మహిళా ప్రాణాలు కాపాడిన ఆర్పిఎఫ్ మహిళ కానిస్టేబుల్

వరంగల్ జిల్లా :జూన్ 11

రైల్వేస్టేషన్‌లో ఆర్పీఎఫ్ మహిళ కానిస్టేబుల్ సోనాలి మాల్కే ఓ మహిళ ప్రాణాల్ని కాపాడారు.

శనివారం రాత్రి మణుగూరు ఎక్స్‌ప్రెస్ నుంచి స్టేషన్‌లో దిగుతుండగా ఓ మహిళ కాలు జారి కిందపడిపోయింది.

దీంతో వెంటనే అప్రమత్తమై మహిళ కానిస్టేబుల్ పరిగెత్తుకెళ్లి కిందపడబోయిన ఆ మహిళను కాపాడారు.

మహిళ ప్రాణాల్ని కాపాడిన సోనాలి మాల్కేను ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు, ప్రయాణీకులు అభినందించారు...

ధర్మపురిలో కత్తిపోట్ల కలకలం

జగిత్యాల జిల్లా:జూన్ 10

ధర్మపురి పట్టణంలో ఇద్దరు యువకులు శనివారం సాయంత్రం కత్తిపోట్లకు గురయ్యారు.

ప్రతి శనివారం జరిగే వారం సంత వసూళ్లకు వెళ్లిన ఇద్దరు స్థానిక యువకులపై ఆంధ్ర హోటళ్లో పని చేసే యువకులు కత్తులతో దాడి చేసి గాయపరిచినట్లు సమాచారం.

ఈ ఘటనలో ఇద్దరు యువకులకు మెడ పక్క టెముకల భాగంలో తీవ్ర గాయాలు కాగా ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో ఎంత మంది పాల్గొన్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ దాడికి పాత కక్షలు, ఆస్తి తగాదాలు, ప్రేమ వ్యవహారం అయి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఇదే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే, కత్తిపోట్ల ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుపతి:జూన్ 11

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

క్యూ కాంప్లెక్స్‌ లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.

కాగా నిన్న శనివారం శ్రీవారిని 88,626 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి హుండీ ఆదాయం 3.29 కోట్ల రూపాయలు వచ్చినట్టు

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 51,379 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు....

గ్రూప్‌-1 అభ్యర్థులకు కీలక సూచనలు..

తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షకు సర్వం సిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్ష కోసం 3,80,072 మంది దరఖాస్తు చేసుకోగా..

మొత్తం 33 జిల్లాల్లో 994 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 10:30 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. గతంలో ఈ ప్రశ్నాపత్రాలు లీక్‌ అవడంతో ఈసారి పటిష్ట ప్రణాళికతో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు చేసింది.

పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేస్తారు

పరీక్ష కేంద్రంలోకి వాచీలు, హ్యాండ్‌ బ్యాగ్‌లు, పర్సులకు అనుమతి నిరాకరణ

అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకోవాలి. షూ ధరించకూడదు

నలుపు లేదా నీలం రంగు పెన్ను మాత్రమే వాడాలి

జెల్, ఇంకు పెన్ను, పెన్సిళ్లను స్కానర్‌ గుర్తించదు

వైట్‌నర్‌, చాక్ పౌడర్, బ్లేడు, ఎరేజర్‌తో బబ్లింగ్‌ చేసే ఓఎంఆర్‌ షీట్‌ చెల్లదు

3 పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలను గెజిటెడ్‌ అధికారితో సంతకం చేయించి తీసుకురావాలి..

JP Nadda: రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారింది.. ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదు..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.. ఏపీ సర్కార్‌ అత్యంత అవినీతిలో కూరుకుపోయిందన్న ఆయన..

మైనింగ్, ఇసుక, లిక్కర్, ల్యాండ్, ఎడ్యుకేషన్ స్కామ్‌లతో ఈ ప్రభుత్వం మునిగిపోయిందని ఆరోపించారు. ఏ స్కామ్ లు ఉన్నాయో.. అన్నింటినీ చేస్తున్నారని దుయ్యబట్టారు.. ఏ ప్రభుత్వం చేయాని విధంగా వైసీపీ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు..

