రతన్ టాటా మృతి పట్ల పవన్, లోకేష్ సహా ప్రముఖుల నివాళులు..
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా పలువురు మంత్రులు సంతాపం ప్రకటించారు. రతన్ టాటా మరణం భారతదేశానికి తీరని లోటని.. భారత పారిశ్రామిక రంగానికే కాదు.. ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా ఆదర్శంగా నిలిచారన్నారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా (Ratan Tata) మరణం (Death) పట్ల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సహా పలువురు మంత్రులు సంతాపం తెలిపారు. పవన్ మాట్లాడుతూ.. ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గ్రూప్ చైర్మన్, పద్మ విభూషణ్ రతన్ టాటా మరణం భారతదేశానికి తీరని లోటని.. భారత పారిశ్రామిక రంగానికే కాదు.. ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన నేతృత్వంలో ఉప్పు నుండి మొదలుకొని, విమానయాన రంగంలో వరకు భారత దేశపు అణువణువులో టాటా అనే పేరు ప్రతిధ్వనించేలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని కొనియాడారు. ఆయన హయాంలో టాటా అంటే భారతదేశపు ఉనికిగా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టారని, కేవలం పారిశ్రామిక వేత్తగా కాకుండా గొప్ప మానవతావాదిగా ఆయన సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయమని అన్నారు. ఈ బాధాకరమైన సమయంలో తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, టాటా గ్రూప్ సంస్థల కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రతన్ టాటా అనే పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని, ప్రతీ తరానికి ఆదర్శప్రాయంగా నిలచిన మహోన్నత వ్యక్తికి అంతిమ వీడ్కోలు తెలియజేస్తున్నానని పవన్ పేర్కొన్నారు.
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. విలువలు, మానవత్వంతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన మహా దార్శనికుడు రతన్ టాటా అని, దేశాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా టాటా గ్రూప్ సంస్థలను దశాబ్దాలుగా అదే నిబద్ధతతో నిర్వహించిన పద్మవిభూషణ్ రతన్ టాటా సేవలు చిరస్మరణీయమని అన్నారు. టాటా గ్రూప్ ఉత్పాదనలు వాడని భారతీయులు ఉండరని, మన దేశంలో ఏ మూల ఏ విపత్తు సంభవించినా భారీ విరాళంతో స్పందించే మానవత్వపు హృదయం రతన్ టాటాదని, నిజాయితీని, నిస్వార్ధపరత్వాన్ని టాటా బ్రాండ్‌గా చేసిన రతన్ టాటాకు మరణం లేదని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా జీవించే ఉంటారని అన్నారు. నమ్మకమైన టాటా ఉత్పత్తుల రూపంలో ప్రతి ఇంట్లోనూ మనందరినీ ప్రతిరోజూ చిరునవ్వుతో పలకరిస్తూనే ఉంటారని.. రతన్ టాటా నిరుపమానమైన సేవలను స్మరిస్తూ, అశ్రు నివాళులు అర్పిస్తున్నానని మంత్రి లోకేష్ అన్నారు.
మంత్రి సవిత మాట్లాడుతూ.. దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మృతిపై మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు రతన్ టాటా వెన్నుముక అని కొనియాడారు. లాభాపేక్ష లేకుండా ఎన్నో పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగ విప్లవం సృష్టించిన పారిశ్రామిక వేత్త అని, దేశం కోసం... ప్రజల కోసం... పనిచేసిన పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అని.. సేవా కార్యక్రమాల్లోనూ రతన్ సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని, రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటని మంత్రి సవిత వ్యాఖ్యానించారు.
స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని.. రతన్ టాటా మృతి యావత్ దేశానికి తీరని లోటని అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, మానవతావాదని, పద్మవిభూషణ్ సహా అనేక గౌరవ పురస్కారాలు అందుకున్న రతన్ టాటా ఇక మన మధ్య లేకపోవడం బాధకరమన్నారు. నేడు దేశం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని.. ఎన్నో పరిశ్రమలు నెలకొని ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారని ఈ సందర్భంగా రతన్ టాటా చేసిన సేవలను అయ్యన్న పాత్రుడు గుర్తు చేసుకున్నారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రతన్ టాటా మరణం పారిశ్రామిక రంగానికి, ఈ దేశానికి తీరని లోటని, ఆయన గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉందని, ఈ దేశం గొప్ప మానవతావాది కోల్పోయిందని అన్నారు. విలువలకు నిలువుటద్దం రతన్ టాటా అని ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన నైజమని అన్నారు. పుట్టుకతో కోటీశ్వరుడైనా, అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగినా, సామాన్య జీవనం సాగించిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా అని కొనియాడారు. ఆయనను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. రతన్ టాటా మృతి పట్ల మంత్రి అనగాని సంతాపం వ్యక్తం చేశారు. దేశ నిర్మాణంలో రతన్ టాటాది కీలక పాత్రని, నిజమైన మానవతావాది రతన్ టాటా అని వ్యాఖ్యానించారు. రతన్ టాటా మరణం దేశ పారిశ్రామిక రంగానికి తీరని లోటని మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు.
తనదైన ముద్ర వేసిన పారిశ్రామిక వేత్త, చైర్మన్ ఎమెరిటస్ ఆఫ్ టాటా సన్స్.. రతన్ నావల్ టాటా (86) ఇక లేరు. వంటగదిలో వాడే ఉప్పు నుంచి.. ఆకాశంలో ఎగిరే విమానాల దాకా.. ఎన్నెన్నో ఉత్పత్తులు, సేవలతో భారతీయుల నిత్యజీవితంలో భాగమైన టాటా సామ్రాజ్యాన్ని రెండు దశాబ్దాలపాటు నడిపించిన ఆ పారిశ్రామిక దిగ్గజం.. మరలిరాని లోకాలకు తరలిపోయారు! రక్తపోటు స్థాయులు అకస్మాత్తుగా పడిపోవడంతో మూడు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేరిన రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమించి.. బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు.
Dec 06 2024, 18:45