాలి
సహృదయ ఆచార్యులు -బన్న అయిలయ్య.
డాక్టర్ అంపశయ్య నవీన్.
హన్మకొండ:[Crime journalist] :-
ఆంధ్ర దేశంలో ఎంతో మంది పరిశోధక విద్యార్థులకు దిశా నిర్దేశనం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించి వారిలో నూతన ఉత్సాహాన్నిచ్చే సహృదయ ఆచార్యులు బన్న అయిలయ్య అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు. శుక్రవారం యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న అయిలయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్ట్స్ కళాశాల తెలుగు శాఖాధిపతి గౌడ్ డాక్టర్ చిర్ర రాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొని బన్న అయిలయ్య చిత్ర పటాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన కవిత్వంలో మట్టిముద్దను నేను అని చెప్పుకున్నా అయిలయ్య నేడు వజ్రపు తునుక అని పేర్కొన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం, గురువుల పట్ల విధేయత, విద్యార్థుల పట్ల ప్రేమ వాత్సల్యం కనబరిచి తనను తాను ఉన్నతీకరించుకోని ఉన్నతస్థాయికి చేరుకోవడం గొప్ప విషయమన్నారు. అనేక కష్టాల కడలి నుండి కష్టపడి ఎదిగి వచ్చిన ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రస్తుత కాలంలో పరిపాలన పదవులు ముళ్ళకీరిటం లాంటిది అలాంటి పరిస్థితుల్లో దాదాపు ఏడు సంవత్సరాలు అప్రతిహతంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా కొనసాగడం వృత్తి పట్ల ఆయన అంకిత భావానికి నిదర్శనం అని తెలిపారు. తర్వాత కేక్ కట్ చేసి, ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆచార్య బన్న అయిలయ్య మాట్లాడుతూ..మనిషి పుట్టుక ఎవరికి తెలియదు..కానీ జీవించిన కాలం ఏ రంగంలో పని చేసిన అంకిత భావంతో పని చేసి సమాజ అభివృద్ధికి దోహదపడాలని తెలియచేస్తూ..జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ హనుమంత్, డాక్టర్ మామిడి లింగయ్య, డాక్టర్ చింతం ప్రవీణ్, డాక్టర్ ఫిరోజ్, డాక్టర్ కనకయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Feb 02 2024, 22:31