శ్రీకాళహస్తిలో జరిగిన బీజేపీ మహాజన్‌ సంపర్క్‌ అభియాన్‌ సభకు హాజరైన ఆయన ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారు.. కానీ, ఇప్పటికీ అక్కడ ఏమీ జరగలేదని ఫైర్‌ అయ్యారు జేపీ నడ్డా.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిందన్న ఆయన.. రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయి.. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు.

రాయలసీమ అభివృద్ధిని వైసీపీ సర్కార్‌ గాలికి వదిలేసింది అని విమర్శించారు జేపీ నడ్డా.. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండని విజ్ఞప్తి చేశారు.. దేశంలో మోడీ ఓటు బ్యాంక్ రాజకీయాలను మార్చారు. ఓటు బ్యాంక్ రాజకీయాలను జవాబుదారీ రాజకీయాలుగా, ఫలితాలు చూపే పారదర్శక రాజకీయాలుగా మార్చిన ఘనత మోడీ దే అన్నారు.. 9 ఏళ్లుగా ఈ దేశానికి మోడీ సుపరిపాలన అందించారన్న ఆయన.. బలహీన, అణగారిన వర్గాల వారి కోసం పాటుపడిన పేదల ప్రభుత్వం ఇది.. కరోనా సమయంలో దేశంలోని పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేశామని గుర్తుచేశారు.

మోడీ వచ్చాక మన దేశంలో పేదరికం రేటు తగ్గిందన్న నడ్డా.. స్వాతంత్య్రం వచ్చాక జరిగిన అభివృద్ధితో పోల్చుకుంటే మోడీ వచ్చాక ఈ 9 ఏళ్లలోనే ఎన్నో రెట్లు ఎక్కువ అభివృద్ది జరిగిందన్నారు. ప్రపంచంలోనే మన దేశం వేగంగా ఆర్థిక వృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు జేపీ నడ్డా..

ఇక, బీజేపీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు. దేశమంతా అభివృద్ధి జరగాలన్నదే బీజేపీ విధానం అని స్పష్టం చేశారు నడ్డా.. ఓటు బ్యాంకు రాజకీయాలతో అభివృద్ధి జరగదు. ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. తొమ్మిదేళ్లలో బీజేపీ అనేక విజయాలు సాధించిందన్నారు.. ఎన్డీఏ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతోంది. పేదల పక్షపాతిగా మోడీ పాలన అందిస్తున్నారు. అభివృద్ధి అజెండాగానే బీజేపీ తొమ్మిదేళ్ల పాలన సాగిందన్నారు..

బీజేపీ అగ్ర నేతలతో టచ్‌లో ఉన్న ఈటల.. ఏం జరుగుతోంది..!

ఢిల్లీ: తెలంగాణ బీజేపీలో సమూల మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు అవలంబించాల్సిన వ్యూహంపై గత కొద్ది నెలలుగా ఢిల్లీ బీజేపీ అగ్రనేతలతో జరుపుతున్న చర్చలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.

రెండు రోజులుగా బీజేపీ అగ్ర నేతలతో ఈటల రాజేందర్ టచ్‌లో ఉన్నారు. ఇప్పటికే పలువురు బీజేపీ జాతీయ నేతలను కలిశారు.

తెలంగాణలో జరుగుతున్న తాజా పరిణామాలను హైకమాండ్‌కు ఈటల వివరిస్తున్నారు. నిన్న అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ‌తో చర్చలు జరిపారు. పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. అనంతరం అసోం నుంచీ ఈటల ఢిల్లీకి బయల్దేరినట్టు తెలుస్తోంది.

ఈరోజు ఢిల్లీలో పలువురి అగ్రనేతలతో ఈటల చర్చలు జరపనున్నట్లు సమాచారం. త్వరలోనే భారీ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నట్లు బీజేపీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు..

మంత్రి సత్యవతి రాథోడ్ చేతిపై కేసీఆర్ పచ్చబొట్టు..!!

కేసీఆర్ దైవసమానులు.. నా..ఊపిరి ఉన్నంత వరకు వారు చేసిన మేలు మరిచిపోను..

