NLG: చిట్యాలలో అండర్ పాసింగ్ బ్రిడ్జి నిర్మించాలని బిఎస్పి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
చిట్యాల: పట్టణ కేంద్రంలో ప్రతిరోజు జరుగుతున్న ప్రమాదాల దృష్ట్యా జాతీయ రహదారిపై అండర్ పాసింగ్ బ్రిడ్జి నిర్మాణం పనులను వెంటనే చేపట్టాలని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలో బీఎస్పీ ఆధ్వర్యంలో దుకాణదారుల వద్ద నుండి సంతకాలు సేకరించారు. దుకాణదారులు సంఘీభావంగా సంతకాలు చేశారు. అనంతరం మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. చిట్యాల పట్టణ కేంద్రంలో ట్రాఫిక్ ఎక్కువ కావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడి, తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూ ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ కేంద్రంలో అండర్ పాసింగ్ బ్రిడ్జి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడం స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. ఈ హైవే మీదుగా ప్రతి రోజు లక్షల వాహనాలు తిరుగుతూ ఉంటాయి. చిట్యాల గుండా భువనగిరి మీదుగా గజ్వేల్  ప్రజ్ఞాపూర్ వైపు భారీ వాహనాలు పోవడం వల్ల, భారీగా ట్రాఫిక్ జామై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు స్పీడ్ గా రావడం వల్ల రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. ఇకనైనా పాలకులు స్పందించి వెంటనే ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేసి అండర్ పాసింగ్ బ్రిడ్జి ను నిర్మించాలని ప్రియదర్శిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, కేతేపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, మండల సలహాదారులు జిట్టా నర్సింహా రాజు, చుక్క నర్సింహా, మహేష్, యోగి, సంతోష్, బిఎస్పి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట: బిఎస్పి మండల మహిళా కమిటీ ఎన్నిక
యాదాద్రి జిల్లా, రామన్నపేట: మండల బిఎస్పి పార్టీ మహిళా కమిటీని గురువారం ఎన్నుకున్నారు. కో కన్వీనర్ గా ఎన్నారం గ్రామానికి చెందిన గూడపురి సంతోష ముదిరాజ్ ని, మండల మహిళా కార్యదర్శి గా మునిపంపుల గ్రామానికి చెందిన బందెల అనిత ను నకిరేకల్ బిఎస్పీ మహిళ కన్వీనర్ మర్రి శోభ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ.. రామన్నపేట మండలంలో మహిళలు ఎంతో వెనుకబడి ఉన్నారని, వారికోసం కష్టపడి పని చేస్తామని వారు అన్నారు. మహిళలకు గుర్తింపు తెచ్చే విదంగా బిఎస్పీ పార్టీ కీలకమైన పోస్టులు ఇస్తున్నారని అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీలో  మండలంలో పనిచేయడం మాకెంతో ఆనందంగా ఉందని, పార్టీ అధినేత మాయావతి ని స్ఫూర్తిగా తీసుకొని మహిళలు ఎంతో చైతన్యం అవుతున్నారు అని అన్నారు. మహిళలను గుర్తించి కీలకమైన స్థానం కల్పించడంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కే ఆ విలువలు దక్కుతాయని అన్నారు. తమ ఎంపికకు సహకరించిన  నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, మండల అధ్యక్షులు మేడి సంతోష్, మండల మహిళా కన్వీనర్ కక్కిరేణి శిరీష లకు తమ కృతఙ్ఞతలు అని తెలిపారు.
అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపిన పలు సంఘాలు

నల్లగొండ జిల్లా, చింతపల్లి: తమ న్యాయమైన డిమాండ్ల కోసం చట్టబద్ధంగా నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని ఎఐటియుసి జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య హెచ్చరించారు.

గురువారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో, నిరవధిక సమ్మె నాలుగవ రోజులో భాగంగా చింతపల్లి ప్రాజెక్టు ఐసిడిఎస్ ఆఫీసు ముందు ముట్టడి  జరిగింది. ప్రాజెక్టు ఆఫీస్ నుండి  తాహసిల్దార్ కార్యాలయం వరకు  ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమ్మె శిబిరానికి హాజరై వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతూ, అంగన్వాడి సెంటర్ల తాళాలు పగలగొట్టించడం దిక్కుమాలిన చర్య అని ఆరోపించారు. పోరాడే సంఘాలను చర్చలకు పిలవకుండా భజన సంఘాలను పిలవడం అప్రజా స్వామికమని ఏద్దేవా చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగుల పర్మినెంట్, కనీస వేతనం తదితర డిమాండ్స్ పరిష్కరించాలని  సీఐటీయూ ఎఐటియుసి సంఘాల జేఏసీ అధ్వర్యంలో ఈనెల సెప్టెంబర్ 11 నుండి రాష్ట్రం లో నిరవధిక సమ్మె చేస్తున్నామన్నారు. పోరాడే సంఘాలను చర్చలకు పిలవక పోవటం అప్రజాస్వామికం. మళ్ళీ పాత పద్ధతి లోనే అంగన్వాడీ ఉద్యోగులను మోసం చేస్తూ ఐసిడిఎస్ మంత్రి హామీలు ఉన్నాయని చెప్పారు. మంత్రి హామీలు సమస్యలను పరిస్కారం చేయక పోగా మరింత అసంతృప్తిని పెంచిందని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సెప్టెంబర్ 12న మంత్రి సత్యవతి రాథోడ్  అత్యంత దుర్మార్గమైన పద్దతిని అనుసరించి పోరాటంలో లేని సంఘాలతో చర్చలు జరిపారని తెలిపారు. అతి ముఖ్యమైన డిమాండ్స్ ఐన.. పర్మినెంట్, కనిసవేతనం, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ పెంపు తదితర ముఖ్యమైన డిమాండ్స్ ను ఏవి కూడా ప్రస్తావించలేదని అన్నారు. బతికి ఉన్నప్పుడు కావాల్సిన సౌకర్యాలను కల్పించకుండా, ఆ డిమాండ్స్ ను పక్కన పెట్టి కేవలం చనిపోయిన తర్వాత దాహన సంస్కారాలు నిర్వహించడానికి టీచర్లకు 20 వేలు, ఆయాలకు 10 వేలు ప్రభుత్వం నిర్ణయం చేయడం దుర్మార్గం అని అన్నారు. ఇందులో కూడా టీచర్లకు, ఆయాలకు అమౌంట్ లో వ్యత్యాసం చూపించటం సరైంది కాదు. ఇద్దరికి సమానంగా నిర్ణయం చేయాలని హితవు పలికారు.

ఇన్సూరెన్స్ 2 లక్షలు అన్నారు కానీ జీఓ రాలేదు. మినీ వర్కర్ల సర్కులర్లో మినీలను మెయిన్ టీచర్స్ గా నియామకం, హెల్పర్ల నియామకం పైన స్పష్టత లేదు. షరతులు అనే అంశం మినీ టీచర్స్ కు ప్రమాదకరంగా ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మళ్లీ పాతదే ప్రకటించారు.మొత్తానికి మంత్రి చర్చలు అప్రజాస్వామికంగా జరిగాయని ఆరోపించారు. మళ్లీ అంగన్వాడి ఉద్యోగుల్ని మోసం చేసే విధంగా హామీలు ఇచ్చారన్నారు. ఈ మోసపూరిత విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి  జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, మద్దతు తెలుపుతూ తన ఆటపాటలతో చైతన్య గీతాలు ఆలపించాడు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఎఐటియుసి) జిల్లా అధ్యక్షురాలు వసంతి, శాంత కుమారి, ఇందిరా, ఉమా, యాదమ్మ, అలివేలు, రేణుక, సరిత, తదితరులు పాల్గొన్నారు.

నార్కట్ పల్లి: అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలి: మేడి ప్రియదర్శిని

నల్లగొండ జిల్లా,

నార్కట్ పల్లి: తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఉద్యోగులు చేపట్టిన ధర్నా లో గురువారం, బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని పాల్గొని మద్దతు తెలిపారు. 

ఈ సందర్భంగా మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ.. 40 ఏండ్ల నుంచి సేవలందిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులను ఎందుకు పర్మినెంట్‌ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

అంగన్వాడీ ఉద్యోగులు గ్రామాల్లో బాలింతలకు, పిల్లలకు పౌష్టికారాన్ని అందిస్తున్నారని, ప్రభుత్వ సర్వేలు చేపడుతున్నారన్నారు. ఇప్పటికీ అంగన్వాడీ టీచర్‌ రూ.13,843, ఆయాలకు రూ.7,800 వేతనాలు ఇస్తున్నారని, వాటితో వారి కుటుంబం ఎలా గడుస్తుందని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి రూ.26,000/- కనీస వేతనమివ్వాలన్నారు.

