కారు లీడర్ల కొట్లాట

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ పార్టీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో సిటింగ్‌లకు, ఆశావహుల మధ్య కొట్లాటలు చోటుచేసుకుంటున్నాయి. పలుచోట్ల ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సిటింగ్‌ ఎమ్మెల్యేలు, వారి ప్రత్యర్థి వర్గాలు సోషల్‌ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుష్ప్రచారం చేసుకుంటూ వ్యక్తిగత పరువుతో పాటు.. పార్టీ పరువును కూడా తీస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో నేతలు పరస్పరం పోలీస్‌ స్టేషన్లలో కేసులు పెట్టుకున్న ఉదంతాలున్నాయి. అధిక శాతం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ఇవే బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టి ముంచుతాయేమోనని క్షేత్రస్థాయి నాయకులు భయపడుతున్నారు.

పార్టీ అధినేత కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, కవిత, జోగినపల్లి సంతోష్‌ అండదండలు ఉన్నాయని, టికెట్‌ హామీ లభించిందని ప్రచారం చేసుకుంటూ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కొందరు నేతలు సొంతంగా కార్యకలాపాలు చేపడుతున్నట్లు తెలిసింది. ఎన్నికల వేళ ఈ బాపతు నేతలు తలనొప్పిగా మారారని సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు అభిప్రాయపడ్డారు.

నేతల మధ్య విభేదాలు క్షేత్రస్థాయి కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నాయి. ఎవరికి వారు ముఠా కట్టి సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటుండంతో... ఎవరిదగ్గరికి వెళ్తే ఏమవుతుందో అన్న భయంతో కొందరు మొత్తం పార్టీ కార్యకలాపాలకే దూరంగా ఉంటున్నారు. దాంతో మెజారిటీ కార్యకర్తల్లో స్తబ్ధత నెలకొంది. నేతల గ్రూపు తగాదాలు ఎన్నికల నాటికి తారస్థాయికి చేరతాయని అంచనా వేస్తున్నారు. అధిష్ఠానం జోక్యం చేసుకోకుంటే ఎన్నికల నాటికి పార్టీలో ఇదే అతిపెద్ద సమస్యగా మారుతుందని అనుమానిస్తున్నారు.

ఉమ్మడి మెదక్‌, ఖమ్మం జిల్లాల్లో

కేసీఆర్‌ సొంత గడ్డ ఉమ్మడి మెదక్‌ జిల్లాల్లో మెజారిటీ నియోజకవర్గాల్లో కుమ్ములాటలున్నాయి. పటాన్‌చెరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే జి.మహిపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా చిట్కుల్‌ సర్పంచినీలం మధు కార్యక్రమాలు చేస్తున్నారు. తనకే టికెట్‌ వస్తుందని, పెద్దల ఆశీస్సులున్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జహీరాబాద్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కే.మాణిక్‌రావును అక్కడి నాయకులు కొందరు వ్యతిరేకిస్తున్నారు. టీఎ్‌సఎంఎ్‌సఐడీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ టికెట్‌ ఆశిస్తూ నియోజకవర్గంలోకి వస్తున్నారని, దాంతో గ్రూప్‌ రాజకీయాలు వేడెక్కుతున్నాయని మాణిక్‌రావు వర్గం ఆరోపిస్తోంది. మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డిని వ్యతిరేకించే వాళ్లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు డాక్టర్‌ రోహిత్‌ను రంగంలోకి దించారు. రోహిత్‌ నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

అటు పద్మ, ఇటు రోహిత్‌ వర్గాలు సోషల్‌ మీడియా వేదికగా పార్టీ పరువు తీసే స్థాయిలో పరస్పరం పోస్టులు పెట్టడమే కాకుండా దీనిపై పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డి కూడా మెదక్‌ నుంచే టికెట్‌ ఆశిస్తున్నారు. తన వర్గాన్ని సిద్ధం చేసుకున్నారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతాలక్ష్మారెడ్డిల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. వయోభారంతో బాధ పడుతున్న మదన్‌రెడ్డిని తప్పించే ఆలోచనలో బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఉందని ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లా పాలేరులో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. తుమ్మల గ్యాప్‌ లేకుండా క్యాడర్‌ను కలిసేందుకు రోజూ ఏదో ఒక కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. కొత్తగూడెంలో వర్గ పోరు తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సీటు తనదేనని ధీమాగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రంగంలోకి దిగారు. మరోవైపు ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ గడల శ్రీనివాస్‌ మాత్రం సీఎం ఆశీస్సులు తనకే ఉన్నాయని చెబుతూ ట్రస్ట్‌ పేరుతో సేవా కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. సీఎం ఆదేశిస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తానంటూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రత్యేక బహుమతి అందజేసిన మంత్రి సత్యవతి రాథోడ్

ఈ రోజు దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో నిర్వహించే కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌కు రాష్ట్ర పతి హాజరుకానున్న నేపథ్యంలో

మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం ఉదయం రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మినిస్ట్రీ ఇన్ వేటింగా హాజరయ్యారు.  

ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంత్రి సత్యవతి రాథోడ్ పట్టు చీరను గిఫ్ట్ గా అందజేశారు. బహుమతిని అందుకున్న ద్రౌపది ముర్ము సంతోషాన్ని వ్యక్తం చేశారు....

SB NEWS

పని ఇద్దరిది-పని భారం పది మందిది

రాష్ట్ర ప్రభుత్వం బిసి లకు లక్ష రూపాయల లోన్ అనగానే జాతరను తలపిస్తుంది గద్వాల తహసీల్దార్ కార్యాలయం.20-50 వేల మంది జనాభ వున్న మండలానికి ఇద్దరు అధికారులు.లక్ష-రెండు లక్షలు జనాభ వున్నా మండలానికి ఇద్దరు అధికారులు.గద్వాల తహసీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్నది ఇద్దరు రెవెన్యూ అధికారులే.

కానీ పని భారం మాత్రం పది మంది రెవెన్యూ అధికారులది.జిల్లా కేంద్రంలో ప్రోటోకాల్ వాళ్ళే చూడాలి, అధికారుల మంచి-చెడులు వాళ్ళే చూడాలి,ప్రెస్, పోలీస్, పొలిటికల్ వాళ్ళు ఎవరైనా కార్యాలయంకు వస్తే పరిష్కారం వాళ్ళే చెప్పాలి,భూ సమస్యలు వాళ్ళే చూడాలి, సర్టిఫికెట్స్ వాళ్ళే చూడాలి... ఇలా ఒక్కటా రెండా? చెబుతూ పోతే వాళ్ళ సమస్యలు ఒక లక్ష.ఇందులో ఏ ఒక్కరిని ఆగండి చేస్తాం, చూస్తాం అనడానికి రాదు.

అలా ఒకవేళ చెప్పారనుకోండి అప్పుడు పైనుండి రెకమెండేషన్ మళ్ళీ..... ఆముదానికి కొత్తిమీర బిర్యానీ అడిగింది అన్నట్టుగా వుంది ఈ ఇద్దరి ఉద్యోగం అని అనుకుంటున్నారు సామాన్య ప్రజనీకం సైతం.60-70 ఏళ్ళ వయసులో రావాల్సిన రోగాలు 35-45 ఏళ్ళ వయసులో వస్తున్నాయంటే ఇలాంటి పనిభారం వున్నప్పుడు రాక తప్పదు అంటున్నారు వైద్యులు.37 వార్డులున్న ఇంత పెద్ద గద్వాల పట్టణం,సుమారు 25 కి పైగా వున్న గ్రామపంచాయతీ లు వున్న గద్వాల మండలానికి ఒకే కార్యాలయం ఉండటమే పని భారానికి కారణం అంటున్నారు.

మండలానికి సపరేట్ తహసీల్దార్ కార్యాలయం, పట్టణానికి సపరేట్ తహసీల్దార్ కార్యాలయం ఉంటేనే అధికారులు అందరూ అందుబాటులో ఉంటారు.పని త్వరగా పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుంది.జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆ దిశగా అడుగులు వేసి కార్యాలయాలను మెరుగు పరిస్తే బాగుండు అని ప్రజలు అనుకుంటున్నారు.

నందిగామలో సంచలనం సృష్టించిన జంట హత్యలు..! : బీహార్ గ్యాంగ్ ఘాతకం

చిన్నారి, వృద్ధురాలిని హత మార్చిన బీహారీ జంట

షాద్ నగర్ నియోజక వర్గం నందిగామ మండలంలో ఘటన

కొన్ని గంటల వ్యవధిలోనే హంతకులను పట్టుకున్న నందిగామ పోలీసులు

హంతకుల వేటలో నందిగామ సీఐ రామయ్య నేతృత్వంలో నాలుగు పోలీసు బృందాలు

పోలీసుల అదుపులో హంతకులు..!