బాద.. అయినా భరిస్తూ.., కన్నీళ్ళను ఆనందబాష్పాలుగా బావిస్తూ.. చేతిపై చెరిగిపోని "కేసీఆర్" పేరు పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి సత్యవతిరాథోడ్..

కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అయ్యాకే పాదరక్షలు వేసుకుంటానని..!! పాదరక్షలు లేకుండానే పర్యటిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై భక్తిబావాన్ని.. అభిమానాన్ని చాటుతున్న మంత్రి సత్యవతిరాథోడ్..

కేసీఆర్ పై ఉన్న ఆరాధనభావం ఆ..బాదను భరించేలా చేసింది...!ఆ..నాయకునిపై ఉన్న అభిమానం కన్నీళ్ళను కట్టడిచేసింది..!!వద్దని వారించినా.. నొప్పి అని నచ్చచెప్పాలని చూసిన.. చెరిగిపోని పచ్చబొట్టు రూపంలో తమ నాయకుని పేరు తన చేతిపై ఉండాలని మంత్రి సత్యవతిరాథోడ్ కేసీఆర్ పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నారు.

హైదరాబాద్ బంజారభవన్ లో జరిగిన గిరిజన సాంస్కృతికోత్సవాలలో మంత్రి సత్యవతిరాథోడ్ పాల్గొన్నారు. స్టాల్స్ ను పరిశీలిస్తూ పచ్చబొట్టుస్టాల్ దగ్గర ఆగిపోయారు. తన చేతిపైన కేసీఆర్ పేరు పచ్చబొట్టు వేయాలని కోరారు..!!పక్కనే ఉన్న అధికారులు, గిరిజనసంఘాల నాయకులు వద్దు మేడమ్ చాలా నొప్పిగా ఉంటుందని వారించే ప్రయత్నం చేసారు.

అయినా నిర్ణయం తీసుకున్న తర్వాత మరో ఆలోచన చేయడం అలవాటుగా లేని మంత్రి సత్యవతిరాథోడ్ పచ్చబొట్టు వేసే మహిళ ముందు కూర్చొని చేయందించారు. ఏకంగా రాష్ట్రమంత్రి వచ్చి పచ్చబొట్టు వేయమనడంతో ఆ..ఆదివాసీ మహిళ కాస్త కంగారు పడింది..

మంత్రి సత్యవతిరాథోడ్ ఆమెతో మాటలు కలిపింది... కొమరంబీమ్ సహచరుడు వెడ్మ రాము కోడలును నేనంటూ ఆ.. ఆదివాసీ మహిళ తనను పరిచయం చేసుకోవడంతో మంత్రి మరింతగా సంతోషపడింది..సొంత సోదరిలా... సోపతిదారులా మంత్రి మనసునిండా మాట్లాడుతుంటే ఆ..ఆదివాసీ బిడ్డ ఆనందపడిపోయింది.

మంత్రి సత్యవతిరాథోడ్ చేయిపై *కేసీఆర్ అనే అక్షరాలను పచ్చబొట్టు వేసేసింది..

రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశుసంక్షేమశాఖల

మంత్రి సత్యవతిరాథోడ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉన్న అభిమానం ముందు పచ్చ వేయడానికి వాడిన సూదిపోట్లు చిన్నబోయాయి..!!

తన చేతిపై కేసీఆర్ పేరు పచ్చబొట్టును చూసుకుని ఆనందబాష్పాలు నిండిన కన్నులతో.. అభిమానం నిండిన హృదయంతో మంత్రి సత్యవతిరాథోడ్ మురిసిపోయారు.

ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్సు దగ్ధం

ఖమ్మం జిల్లా:జూన్ 10

ఖమ్మం నుండి కోదాడ వెళ్తున్న స్కూల్ బస్సు షార్ట్​సర్క్యూట్ తో నేలకొండపల్లి మండల కేంద్రంలో దగ్ధమైంది. దగ్ధమైన బస్సు కోదాడ కు చెందిన తేజ టాలెంట్ స్కూల్ బస్సుగా గుర్తించారు.

అయితే ఈ బస్సు ఖమ్మంలోని ముస్తఫానగర్ లో శనివారం జరిగిన ఓ పెళ్లి రిసెప్షన్ కార్యక్రమంకు హాజరై కోదాడకు వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ముప్పై మంది పెళ్లి బృందం సభ్యులు అందులో ఉన్నారు.