నిత్య సరుకులు ధరలు విపరీతంగా పెరిగాయి, ఇంటి అద్దెలు, గ్యాస్‌ ధరలు, కూరగాయల ధరలు పెరిగాయి. దీంతో ప్రస్తుతం వస్తున్న జీతం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారిని పర్మినెంట్‌ చేయాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలు కల్పించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఒకవేళ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు చెరుకుపల్లి శాంతి కుమార్, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, కేతేపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, కృష్ణ, మహేష్, సంతోష్, ఉదయ్, యోగి, బిఎస్పి నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడి  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించాలి: బీఎస్పీ ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నరసింహ
రామన్నపేట: మండలంలో ఉన్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించాలని రామన్నపేట బీఎస్పీ ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నరసింహ అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయం లో నర్సింహ మాట్లాడుతూ.. ఎంతోకాలంగా జర్నలిజం వృత్తిగా భావించి విలేకరులుగా పనిచేస్తున్నారు, తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిది, ఈ వృత్తి మీదనే ఇష్టంతో ఎంతోమంది సామాజిక సేవలో భాగంగా ఎలాంటి వేతనాలు లేకుండా, ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా జర్నలిస్ట్ లు నిరంతరం పనిచేస్తూ ఉన్నారని అన్నారు.
NLG: ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ.. ఈనెల 16న...
నల్గొండ: వినాయక చవితి సందర్భంగా ప్రకృతి సిద్ధమైన పర్యావరణ అనుకూల, సహజ సిద్ధమైన రంగులను ఉపయోగించి తయారు చేసిన మట్టి గణపతి విగ్రహాలని పూజిద్దాం అని జిల్లా కలెక్టర్ కర్ణన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వారు రూపొందించిన పోస్టర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ నెల పదహారవ తారీఖు శనివారం పట్టణం లోని గడియారం సెంటర్ లో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో 2000 మట్టి గణపతి విగ్రహాలని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, పర్యావరణ ఇంజినీర్, ఎంఆర్ఓ  తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి సబ్ - జూనియర్ ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన నల్లగొండ విద్యార్థినిలు
నల్లగొండ: ఈనెల 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం లో జరిగే జాతీయస్థాయి సబ్ జూనియర్ బాలికల ఫుట్బాల్ పోటీలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా తరపున నాగశ్రీ, అమూల్య, పవిత్ర లు ఎంపికయ్యారని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన నాగశ్రీ, అమూల్య, పవిత్ర లను అసోసియేషన్ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, అధ్యక్షులు బండారు ప్రసాద్, మరియు అసోసియేషన్ సభ్యులందరూ ప్రత్యేకంగా అభినందించారు. ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి ఫుట్బాల్ ప్రాబబుల్స్ కు 40 మందిని సెలెక్ట్ చేయగా వారిలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి  8 మంది సెలెక్ట్ కావడం జరిగిందని, శిక్షణ క్యాంపు గత 12 రోజుల నుండి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహిస్తున్నారని, శిక్షణ శిబిరంలో అత్యుత్తమ ఆటను ప్రదర్శించిన ఈ ముగ్గురు క్రీడాకారినులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా క్రీడాకారులలో ఉన్న సహజ నైపుణ్యాన్ని గుర్తించి, జాతీయస్థాయిలో అవకాశాలు కల్పిస్తున్న తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ వారికి మరియు TFA ప్రధాన కార్యదర్శి జీపి  ఫల్గుణకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.
సెప్టెంబర్ 20న కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి వేలాదిగా తరలి రండి: సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపు
చింతపల్లి: ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ ఉద్యోగులు అండ్ హెల్పర్స్ మూడోరోజు సమ్మె చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 70 వేలమంది శాంతియుతంగా సమ్మె చేస్తున్న వారిపట్ల ఉన్నత అధికారులు, ఐసిడిఎస్ అధికారులు భయపెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, తీవ్రంగా ఖండిస్తూ అంగన్వాడీ లపై నిర్బంధం ఆపాలని నిరసిస్తూ, సెప్టెంబర్ 20న జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ పెద్ద ఎత్తున కదిలి రావాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లాలో తొమ్మిది ప్రాజెక్టులలో శాంతియుతంగా జరుగుతున్న సమ్మె పట్ల అధికారుల నిర్బంధం వ్యతిరేకిస్తూ, సెప్టెంబర్ 14న సిడిపిఓ ఆఫీస్ ముట్టడి, 16వ తేదీన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుల ముట్టడి, ఈనెల 20న జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి. దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నామని అన్నారు. రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్  కొన్నిటిని ప్రకటించడం అభ్యంతరాలు ఉన్నాయని వారు అన్నారు.  ఈ సమ్మె సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగుల మధ్య చీలికలను తీసుకువచ్చి కొందరు అనుకూలంగా ఉన్న వారితో మాట్లాడుకోవడం సరైనది కాదని వారు అన్నారు.  సమ్మె చేస్తున్న సంఘాలను చర్చ కి పిలిచి మాట్లాడాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, నల్ల వెంకటయ్య, అంగన్వాడి ఉద్యోగ సంఘాల నాయకులు కే.రజిత, ఆర్.శోభ, శోభారాణి, ఏ. శాంతకుమారి, విజయలక్ష్మి, కలమ్మ, జయశ్రీ, అనంతలక్ష్మి, లక్ష్మి, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.
NLG: ఎన్జీ కళాశాల స్టాప్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ అధ్యాపకులకు సన్మానం
నల్లగొండ పట్టణంలోని, నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో,   ఇటీవల రాష్ట్రస్థాయిలో ఉత్తమ అధ్యాపకులుగా అవార్డులను స్వీకరించిన కళాశాల అధ్యాపకులను,  ఎన్జీ కళాశాల స్టాప్ క్లబ్ ఆధ్వర్యంలో  బుధ వారం ఘనంగా సన్మానించారు. ఉత్తమ అధ్యాపకులుగా అవార్డులు పొందిన డాక్టర్ అంతటి శ్రీనివాస్, డాక్టర్ ఎన్ దీపిక లను స్టాప్ క్లబ్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గన్ శ్యామ్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా వారు చేసిన విశిష్ట సేవలకు గాను సరియైన గుర్తింపు పొందారని ప్రిన్సిపాల్ అన్నారు. సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ.. తాము బోధనతోపాటు,  పరిశోధనలు మరియు పుస్తకాల ప్రచురణ, సామాజిక సేవా కార్యక్రమాలు కు చేసిన కృషికి రాష్ట్ర ప్రభుత్వం తమను రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులుగా గుర్తించి అవార్డులు ఇచ్చినందుకుగాను చాలా సంతృప్తిగా ఉందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మునీర్, వెంపటి శ్రీనివాస్, ఐ కే సి కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్న కుమార్, స్టాప్ క్లబ్ సెక్రెటరీ ఆర్. చంద్రశేఖర్, అధ్యాపకులు డాక్టర్ కృష్ణ కౌండిన్య, నాగిరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, నాగుల వేణు, డాక్టర్ శీలం యాదగిరి, గ్రంథ పాలకులు డాక్టర్ ఏ. దుర్గాప్రసాద్, ఈ.యాదగిరి రెడ్డి, నాగరాజు, వి.వి. సుబ్బారావు, వెంకటేశ్వర్లు, లవెందేర్ రెడ్డి, వెల్దండి శ్రీధర్, ముత్తయ్య, బాలస్వామి, శ్రీనివాస్ రెడ్డి , యాదగిరి రావు,  శివరాణి,  చంద్రయ్య, సైదులు, సూదిని వెంకట్ రెడ్డి. మనెమ్మ తదితరులు పాల్గొన్నారు.
రామ మందిర నిర్మాణం వద్ద త్రవ్వకాలలో.. పురాతన ఆలయ అవశేషాలు లభ్యం
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర నిర్మాణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రామ మందిర నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మందిరం నిర్మించేందుకు తవ్వకాలు చేపట్టగా రామ మందిరం పురాతన ఆలయ అవశేషాలు కనుగొనబడ్డాయని, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, దీనికి సంబంధించిన చిత్రాన్ని
సోషల్ మీడియా సైట్ ఎక్స్‌ లో అందుకు సంబంధించిన ఫోటోను పంచుకున్నారు. అందులో స్తంభాలు, విగ్రహాలు, రాళ్లు, శాసనాలు కనిపిస్తాయి. శ్రీరామ జన్మభూమి తవ్వకంలో పురాతన ఆలయ అవశేషాలు లభించాయని తెలిపారు. ఇందులో అనేక విగ్రహాలు మరియు స్తంభాలు ఉన్నాయి. ఈ అవశేషాలను భక్తుల దర్శనార్థం ఆలయ ప్రాంగణంలో ఉంచారు. శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తికానున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన సమాచారం ప్రకారం ఆలయ మొదటి అంతస్తు నిర్మాణ పనులు పూర్తయ్యాయి.

అదే సమయంలో, రెండవ అంతస్తును పూర్తి చేయడానికి పనులు జరుగుతున్నాయి. దీంతో పాటు ఆలయ గోడ, రాళ్లు, స్తంభాలపై చెక్కే పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అయోధ్యలో కొనసాగుతున్న రామ మందిర పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ అన్నారు. ఇటీవల ఆయన ప్రధాని మోదీని కలిసి ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. జనవరి 21 - 23, 2024 మధ్య తేదీలో ఆలయాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.