అభం శుభం తెలియని 9 ఏళ్ల బాలిక, 60 ఏళ్ల వృద్ధురాలు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన షాద్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని నందిగామలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. అయితే, వీరిని ఎవరు, ఎందుకు హత్య చేశారనే కోణంలో స్ధానిక సీఐ రామయ్య నేతృత్వంలో పోలీసులు క్లూస్‌ టీంతో సహా దర్యాప్తు చేశారు.

కేవలం హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు చాకచక్యంగా వలపన్ని హంతకులను అరెస్టు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం చిన్నారిని, వృద్ధురాలిని హత్య చేసిన హంతకులు పోలీసుల అదుపులో ఉన్నారు. నందిగామ సిఐ రామయ్య సంఘటన స్థలాన్ని సందర్శించి శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డికి సమాచారం అందించగా వారు రంగంలోకి దిగారు. రాత్రికి రాత్రి నాలుగు పోలీసు బృందాలు హంతకుల కోసం జల్లెడ పట్టాయి. ఈ నేపథ్యంలో హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే బీహార్ కు చెందిన ఇద్దరు భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం వారిని పోలీసు కస్టడీలో ఉంచినట్టు తెలుస్తోంది.

అసలేం జరిగింది..?

స్థానికుల కథనం ప్రకారం నందిగామ మండల కేంద్రానికి చెందిన కృష్ణ, శశికళ దంపతులు కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి ఇంటి పక్కనే వారి బంధువు పార్వతమ్మ(60) అంగన్‌వాడీ ఆయాగా పనిచేసేకుంటూ ఒంటరిగా ఉంటోంది. దీంతో కృష్ణ, శశికళల కూతురు భానుప్రియ(9) నాలుగేళ్లుగా పార్వతమ్మకు తోడుగా ఆమె వద్దే ఉంటోంది. ఈ క్రమంలో రెండు రోజులుగా భానుప్రియ కనిపించడం లేదని ఆ చిన్నారి తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి పార్వతమ్మ ఇంటికి వెళ్లి చూశారు. అప్పటికే భానుప్రియ రక్తపు మడుగులో పడి ఉంది. ఆ బాలికను మెడపై గుర్తు తెలియని వ్యక్తులు కోసి హత్య చేసినట్టు గుర్తించారు. అంతేకాకుండా పార్వతమ్మపై కూడా దాడి చేసినట్లు గుర్తించారు. వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. కొన ఊపిరితో ఉన్న పార్వతమ్మను షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. రెండు రోజుల క్రితం బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి పార్వతమ్మ ఇంట్లో అద్దెకు దిగాడు. ఈ హత్య తర్వాత అతను కనిపించడం లేదని స్థానికులు తెలిపారు. జంట హత్యలపై నందిగామ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని డీసీపీ నారాయణరెడ్డి పరిశీలించారు.

బంగారం నగదు కోసమే

ఇంట్లో అద్దెకు దిగిన బిహారీలు ఆలుమగల జంట ఇంత ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న పార్వతమ్మ, చిన్నారి భానుప్రియలను హతమార్చి ఆమె వద్ద ఉన్న బంగారం నగదు దోచుకెళ్లడానికి మర్డర్ ప్లాన్ చేశారు. ఇంట్లో వారిని లక్ష్యంగా చేసుకొని దారుణాతి దారుణంగా హింసించి చంపారు. అయితే కొన ఊపిరితో ఉన్న పార్వతమ్మ మార్గమధ్యలో మరణించింది. స్థానికులు నందిగామ సిఐ రామయ్యకు ఈ విషయం చెప్పగా రంగంలోకి దిగిన రామయ్య తదితర పోలీసు బృందాలు హంతకులను వెంటాడి వేటాడి పట్టుకున్నారు. పోలీసులు చాకచక్యంగా వలపన్ని పట్టుకోవడంతో వారు దొరికారు. లేకపోతే వారు వారి బీహార్ రాష్ట్రానికి గుట్టుగా వెళ్లిపోయేవారు. కేవలం గంటల వ్యవధిలోనే మర్డర్ కేసు చేదించిన నందిగామ సిఐ రామయ్య తదితర పోలీసు బృందంపై స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

నేడు వరంగల్‌ జిల్లాలో కేటీఆర్‌ పర్యటన

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

సిటీ సమీపంలోని గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే నన్నపునేని

 తెలంగాణ పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ శనివారం వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

గీసుగొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో రూ.840 కోట్లతో యంగ్‌వన్‌ కంపెనీ ఎవర్‌ టాప్‌ టెక్స్‌టైల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో చేపట్టే వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. పార్కు నుంచి మంత్రి కేటీఆర్‌ హెలిక్యాప్టర్‌ ద్వారా ఖిలావరంగల్‌కు చేరుకుంటారు. మొదట వరంగల్‌లోని నర్సంపేట రోడ్డులో ఉన్న ఓ సిటీలో నిర్మాణం పూర్తి చేసుకున్న వరంగల్‌తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కేటీఆర్‌ ప్రారంభిస్తారు. ఆ తర్వాత సమీపంలో ఉన్న అజంజాహిమిల్స్‌ గ్రౌండ్‌లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీవోసీ) నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేస్తారు.

అనంతరం దేశాయిపేట వద్ద రూ.12.60 కోట్లతో ప్రభుత్వం నిర్మించిన 200 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను, వరంగల్‌లో రూ.135 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న పదహారు స్మార్టు రోడ్లను కూడా వరంగల్‌చౌరస్తా వద్ద కేటీఆర్‌ ప్రారంభిస్తారు. రూ.75 కోట్లతో వరంగల్‌ మోడ్రన్‌ బస్‌స్టేషన్‌, రూ.313 కోట్లతో ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణ పనులకూ ఆయన శంకుస్థాపన చేస్తారు.

కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ(కుడా) జీ ఫ్లస్‌ ఫైవ్‌ అంతస్తులతో బస్‌స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అజంజాహిమిల్స్‌ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ జరగనుంది. 50 వేల మందితో నిర్వహించనున్న ఈ సభలో మంత్రి కేటీఆర్‌ పాల్గొని ప్రసంగిస్తారని వరంగల్‌తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ తెలిపారు. ఈ మేరకు సభాస్థలిని శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు......

నిజామాబాద్ జిల్లాకు రానున్న హైకోర్టు న్యాయమూర్తి

నిజామాబాద్:జూన్ 17

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మిస్ట్రేటివ్ జడ్జి శ్రీసుధ శనివారం జిల్లాకు రానున్నారు. హైకోర్టు న్యాయమూర్తి సమావేశపు హల్ లో జిల్లాలోని వివిధ కోర్టులకు చెందిన న్యాయాధికారులతో సమావేశమై న్యాయస్థానాలలో సివిల్,క్రిమినల్ కేసుల వివరాలు, న్యాయ విచారణ తీరుతెన్నులు సమీక్షీస్తారు.

న్యాయాధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేస్తారు.అనంతరం న్యాయసేవ సదన్ లో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించ నున్న”పోస్టల్ భీమా పథకాలు”అనే అంశంపై జరుగనున్న సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రధానోపన్యాసం చేసి సర్టిఫికెట్లనుప్రధానం చేస్తారు..

సదస్సులో అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ,జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఛైర్ పర్సన్ సునీత కుంచాల, సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి,జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు,

ఇంచార్జీ పోలీస్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవదాస్ చాందక్,పోస్టల్ డిపార్ట్మెంట్ సీనియర్ మేనేజర్ మదన్ మోహన్ ఖాంది తదితరులు పాల్గొంటారు...

నెత్తురు పారుతున్న రోడ్లు : మూడు వేరు వేరు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం

రాష్ట్రంలో రోడ్లు నెత్తురోడాయి! వాహనదారుల నిర్లక్ష్యం.. మితిమీరిన వేగానికి నిండు ప్రాణాలు బలయ్యాయి! వారి ఇళ్లలో అంతులేని విషాదం నెలకొంది! శుక్రవారం మూడు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో తోబుట్టువులైన ఇద్దరు చిన్నారులున్నారు. వారి తల్లిదండ్రుల పరిస్థితి విషమంగా ఉంది.

ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో ద్విచక్రవాహనాన్ని వరంగల్‌-2 డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది! ఆ బైక్‌పై ప్రయాణిస్తున్న కొత్తూరు మొట్లగూడెం గ్రామపంచాయతీ పరిధి శ్రీరాంనగర్‌ గొత్తికోయగూడానికి చెందిన మాడివి సురేశ్‌, కుమారి దంపతులు, వారి ఇద్దరు కుమారులు శివ (11), నవీన్‌ (5) కిందపడ్డారు. శివ, నవీన్‌పై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన సురేశ్‌, కుమారిని తొలుత ఏటూరునాగారంలోని ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. ఇద్దరి పరిస్థితీ విషమంగానే ఉంది.

వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం సుల్తాన్‌పూర్‌ శివారులో 16 మంది ప్రయాణికులతో పరిగి వైపు వెళుతున్న ఓ ఆటోను కొడంగల్‌ వైపు వెళుతున్న కారు ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న అందరూ గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా పీర్లగుట్ట తండాకు చెందిన హేమిబాయి (58), కొత్తపల్లికి చెందిన బోయిని అంజిలమ్మ (48), గుండాలకు చెందిన దార శశికళ (45) మృతిచెందారు. శశికళ ఇద్దరు పిల్లలు కావ్యశ్రీ, కార్తీక్‌లకు గాయాలయ్యాయి. పిల్లలను పరిగి ప్రభుత్వ హాస్టల్‌లో చేర్పించేందుకు, వారిని వెంటబెట్టుకొని శశికళ బయలుదేరగా ఈ ప్రమాదం జరిగింది. మిగతా ప్రయాణికుల్లో తీవ్ర గాయాలైన చంద్రమ్మ, పోచమ్మలను హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు.

ఇక కారులో ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకోవడంతో డ్రైవర్‌ సురేశ్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలం రాయిచెడి గ్రామంలో ఓ ఇంటి వద్ద చెట్టు కింద కూర్చుని సేదతీరుతున్న నలుగురు మహిళలపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంటి యజమాని, ఆశా కార్యకర్త అమృతమ్మ (37) అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడ్డ మహిళలు అనిత, హేస్సేనమ్మలను అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనిత మృతిచెందింది. హుస్సేనమ్మను మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు......,...

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమల :జూన్ 17

తిరుపతి దేవస్థానం శనివారం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

క్యూ కాంప్లెక్స్‌ లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది

కాగా నిన్న శుక్రవారం శ్రీవారిని 72,299 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం 3.92 కోట్ల రూపాయలు వచ్చినట్టు

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 36,378 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.....

Bapatla: 'మేమే మీకు రూ.లక్ష ఇస్తాం.. దయచేసి వెళ్లిపోండి'.. ఎంపీ మోపిదేవికి నిరసన సెగ..

చెరుకుపల్లి: బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఉప్పలవారిపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పదో తరగతి చదువుతున్న ఓ బాలుడిని ఒక యువకుడు పెట్రోలు పోసి సజీవ దహనం చేసిన ఘటన రాజోలులో శుక్రవారం ఉదయం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే..

జిల్లాలోని ఉప్పలవారిపాలెంలో ఇవాళ బాలుడి అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే, బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు గ్రామానికి వచ్చిన వైకాపా ఎంపీ మోపిదేవి వెంకటరమణకు నిరసన సెగ తగిలింది. గ్రామంలోకి రావొద్దంటూ బాలుడి బంధువులు, స్థానికులు ఎంపీని అడ్డుకున్నారు. కనీసం బాధిత కుటుంబం ఉంటున్న ఇంటివద్దకు కూడా ఎంపీని వెళ్లకుండా అడ్డుకున్నారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఇంత పెద్ద ఘటన జరిగితే తీరిగ్గా పరామర్శించేందుకు వచ్చారా? అంటూ గ్రామస్థులు ప్రశ్నించారు. అయితే, తాను వ్యక్తిగతంగా కలిసి రూ.లక్ష పరిహారం అందించేందుకు వచ్చానని మోపిదేవి చెప్పగా.. ''మేమే మీకు రూ.లక్ష ఇస్తాం.

దయచేసి ఇక్కడినుంచి వెళ్లిపోండి. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి'' అని గ్రామస్థులు హెచ్చరించారు. దీంతో చేసేదిలేక మోపిదేవి అక్కడినుంచి వెళ్లిపోయారు. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగి పికెట్‌ ఏర్పాటు చేశారు.

ఈ నెల 19 నుంచి వర్షాలు : వాతావరణశాఖ ప్రకటన

ఈ నెల 19 నుంచి వర్షాలు ఉన్నట్లు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ఈ నెల 18 నుంచి 21 మధ్య ఋతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది..

ఈ నెల 19 నుంచి తిరుపతి, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, వైయస్సార్, చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

కోస్తాంధ్రలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ నెల 19 నుంచి వర్షాలు ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది..

SB NEWS