బస్సులో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సు ను పక్కకి ఆపి వెంటనే పెళ్లి బృందం సభ్యులను వేరే బస్సు ఎక్కించి పంపారు. అందరూ దిగిన కొద్ది సేపట్లోనే మంటలు పెరిగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ ఆ సమయంలో అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.

గ్రామ శివారులో ఈ ప్రమాదం జరగటంతో చుట్టూ పక్కల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాటర్ ట్యాంక్ లతో మంటలను ఆర్పి వేశారు. సమయానికి స్థానికంగా పైర్ ఇంజన్ కూడా లేదు..

అప్సర హత్య రిమాండ్ రిపోర్ట్..

ఎక్స్‌క్లూజివ్.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..

హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని అప్సర హత్య కేసు పెను సంచలనమైంది. నగరంలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఈ హత్య గురించే చర్చించుకునేంత పరిస్థితి. అప్సరను సాయికృష్ణ ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది..? హత్యకు ముందు ఏం జరిగింది..? హత్య తర్వాత అసలేం జరిగింది..? పోలీసు విచారణలో సాయి ఏం చెప్పాడు..? అనే విషయాలు తెలుసుకోవడానికి జనాలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ కేసులో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. ఇప్పటికే పెను సంచలన విషయాలు బయటికి రాగా.. తాజాగా అప్సర హత్య రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

రిమాండ్ రిపోర్టు యథావిధిగా..

‘గత ఏడాది ఏప్రిల్ నుంచి సాయికృష్ణ -అప్సర మధ్య పరిచయం ఏర్పడింది. బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా సందేశాలు చేశాడు సాయి. నవంబర్‌లో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని ఇద్దరూ కలిసి సందర్శించారు. నవంబర్‌లో గుజరాత్ వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది.

వాట్సాప్ ద్వారా అప్సరకు సాయి లవ్ ప్రపోజ్ చేశాడు. కొద్దిరోజుల తర్వాత పెళ్లి చేసుకోమని అప్సర.. సాయిపై ఒత్తిడి తెచ్చింది. తనను పెళ్లి చేసుకోకపోతే సాయిని రోడ్డుకు ఈడుస్తానని అప్సర బ్లాక్ మెయిల్ చేసింది. అప్సరను అడ్డు తొలగించుకునేందుకే సాయి హత్య చేశాడు. హత్యకు వారం రోజుల ముందు How To Kil Human Being అని కొట్టి గూగుల్‌లో సాయి వెతికాడు. తనను కోయంబత్తూర్‌కు తీసుకెళ్లాలని పలుమార్లు సాయిని అప్సర కోరింది. అప్సరను చంపేందుకు కోయంబత్తూర్ టూర్‌ను అడ్డుపెట్టుకున్నాడు.

జూన్-3న రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్‌కు టికెట్ బుక్ చేశానని అప్సరను సాయి నమ్మించాడు. ప్రియుడి మాటలు నమ్మి సరూర్‌నగర్ నుంచి కారులో అప్సర వెళ్లింది. అదే రోజు 8:15 గంటలకు సరూర్‌నగర్‌లో ఇద్దరూ కారులో బయల్దేరి వెళ్లారు. రాత్రి 9 గంటలకు శంషాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకున్న తర్వాత టికెట్ బుక్ చేయలేదని అప్సరతో చెప్పాడు. అక్కడి నుంచి గోశాలకు వెళ్తున్నట్లు అప్సరకు సాయి చెప్పాడు. డిన్నర్ కోసం రాల్లగూడ వద్ద ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర సాయి కారు ఆపాడు. అప్పటికే ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో అప్సర వాంతులు చేసుకుంది. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. 12 గంటలకి సుల్తాన్‌పల్లిలో ఉన్న గోశాలకు చేరుకున్నారు. 3:50 గంటలకు వెంచర్ వైపు ఇద్దరూ వెళ్లారు. అప్సర నిద్రలో ఉండగా సాయి హత్య చేశాడు’ అని రిమాండ్ రిపోర్టులో ఉంది..

ఆ ఇద్దరు నేతల వల్లే ఏపీ బొక్కబోర్లా పడింది..

మరోసారి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు

సంగారెడ్డి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మంత్రి హరీష్‌రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నేతల వల్ల ఏపీ బొక్కబోర్లా పడిందని.. వాళ్ళది ప్రచారం ఎక్కువ.. మనది పని ఎక్కువ అని అన్నారు. గతంలో ఒకరు హైటెక్ పాలన అంటూ హడావుడి చేశారని... ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. శనివారం సంగారెడ్డిలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సుపరిపాలన దినోత్సవంలో మంత్రి పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి చూస్తే తెలంగాణ గొప్పతనం తెలుస్తుందన్నారు.

కేసీఆర్ తలయెత్తుకునేలా పాలన అందించారని గొప్పగా చెప్పుకొచ్చారు. కొత్త రాష్ట్రం అయినా సుపరిపాలన అందించారన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని తెలిపారు. కేంద్ర, అన్ని రాష్ట్రాల ఉద్యోగుల వేతనాల కంటే ఎక్కువ వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే అని పేర్కొన్నారు. తెలంగాణ చేస్తున్న మంచి పనులు చూసి కేంద్రం తట్టుకోలేకపోతుందని మంత్రి విమర్శించారు.

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన లక్షా 30 వేల కోట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ వస్తే దళారి వ్యవస్థ వస్తుందని.. కేసీఆర్‌ర్ నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తారని చెప్పారు. తెలంగాణ వస్తే నక్షలైట్ల రాజ్యం వస్తుందని.. హైదరాబాద్‌లో కర్ఫ్యూ ఉంటుందని.. అంతా చీకటేనని చాలా మంది చెప్పారని గుర్తుచేశారు.

ఈ 9 ఏళ్లలో అది నిజం కాదని కేసీఆర్ చేసి చూపెట్టారన్నారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని.. కేంద్రమే తెలంగాణకి అవార్డులు ఇస్తుందన్నారు. రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వ్యతిరేక శక్తులకు ఇది చెంపపెట్టన్నారు. తెలంగాణ విభజనని వ్యతిరేకించి తప్పు పని చేశానని లగడపాటి అన్నట్టు గుర్తు అని... ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో లేరన్నారు. నవ్విన చోటే నాప పండు పండించినట్టు కేసీఆర్ తల ఎత్తుకునేలా చేశారని చెప్పుకొచ్చారు. కేంద్రం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చుకుందని ఆయన వ్యాఖ్యలు చేశారు.

‘‘మనం ఆడిట్ బాగా చేస్తున్నామని మన దగ్గర ఉన్న ఆడిట్ డైరెక్టర్‌ను ఢిల్లీకి పిలుచుకున్నారని’’ అన్నారు. తెలంగాణలో సర్పంచులు అందరూ ఓ బస్సులో గుజరాత్, మహారాష్ట్ర వెళ్లి అక్కడ అభివృద్ధి ఎలా ఉందో చూడాలన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పనితనానికి.. బీఆర్‌ఎస్ మోడల్ సర్కార్ పనితనానికి తేడా తెలుస్తుందన్నారు. ‘‘అస్సాం ముఖ్యమంత్రి స్వయంగా కరెంట్ సరిపోవట్లేదు కరెంట్ పొదుపుగా వాడాలని చెప్పారు. మనకి ఢిల్లీల అవార్డులు ఇస్తారు.. గల్లీల తిడుతారు. ధరణి వల్లే రైతుల సమస్య పరిష్కారం అయ్యింది. ధరణి రాకముందు రైతుల కష్టం అంతా ఇంతా కాదు. ధరణి తీసేయాలని కాంగ్రెస్ చెబుతుంది. ధరణి తీసేస్తే.. కాంగ్రెస్ కార్యకర్తలకే రైతు బంధు ఇస్తారు. నిజాలను ప్రచారంలో పెట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. కాంగ్రెస్ వాళ్లు మళ్ళీ వస్తే దళారీ వ్యవస్థ రాజ్యామేలుతుంది. తెలంగాణ దేశానికి దిక్సుచిగా నిలవాలంటే మూడోసారి కేసీఆర్ రావాలి’’ అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు..